
బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
దివాలా ప్రక్రియను ప్రారంభించిన కంపెనీలకు సంబంధించిన ఎన్‌పీఏలపై కేటాయింపుల్ని పెంచాలంటూ బ్యాంకుల్ని రిజర్వుబ్యాంక్ ఆదేశించిందన్న
♦ 31,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్..
♦ 180 పాయింట్లు డౌన్
♦ ఇంట్రాడేలో 9,500 పాయింట్ల స్థాయిని
♦ కోల్పోయిన నిఫ్టీ... 64 పాయింట్ల క్షీణత
ముంబై: దివాలా ప్రక్రియను ప్రారంభించిన కంపెనీలకు సంబంధించిన ఎన్‌పీఏలపై కేటాయింపుల్ని పెంచాలంటూ బ్యాంకుల్ని రిజర్వుబ్యాంక్ ఆదేశించిందన్న వార్తలతో మంగళవారం బ్యాంకింగ్ షేర్లు పతనంకావడంతో స్టాక్ సూచీలు పడిపోయాయి. ప్రపంచ సంకేతాలు బలహీనంగా వుండటం, జీఎస్‌టీ అమలురోజు దగ్గరపడటంతో...అందుకు సంబంధించిన ఆందోళనలు కూడా మార్కెట్ క్షీణతకు కారణం. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 290 పాయింట్ల వరకూ తగ్గి 30,848 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. ముగింపులో షార్ట్ కవరింగ్ ఫలితంగా నష్టాల్లో కొంతభాగాన్ని పూడ్చుకుని, చివరకు 180 పాయింట్ల నష్టంతో 31,000 పాయింట్ల స్థాయికి దిగువన 30,958 పాయింట్ల వద్ద ముగిసింది.
నెలరోజుల్లో సెన్సెక్స్ ఇంత అధికస్థాయిలో తగ్గడం ఇదే ప్రధమం. మే 23న ఈ సూచి 205 పాయింట్లు క్షీణించింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 9,500 పాయింట్లస్థాయి దిగువకు పడిపోయి...9,473 పాయింట్ల స్థాయిని తాకింది. చివరకు 64 పాయింట్ల నష్టంతో 9,511 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అధిక కేటాయింపులపై ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాలు మార్కెట్ దిశను దెబ్బతీసాయని, ఆర్‌బీఐ చర్యతో బ్యాంకుల లాభాలకు గండిపడుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
ఎస్‌బీఐ 3.27 శాతం డౌన్...
ఆర్‌బీఐ చర్య కారణంగా బీఎస్‌ఈ బ్యాంకెక్స్ సూచి 1.45 శాతం నష్టపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ 3.27 శాతం క్షీణించి రూ. 279.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా నష్టపోయిన షేరు ఇదే. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ షేర్లు యాక్సిస్ బ్యాంక్ 2.34 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.20 శాతం, కొటక్ బ్యాంక్ 1.13 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.63 శాతం చొప్పున తగ్గాయి. మిడ్‌సైజ్డ్ బ్యాంకులైన సిండికేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, విజయా బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ షేర్లు 4.97 శాతంవరకూ పతనమయ్యాయి.
సిమెంటు షేర్లకు నష్టాలు...
జీఎస్‌టీ మరో మూడురోజుల్లో అమలులోకి రానున్న నేపథ్యంలో ధర పెరుగుతుందన్న అంచనాలతో సిమెంటు షేర్లు ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంటు షేర్లు 3–4 శాతం మధ్య తగ్గాయి. తగ్గిన షేర్లలో ఆసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఆటో, సిప్లా, టీసీఎస్, మహింద్రా, మారుతి సుజుకి, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, విప్రోలు వున్నాయి. మరోవైపు భారతి ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, హీరోమోటో కార్ప్, టాటా స్టీల్, అదాని పోర్ట్స్, లుపిన్, ఐటీసీలు పెరిగాయి.
స్వల్పలాభంతో లిస్టయిన తేజాస్
టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు అవసరమయ్యే ఉత్పత్తుల్ని అభివృద్ధిపర్చే తేజాస్ నెట్‌వర్క్స్ షేరు మంగళవారం స్వల్పలాభంతో లిస్టయ్యింది. రూ. 257 ఇష్యూధరతో పోలిస్తే 2.5 శాతం పెరుగుదలతో రూ. 263.5 వద్ద లిస్టయిన తేజాస్ ఇంట్రాడేలో రూ. 271 గరిష్టస్థాయికి పెరిగినప్పటికీ, చివరకు లిస్టింగ్ ధరవద్దే ముగిసింది. బీఎస్‌ఈలో 24 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో కోటి షేర్ల చొప్పున చేతులు మారాయి. ఈ ఐపీఓ 1.88 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది.