బ్యాంకులను బలోపేతం చేస్తాం
♦ వృద్ధి జోరుకు ఇది చాలా కీలకం
♦ అవసరమైతే మరింత మూలధనం
♦ ఎగవేతదారులను వదిలిపెట్టం..
♦ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు
ఒసాకా/న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పటిష్టంగా ఉందని, వృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకు వీలుగా వ్యవస్థలో ఏవైనా లోపాలు, అడ్డంకులు ఉంటే సరిదిద్దే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మరోపక్క, ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ) పనితీరును మెరుగుపరచడం, వాటిని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. తద్వారా వృద్ధి జోరుకు బ్యాంకులు ఆసరాగా నిలిచేందుకు దోహదం చేస్తుందన్నారు. పీఎస్‌బీల సీఈఓలతో నేడు(సోమవారం) సమీక్షా సమావేశం, ఆర్‌బీఐ పాలసీ సమీక్ష రేపు(మంగళవారం) జరగనున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘మొండిబకాయిల రికవరీ విషయంలో ప్రభుత్వం బ్యాంకులకు తగినన్ని అధికారాలిచ్చింది. ఆర్థికంగా బ్యాంకులను మరింత పరిపుష్టం చేయాల్సిందే. అవసరమైతే బడ్జెట్‌లో ప్రకటించినదానికంటే అధికంగానే మూలధన నిధులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. బ్యాంకుల అధిపతులుతో జరిగే సమావేశంలో ఈ అంశాలన్నింటినీ చర్చించనున్నాం’ అని జైట్లీ వివరించారు. ఇక ఆర్‌బీఐ పాలసీ సమీక్షపై మీకున్న అంచనాలేంటన్న ప్రశ్నకు... నిర్ణయం వెలువడటానికి ముందు తానేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు.
రుణ ఎగవేతదారులను నిద్రపోనివ్వం...
బ్యాంకులకు రుణ బకాయిలను చెల్లించకుండా ఎగవేసిన వాళ్లను(డిఫాల్టర్ల)ను వదిలిపెట్టబోమని, వాళ్లకు నిద్రలేకుండా చేస్తామని జైట్లీ హెచ్చరించారు. మొండిబకాయిల కారణంగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్చి క్వార్టర్‌లో రూ.15,000 కోట్లకు పైగా భారీ నష్టాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, కొన్ని రంగాల్లో వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం వల్లే చాలావరకూ ఎన్‌పీఏలు ఎగబాకుతున్నాయని, అంతేకానీ దీనికి మోసాలు కారణం కాదని ఆర్థిక మంత్రి చెప్పారు.
ఎన్‌పీఏలకు కేటాయింపులు(ప్రొవిజనింగ్) పెరగడంవల్లే ఎక్కువ బ్యాంకులు నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని.. నిర్వహణపరంగా వాటి పనితీరు బాగానే ఉందన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇప్పుడున్న స్థాయికంటే మరింత పెరిగితే మన ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందేనని జైట్లీ అభిప్రాయపడ్డారు. క్రూడ్ ధర తాజాగా ఏడు నెలల గరిష్టానికి(బ్యారెల్ 50 డాలర్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే.