
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మధ్యనాటికల్లా బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబాకీలు (ఎన్‌పీఏ) గరిష్ట స్థాయికి ఎగియనున్నాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి. అయితే, బ్యాంకర్లపై మోసాలు, కుంభకోణాల ఆరోపణల నేపథ్యంలో రుణాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడనుంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది.
మొండిబాకీల సమస్య పరిష్కారానికి సంబంధించి ఫిబ్రవరి 12న ప్రకటించిన నిబంధనలతో మార్చి త్రైమాసికంలో ఎన్‌పీఏలు భారీగా పెరుగుతాయని, 2018–19 మధ్యలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయని క్రిసిల్ పేర్కొంది. గతేడాది మార్చి క్వార్టర్‌తో పోలిస్తే ఈ మార్చి త్రైమాసికంలో స్థూల ఎన్‌పీఏలు 9.4 శాతం నుంచి 11 శాతానికి పెరగొచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11.5 శాతానికి ఎగిసి, క్రమంగా 2019 మార్చి నాటికి 10.3 శాతానికి తగ్గొచ్చని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి వివరించారు.
ఎన్‌పీఏ సమస్యలు తగ్గిన తర్వాత నుంచి మళ్లీ రుణాల వృద్ధి, నిర్వహణ లాభాలు మొదలైన అంశాలపైకి దృష్టి మళ్లగలదని ఆయన చెప్పారు. అయితే, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ. 12,900 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణం, ఐసీఐసీఐ బ్యాంక్‌లో క్విడ్ ప్రో కో ఆరోపణలు మొదలైనవి రుణ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment