ముంబై: అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పట్టాలపైనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భరోసానిచ్చారు. జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5.7 శాతానికి తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తగ్గిన వృద్ధిని పునరుద్ధరించే మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు చెప్పారు. ద్రవ్య క్రమశిక్షణ సవాలేనన్న ఆయన అదే సమయంలో దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
శుక్రవారం ముంబైలో బ్లూమ్‌బర్గ్ నిర్వహించిన ‘భారత ఆర్థిక ఫోరం’ కార్యక్రమంలో జైట్లీ పాల్గొని ఆర్థిక రంగం, బ్యాంకుల విలీనం సహా పలు అంశాలపై మాట్లాడారు. ‘‘ఒకవైపు వ్యయాలు చేస్తూ, బ్యాంకులకు మద్దతు కొనసాగిస్తూ, అదే సమయంలో అత్యుత్తమ ప్రమాణాల మేరకు ద్రవ్య స్థిరత్వం కొనసాగించడం ఎలా సాధ్యమవుతుంది? ఇదే మనం ఎదుర్కొంటున్న సవాలు’’ అని జైట్లీ పేర్కొన్నారు. ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ చక్కగా కొనసాగుతోందని, త్వరలోనే ఇందుకు సంబంధించి సలహాదారుల నియామకం ఉంటుందన్నారు. బలహీన బ్యాంకుల కంటే బలమైన బ్యాంకుల మధ్య విలీనంపై ప్రభుత్వం ఆసక్తితో ఉందని జైట్లీ చెప్పారు.