న్యూఢిల్లీ: అనుకున్న విధంగా ఆర్థిక వృద్ధి విస్తరణ కొనసాగితే వచ్చే ఏడాది భారత్ బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ఆశాభా వం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు, వాణిజ్య ఘర్షణల రూపంలో సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. నాలుగేళ్ల నుంచి వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిన భారత్, ఆర్థిక విస్తరణ కోసం రానున్న దశాబ్దం వైపు చూడాలన్నారు. భారత్ 2.59 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో 2017లో ఫ్రాన్స్‌ను వెనక్కు నెట్టేసి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు ప్రపంచ బ్యాంకు తాజా గణాంకాలు స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జైట్లీ ఈ అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం.
‘‘వ్యాపార సులభతర నిర్వహణలో భారత ర్యాంకు గణనీయంగా మెరుగుపడడం, పెట్టుబడులకు అనుకూల దేశంగా మారడం చూశాం. ఈ రోజు పెరుగుతున్న ముడి చమురు ధరలు, వాణిజ్య యుద్ధం వంటి సవాళ్లను ఎదుర్కొనే దశలో ఉన్నాం’’ అని జైట్లీ పేర్కొన్నారు.
తలసరి ఆదాయంలో వ్యత్యాసం
‘‘ఫ్రాన్స్‌ను ఏడో స్థానానికి నెట్టేసి భారత్ ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు ప్రపంచ బ్యాంకు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, జనాభాలో తారతమ్యం దృష్ట్యా, రెండు దేశాల తలసరి ఆదాయంలో చాలా వ్యత్యాసం ఉండడం సహజమే’’ అని జైట్లీ పేర్కొన్నారు.
2017–18లో మన దేశ జీడీపీ 6.7 శాతంగా నమోదు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–7.5 శాతం వరకు ఉంటుందన్న అంచనాలున్నాయి. పేదల అభివృద్ధి కోసం పటిష్టమైన విధానాలు, నిధులు ఖర్చు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ నినాదాలకే పరిమితమైందని విమర్శించారు. దీంతో పేదలు అభివృద్ధి చెందలేకపోయినట్టు చెప్పారు. ప్రధాని మోదీని చేతల మనిషిగా అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment