న్యూఢిల్లీ: మొండిబకాయిలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఏకంగా రూ. 2.11 లక్షల కోట్ల మూలధనం సమకూర్చనున్నట్లు వెల్లడించింది. ఇందులో రూ. 1.35 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో రానుండగా, బడ్జెట్ కేటాయింపుల రూపంలో రూ. 18,139 కోట్లు, ఆయా బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా మరో రూ. 58,000 కోట్లు సమకూరనున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ మేరకు మూలధనం సమకూర్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉపాధి కల్పించే చిన్న, మధ్య స్థాయి సంస్థల రంగానికి ఊతమిచ్చేందుకు, ఆర్థిక వ్యవస్థలో పీఎస్‌బీలు కీలకపాత్ర పోషించేందుకు మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ‘రూ. 2.11 లక్షల కోట్ల అదనపు మూలధనం బ్యాంకులకు సమకూర్చబోతున్నాం.
వీటితో పాటు రాబోయే నెలల్లో మరిన్ని బ్యాంకింగ్ సంస్కరణలు కూడా ఉంటాయి‘ అని పేర్కొన్నారు. బ్యాంకులను పటిష్టం చేసేందుకు కేంద్రం ‘గతంలో ఎన్నడూ చూడని‘, ‘సాహసోపేతమైన‘ నిర్ణయం తీసుకుందని జైట్లీ చెప్పారు. డీమోనిటైజేషన్ తర్వాత బ్యాంకుల్లోకి భారీ స్థాయిలో నిధులు వచ్చి పడినా.. క్యాపిటల్ అడెక్వసీ సమస్య కారణంగా అధిక స్థాయిలో రుణాలివ్వలేని పరిస్థితి నెలకొందని జైట్లీ చెప్పారు.
బ్యాంకుల్లో భారీగా మొండిబాకీలు పేరుకుపోయి.. బ్యాంకుల్లో తగినంత క్యాపిటల్ అడెక్వసీ లేకుండా పోయిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకే కేంద్ర క్యాబినెట్ తాజా నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో 2015 మార్చి నాటికి రూ. 2.75 లక్షల కోట్లుగా ఉన్న నిరర్థక ఆస్తులు 2017 జూన్ నాటికి రూ. 7.33 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. ఇందులో 12 సంస్థలు కట్టాల్సినదే రూ. 1.75 లక్షల కోట్ల మేర ఉంది. ఈ కేసులు ప్రస్తుతం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు ఉన్నాయి.
మొండిబాకీలకు సంస్కరణల మందు ..
గత యూపీఏ ప్రభుత్వ హయాంలో 2008–14 మధ్య కాలంలో పీఎస్‌బీలు ‘విచక్షణారహితంగా‘ రుణాలిచ్చేయడం వల్లే ప్రస్తుతం మొండి బకాయిల సమస్య తలెత్తిందని, తాము చేపట్టిన సంస్కరణలు ఇలాంటి ధోరణులను నివారించగలవని జైట్లీ చెప్పారు. మరిన్ని సంస్కరణలు, రీక్యాపిటలైజేషన్ బాండ్ల స్వరూపం తదితర అంశాల గురించి త్వరలో వివరాలు వెల్లడించగలమన్నారు.
ఆయా బ్యాంకుల పనితీరు, సామర్థ్యాలను బట్టి మూలధనం సమకూర్చడం ఉంటుందని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. అసాధారణ రీక్యాపిటలైజేషన్ చర్యలు.. సమీప భవిష్యత్‌లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేందుకు, ఉద్యోగాల కల్పన .. ఎకానమీ వృద్ధికి దోహదపడే దిశగా సానుకూల ప్రభావాలు చూపగలవని ఆయన చెప్పారు. ఎంఎస్‌ఎంఈలకు రుణసదుపాయం మరింతగా అందుబాటులోకి రాగలదన్నారు.
ఆర్థిక వ్యవస్థ టర్న్‌ఎరౌండ్..
జీడీపీ వృద్ధి మందగించడం ముగిసిపోయిందని, ఎకానమీ క్రమంగా కోలుకుంటోందని విలేకరుల సమావేశంలో దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై వివరణనిస్తూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సీ గర్గ్ తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సైతం రాబోయే సంవత్సరాల్లో భారత్ 8% వృద్ధి రేటు సాధించగలదంటూ అంచనా వేస్తోందని చెప్పారు.
2014 నుంచి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు శాతం దాటబోదని గర్గ్ వివరించారు. విదేశీ మారక నిల్వలు 400 బిలియన్ డాలర్లు దాటాయని, కరెంటు అకౌంటు లోటు స్థూల దేశీయోత్పత్తిలో నిర్దేశిత 2%కి లోబడే ఉంటుందన్నారు. ద్రవ్య లోటు సైతం జీడీపీలో 3.2%కే కట్టడి చేయాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే.. డిసెంబర్‌లో దీన్ని సమీక్షించవచ్చని ఆయన చెప్పారు.
ఎకానమీ మూలాలు పటిష్టంగా ఉన్నాయి...
పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ ప్రభావాల కారణంగా రెండు త్రైమాసికాల్లో వృద్ధి తాత్కాలికంగా కొంత మందగించిందని విలేకరుల సమావేశం సందర్భంగా జారీ చేసిన అధికారిక ప్రకటనలో కేంద్రం పేర్కొంది. అయితే, పారిశ్రామికోత్పత్తి, ఆటోమొబైల్ మొదలైనవన్నీ మెరుగుపడుతున్న నేపథ్యంలో ఆ దశ పూర్తయిపోయినట్లు సూచిస్తోందని, ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే మెరుగైన వృద్ధి గణాంకాలు నమోదు కావొచ్చన్న అంచనాలు ఉన్నాయని తెలిపింది.
వ్యవస్థాగతంగా సంస్కరణలు చేపట్టినప్పుడు కొంత కాలంపాటు ప్రతికూల ప్రభావం పడటం సాధారణమేనని జైట్లీ వ్యాఖ్యానించారు. ‘అయితే, మధ్య కాలికం నుంచి దీర్ఘకాలికంగా భారీ ప్రయోజనాలే ఉంటాయి‘ అని ఆయన తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయన్నారు. గడిచిన మూడేళ్లుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని, రాబోయే రోజుల్లోనూ అధిక వృద్ధి రేటు కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రైవేట్ పెట్టుబడులు కూడా పుంజుకోగలవు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో తక్షణ ఉద్యోగావకాశాలు రాగలవు. అలాగే చిన్న మధ్య తరహా సంస్థలకు రుణాల లభ్యత పెరగడం సైతం ఉపాధి కల్పనకు ఊతమివ్వగలదు‘ అని జైట్లీ వివరించారు. వివిధ రంగాల్లో ప్రభుత్వ వ్యయాలు కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment