ముంబై: మొండిబాకీలు (ఎన్‌పీఏ) భారీగా పేరుకుపోవడానికి గత యూపీఏ ప్రభుత్వ హయాంలో విచక్షణారహితంగా రుణాలివ్వడమే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. 2008 నాటి అంతర్జాతీయ సంక్షోభానికి ముందు, ఆ తర్వాత అడ్డగోలుగా రుణాలివ్వడం జరిగిందని, వాటి ఆధారంగా యూపీఏ ప్రభుత్వం అధిక స్థాయిలో జీడీపీ వృద్ధిని చూపించుకుందని ఆయన విమర్శించారు.
‘ప్రతీ సంవత్సరం 28 లేదా 31 శాతం మేర రుణ వృద్ధిని ఆధారంగా చూపించి అధిక జీడీపీ రేటు సాధించామని చెప్పుకున్నారంటే... రాబోయే రోజుల్లో చరిత్ర దాన్ని కచ్చితంగా విచక్షణారహిత రుణాల వృద్ధిగానే పరిగణిస్తుంది. ఇది భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది‘ అని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ వ్యాఖ్యానించారు.
ప్రస్తుత ఎన్డీయే హయాంలో అధిక వృద్ధి గణాంకాలపై అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, మొండిబాకీలకు బ్యాంకర్లు కూడా కారణమేనని ఆయన వ్యాఖ్యానించారు. లాభసాటి కాని ప్రాజెక్టులకు కూడా యూపీఏ హయాంలో బ్యాంకర్లు రుణాలిచ్చారని, అవి సమస్యాత్మకంగా మారినా కూడా పట్టించుకోకుండా తోడ్పాటు అందించడం కొనసాగించారని జైట్లీ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ మొండిబాకీల రికవరీల కోసం కొత్త కొత్త మార్గాలు అన్వేషించాల్సి వస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment