
బ్యాంకులకు మరో రెండేళ్లు కష్టాలే!
♦ భారత బ్యాంకులపై ఒత్తిడి కొనసాగుతుంది
♦ ఆస్తుల నాణ్యత, లాభాల పరంగా సమస్యలుంటాయి
♦ ఎన్‌పీఏలు పెరుగుతాయి: ఎస్ అండ్ పీ రేటింగ్స్ అంచనా
న్యూఢిల్లీ/ముంబై: ఆస్తుల నాణ్యత పరంగా బ్యాంకులపై ఒత్తిడి కొనసాగుతుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ పేర్కొంది. సమస్యాత్మక రంగాల్లోని కంపెనీలకు అధిక రుణాలిచ్చిన ఫలితంగా ఎన్‌పీఏలు పెరుగుతూనే ఉంటాయని అంచనా వేసింది. ఫలితంగా ఆస్తుల నాణ్యత, లాభాలు, క్యాపిటలైజేషన్ పరంగా మరో ఏడాది నుంచి రెండేళ్ల పాటు బ్యాంకులపై ఒత్తిడి ఉంటుందని తెలిపింది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత పరంగా బలహీన ధోరణి కొనసాగితే ఆర్థిక సవాళ్లు పెరిగినట్లు భావించాల్సి వస్తుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ అనలిస్ట్ గీతాచుగ్ చెప్పారు. ‘భారత్, చైనా బ్యాంకులపై ఆర్థికపరమైన కష్టాల నీలినీడలు’ పేరిట ఈ రెండు దేశాల్లోని బ్యాంకులను ఆస్తుల నాణ్యత, లాభాలు, క్యాపిటలైజేషన్, రుణాల వృద్ధి పరంగా పోల్చి నివేదిక రూపొందించింది.
నివేదికలోని అంశాలివీ...
♦ భారత్ బ్యాంకుల మాదిరిగా చైనా బ్యాంకులు సైతం ఇవే సమస్యలతో కూడిన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి.
♦ భారత్, చైనా బ్యాంకులపై అధిక ఆర్థికపరమైన సవాళ్లు వాటి పరపతి అవకాశాలకు ప్రతిబంధకం.
♦ భారత్ పారిశ్రామికోత్పత్తిలో పురోగతి తక్కువగా ఉండడం, చైనాలో అధిక పారిశ్రామికోత్పత్తి వల్ల బ్యాంకులపై ఆస్తుల నాణ్యత పరమైన ఒత్తిడి కొనసాగుతుంది.
బ్యాంకుల వడ్డీ మార్జిన్లలో క్షీణత
‘అధిక మొండిబకాయిలు, కార్పొరేట్ల రుణాలపై దృష్టి వల్ల భారత్‌లోని బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లు (ఎన్‌ఐఎంలు) కుచించుకుపోతాయి. రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు ఇకపైనా తగ్గిస్తాయి. అయితే, రుణాలపై అధిక వ్యయాల కారణంగా లాభాల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల ఉండకపోవచ్చు’ అని ఎస్‌అండ్‌పీ అనలిస్ట్ అమిత్ పాండే తెలిపారు.
మూడేళ్లలో బ్యాంకులకు రూ. 2.5 లక్షల కోట్లివ్వాలి
బాసెల్ -3 నిబంధనల ప్రకారం ఉండాల్సిన మూలధనానికి సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకులకు వచ్చే మూడేళ్లలో రూ.2.5 లక్షల కోట్ల నిధులు అందించాల్సి ఉంటుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. బ్యాంకులు భారీ మొండి బకాయిల సమస్యలో చిక్కుకున్నాయని, ఇపుడవి మార్కెట్ల నుంచి నిధులు సమీకరించే పరిస్థితిలో లేవని, కనుక నిధుల పరంగా ప్రభుత్వంపై ఆధారపడక తప్పదని ఎస్‌అండ్‌పీ అనలిస్ట్ గీతాచుగ్ చెప్పారు.
‘అవసరమైన మూలధనాన్ని సమీకరించలేకపోతే అవి కొత్త రుణాలివ్వలేవు. దానివల్ల మార్కెట్ వాటాను కోల్పోవాల్సి వస్తుంది. చివరికది బ్యాంకుల మధ్య స్థిరీకరణకు దారితీస్తుంది. బలహీన, అసమర్థ బ్యాంకుల్ని బలమైన బ్యాంకులు చేజిక్కించుకోవచ్చు’’ అని గీతాచుగ్ వివరించారు. బ్యాంకులు ఎన్‌పీఏలను 8.5%గా పేర్కొన్నప్పటికీ తమ అంచనా ప్రకారం ఇవి 13%గా ఉండవచ్చన్నారు. భారత్ కంటే చైనాలో ఎన్‌పీఏల సమస్య తక్కువన్నారు.
మేకిన్ ఇండియాకు మౌలిక వసతులే అడ్డంకి
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి మౌలిక వసతుల లేమి పెద్ద అడ్డంకిగా నిలుస్తున్నట్లు గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఎస్‌అండ్‌పీ తెలియజేసింది. మౌలిక వసతుల లోపం కారణంగా జీడీపీలో 5 శాతం వరకు అదనంగా వ్యయం అవుతున్నట్లు ఎస్‌అండ్‌పీ అనలిస్ట్ అభిషేక్ దంగ్రా తెలిపారు. మౌలిక వసతుల్లో వృద్ధితో ఎగుమతుల పరంగా పోటీతత్వం పెరుగుతుందనే అంచనాలున్నట్టు చెప్పారు. ‘‘ఎగుమతులకు కేంద్రంగా ఉన్న చైనా సైతం మౌలిక వసతుల పరంగా సమస్యలు ఎదుర్కొంటోంది. మౌలిక వసతుల అభివృద్ధి కోసం వెచ్చించే ప్రతి రూపాయి జీడీపీకి రూ.2 తెచ్చిపెడుతుంది.
జీఎస్‌టీ బిల్లు ఆమోదమనేది లాజిస్టిక్స్, తయారీ రంగాలకు ఉత్ప్రేరకంగా పని చేస్తుంది’’ అని దంగ్రా వివరించారు. ‘‘సరైన నియంత్రణ విధానంతో ఈ రంగానికి మేలు జరుగుతుంది. చక్కని నియంత్రణ వల్ల దేశీయంగా విద్యుదుత్పత్తి రంగం టర్న్ అరౌండ్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి’’ అన్నారాయన. ప్రభుత్వం రవాణా రంగంపై వ్యయాన్ని పెంచినా, అధిక రుణ భారంతో ప్రాజెక్టులు ఆలస్యం కావొచ్చని హెచ్చరించారు. నిధుల పరంగా ప్రభుత్వానికి ఉన్న పరిమితులతో... ప్రైవేటు రంగం పాత్ర తప్పనిసరి అని స్పష్టంచేశారు.