మొండిబకాయిలు సమస్య కాదు.. | NPA not an issue, rate cuts to fetch Rs 2.5 tn gains: Kamath | Sakshi
Sakshi News home page

మొండిబకాయిలు సమస్య కాదు..

Published Mon, Oct 17 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

మొండిబకాయిలు సమస్య కాదు..

మొండిబకాయిలు సమస్య కాదు..

వార్కా(గోవా): బ్యాంకుల్లో అంతకంతకూ పేరుకుపోతున్న మొండి బకాయిలు(ఎన్‌పీఏ)  పెద్ద సమస్య కాదని ప్రముఖ బ్యాంకర్, బ్రిక్స్ దేశాలు ప్రమోట్ చేసిన న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్(ఎన్‌డీబీ) ప్రెసిడెంట్ కేవీ కామత్ పేర్కొన్నారు. బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) ఎనిమిదవ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో దీని గురించి(ఎన్‌పీఏలు) ఆందోళనచెందాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వడ్డీరేట్ల తగ్గింపు కారణంగా ట్రెజరీ లాభాలు(ప్రభుత్వ బాండ్‌లలో చేసిన పెట్టుబడులకు సంబంధించి) బ్యాంకులకు రూ.2.5 లక్షల కోట్ల లాభాన్ని బ్యాలెన్స్ షీట్స్‌లో చూపించవచ్చు.
 
  ఎన్‌పీఏలు, ఇతరత్రా సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుంది. అంతేకాదు బ్యాంకుల మూలధన పరిస్థితిని మెరుగుపరుస్తుంది’ అని కామత్ చెప్పారు. ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు కారణంగా ఇప్పటివరకూ బ్యాంకులకు రూ. లక్ష కోట్ల(ఈల్డ్‌లు తగ్గడంద్వారా మార్క్-టు-మార్కెట్ ప్రాతిపదికన) ప్రయోజనం లభించిందన్నారు. రానున్న కాలంలో మరో 1 శాతం మేర వడ్డీరేట్ల తగ్గుదలను అంచనా వేస్తున్నామని.. దీనివల్ల మరో రూ.1.5 లక్షల కోట్ల లాభం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
 
 ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు మొత్తం రుణాల్లో 8.7%కి(దాదాపు రూ.9 లక్షల కోట్లు) ఎగబాకాయి. మరోపక్క, బాసెల్-3 నిబంధనల ప్రకారం 2019 నాటికి బ్యాంకులకు 90 బిలియన్ డాలర్ల మూలధన నిధులు అవసరమవుతాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తాజా నివేదికలో పేర్కొంది. కాగా, గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకూ ఆర్‌బీఐ కీలక పాలసీ వడ్డీరేటు(రెపో)ను 1.75% తగ్గించడం తెలిసిందే.
 
 ఎన్‌పీఏలపై చర్యలు బాగున్నాయి..
 మొండిబకాయిల సమస్యను ఎదుర్కొనే విషయంలో బ్యాంకులు ఇప్పటివరకూ తీసుకున్న చర్యలు బాగున్నాయని కామత్ వ్యాఖ్యానించారు. ‘సమస్యాత్మక రుణాల గుర్తింపు అనేది పూర్తయింది. ఇక వీటిపై తగిన నిర్ణయం తీసుకోవడమే ఇప్పుడు చాలా కీలకమైన అంశం. మరోపక్క, బ్యాంకులకు నిధుల లభ్యత కూడా పెరిగిన నేపథ్యంలో సమస్యలు తగ్గాయనే చెప్పొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
 
 వచ్చే ఏడాది ఎన్‌డీబీ నుంచి 2.5 బిలియన్ డాలర్ల రుణాలు
 మౌలిక రంగ ప్రాజెక్టులకు ఎన్‌డీబీ రుణాలను భారీగా పెంచనుందని బ్యాంక్ ప్రెసిడెంట్ కేవీ కామత్ తెలిపారు. ‘ఈ ఏడాది ఇప్పటివరకూ 911 మిలియన్ డాలర్ల రుణాలను(ఇందులో భారత్‌కు 250 మిలియన్ డాలర్లు) ఎన్‌డీబీ అందించింది. డిసెంబర్ నాటికి రుణాలు బిలియన్ డాలర్లకు చేరుతాయని అంచనా. వచ్చే ఏడాది(2017) రెట్టింపునకు పైగా 2.5 బిలియన్ డాలర్ల రుణాలను ఇవ్వాలన్నది ఎన్‌డీబీ లక్ష్యం’ అని ఆయన వెల్లడించారు. భారత్‌కు రుణ సదుపాయాన్ని పెంచేందుకు త్వరలో మసాలా బాండ్‌ల(రూపాయి డినామినేషన్‌లో విదేశీ ఇన్వెస్టర్లకు బాండ్‌లను జారీ చేయడం ద్వారా నిధుల సమీకరణ) జారీకి  ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కూడా కామత్ చెప్పారు. రుణ అవసరాల కోసం వచ్చే ఏడాది ఎన్‌డీబీ 1.5 బిలియన్ డాలర్లను సమీకరించనుందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రమోట్ చేసిన ఎన్‌డీబీ... షాంఘై ప్రధాన కేంద్రంగా గతేడాది కార్యకలాపాలను ప్రారంభించింది.
 
 మహిళా డెరైక్టర్ల విషయంలోపీఎస్‌యూలు విఫలం: కిద్వాయ్
 కంపెనీల డెరైక్టర్ల బోర్డుల్లో నియమించేందుకు నైపుణ్యంగల మహిళలు లేరంటూ సాకులు చూపడాన్ని ప్రముఖ బ్యాంకర్ నైనాలాల్ కిద్వాయ్ తీవ్రంగా తప్పుబట్టారు.  ‘ఇది అసంబద్ధం, హాస్యాస్పదం’ అంటూ ఆమె మండిపడ్డారు. బ్రిక్స్ సదస్సుల్లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో మహిళా డెరైక్టర్ల నియామకంలో ప్రభుత్వ అలసత్వంపై హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాజీ చీఫ్ కిద్వాయ్ విమర్శలు గుప్పించారు.
 
  ‘ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇతరత్రా సివిల్ సర్వీసెస్‌లో మహిళా ప్రాతినిథ్యం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయి. అయితే, పీఎస్‌యూల్లో మహిళా డెరైక్టర్లను పెంచడంలో మాత్రం సమస్యేంటో అర్థం కావడం లేదు. కార్పొరేట్ కంపెనీల డైరక్టర్ల బోర్డుల్లో మహిళలకు సమాన ప్రాతినిథ్యం లభించేవిధంగా చట్టాలను అమలుచేయాల్సిన అవసరం ఉంది. లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో కనీసం ఒక మహిళా డెరైక్టర్ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి’ అని కిద్వాయ్ పేర్కొన్నారు. కాగా, 68 లిస్టెడ్ పీఎస్‌యూల్లో సగానికిపైగా మహిళా డెరైక్టర్లను నియమించుకోలేదని(2015 మార్చి డెడ్‌లైన్) తాజాగా ప్రైమ్‌డేటా బేస్ నివేదిక వెల్లడించడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement