న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ వృద్ధి తిరోగమనానికి అడ్డుకట్ట పడిందని, మళ్లీ పురోగమన బాట పట్టిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రెండో త్రైమాసికంలో ఎకానమీ వృద్ధి గణాంకాలు ఇందుకు ఊతమిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రీ–బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఆర్థికవేత్తలతో భేటీ అయిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. దాదాపు అయిదు త్రైమాసికాల పాటు తగ్గుతూ వచ్చిన ఎకానమీ వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయి నుంచి జూలై–సెప్టెంబర్ క్వార్టర్‌లో 6.3%కి మెరుగుపడిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం ఆర్థిక స్థిరీకరణ మార్గదర్శ ప్రణాళికకి అనుగుణంగా నడుచుకుంటోందని జైట్లీ తెలిపారు. దీని ప్రకారం 2015–16లో ద్రవ్యలోటు 3.9%, 2016–17లో 3.5% ఉండగా.. 2017–18లో 3.2%కి పరిమితం చేయాలని బడ్జెట్‌లో నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. సామాజిక భద్రత పింఛన్‌ను పెంచడం, కార్పొరేట్ ట్యాక్స్‌ను 20% దాకా తగ్గించడం, పింఛను.. ఇన్‌ఫ్రా విభాగాలకు ఉపయోగపడేలా దీర్ఘకాలిక న్యూ ఇండియా బాండ్ల జారీ, ఉపాధి హామీ పథకం కింద పరిహారాన్ని పెంచడం తదితర చర్యలు బడ్జెట్‌లో చేర్చాలంటూ ఆర్థికవేత్తలు జైట్లీకి సిఫార్సు చేశారు.
వృద్ధాప్య పింఛన్‌ను ప్రస్తుతమున్న రూ. 200 నుంచి రూ. 500కి, వితంతువుల పింఛన్‌ను రూ. 300 నుంచి రూ. 500కి పెంచాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ విర్మాని, సాజిద్ చినాయ్ (జేపీ మోర్గాన్ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్), టీఎన్ నీనన్ (బిజినెస్ స్టాండర్డ్ చైర్మన్), అజిత్ రానడే (ఆదిత్య బిర్లా చీఫ్ ఎకానమిస్ట్) తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ప్రజల డిపాజిట్లకు పూర్తి భద్రత కల్పిస్తాం
బ్యాంకుల్లో ప్రజల డిపాజిట్లకు పూర్తి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రతిపాదిత ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లులో సవరణలకూ సిద్ధమేనని సూచనప్రాయంగా తెలియజేశారు. ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లులో బెయిల్–ఇన్ నిబంధనపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు వివరణనిచ్చారు.
బ్యాంకులను పటిష్టపర్చేందుకే ప్రభుత్వం రూ. 2.11 లక్షల కోట్ల మేర మూలధనం సమకూరుస్తోందని, ఈ నేపథ్యంలో ఏ బ్యాంకూ విఫలమయ్యే పరిస్థితే ఉండబోదని చెప్పారు. అయినప్పటికీ ఒకవేళ అలాంటి పరిస్థితే తలెత్తిన పక్షంలో ఖాతాదారుల డిపాజిట్లకు ప్రభుత్వం ‘పూర్తి భద్రత‘ కల్పిస్తుందని, ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టంగానే వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు.
బిల్లు ప్రస్తుతం పార్లమెంటు సంయుక్త కమిటీ ముందు ఉందని, కమిటీ ఏ సిఫార్సులు చేసినా ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. బ్యాంకు దివాలా తీసే పరిస్థితి తలెత్తితే.. గట్టెక్కేందుకు అవసరమైతే సేవింగ్స్ ఖాతాల్లోని సొమ్మును సైతం ఖాతాదారుల అనుమతి లేకుండానే ఎఫ్‌డీల కింద మార్చేయడంతో పాటు కస్టమర్ల హక్కులను కాలరాసేవిగా భావించే పలు నిబంధనలు ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment