మొండిబకాయిలే సవాల్.. | Take more steps to address NPA problem: Arun Jaitley to banks | Sakshi
Sakshi News home page

మొండిబకాయిలే సవాల్..

Published Sat, Sep 17 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

మొండిబకాయిలే సవాల్..

మొండిబకాయిలే సవాల్..

బ్యాంకులకు మరిన్ని నిధులిచ్చేందుకు బడ్జెట్ పరమైన పరిమితులు...
సొంతంగా సమీకరణపై దృష్టిపెట్టాలి...
ఆర్థిక వ్యవస్థ మెరుగైతే ఎన్‌పీఏలు తగ్గుతాయ్..
పీఎస్‌యూ బ్యాంక్ చీఫ్‌లతో భేటీ తర్వాత
ఆర్థిక మంత్రి జైట్లీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండిబకాయిలు(ఎన్‌పీఏ) సవాలుగా మారాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ)కు భారీగా నిధులను ఇచ్చే విషయంలో బడ్జెట్ పరంగా కొన్ని అడ్డంకులు ఉన్నాయని... సొంతంగా నిధుల సమీకరణకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిందిగా ఆయన సూచించారు. శుక్రవారమిక్కడ పీఎస్‌బీ చీఫ్‌లతో బ్యాంకుల పనితీరు సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశాలను ప్రస్తావించారు. ‘బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్లపై కొన్ని ఎన్‌పీఏలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల రుణాల మంజూరుకు అడ్డుకట్టపడుతోంది. ఎన్‌పీఏల సమస్య ఇలాగే కొనసాగడమో లేదంటే శాశ్వతంగా ఉండిపోయేది కూడా కాదు.

అయితే, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే ఈ ఇక్కట్లు తగ్గుముఖంపట్టడంతోపాటు రుణాలిచ్చేందుకు నిధులు కూడా అందుబాటులోకి వస్తాయి. పీఎస్‌బీలకు మరిన్ని మూలధన నిధులను అందించేందుకు మేం సుముఖమే. కానీ, బడ్జెట్ పరంగా పరిమితులు ఉన్నాయన్న సంగతిని గుర్తుంచుకోవాలి’ అని జైట్లీ పేర్కొన్నారు. కాగా, ఎన్‌పీఏల విక్రయానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యపడటం లేదని బ్యాంకుల చీఫ్‌లు ప్రస్తావించినట్లు ఆయన చెప్పారు. ఎన్‌పీఏల విక్రయానికి అవసరమైతే బ్యాంకులకు ఆర్థిక సేవల విభాగం సహకారం అందిస్తుందన్నారు. ఈ ప్రతికూలతలు సద్దుమణిగితే బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను మరింతగా తగ్గించేందుకు వీలవుతుందని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ రుణ లక్ష్యాన్ని సాధిస్తాం...
ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 2014-15లో 5.43 శాతం(రూ.2.67 లక్షల కోట్లు) నుంచి 2015-16 నాటికి 9.32 శాతానికి(రూ.4.76 లక్షల కోట్లు) పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దివాళా చట్టం అమలు; సర్ఫేసీ, డీఆర్‌టీ  చట్టాల్లో సవరణలు వంటి పలు చర్యలను ఇటీవల ఆర్‌బీఐ, ప్రభుత్వం తీసుకున్నాయని.. వీటిని సమర్ధంగా అమలు చేస్తే బ్యాంకులు ఎన్‌పీఏల సమస్యను ధీటుగా ఎదుర్కోగలవని జైట్లీ చెప్పారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై బ్యాంకులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టాయని ఆయన పేర్కొన్నారు. కాగా, నిధుల కొరతను ఎదుర్కొంటున్న 13 పీఎస్‌బీలకు బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా తొలివిడత రూ.22,915 కోట్ల మూలధనాన్ని కేంద్రం ఇటీవలే సమకూర్చిది. బ్యాంకుల పనితీరు ఆధారంగా ఈ ఏడాది మరిన్ని నిధులను కేంద్రం అందించనుంది. గడిచిన నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం పీఎస్‌బీలకు రూ.70,000 కోట్ల మేర మూలధన నిధులను ఇచ్చింది. కాగా, వ్యవసాయ రుణాలపై మాట్లాడుతూ.. ఈ రంగానికి అత్యధిక రుణాలే తమ ప్రాధాన్యత అని చెప్పారు. ఈ ఏడాది రూ.9 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలిచ్చే లక్ష్యాన్ని సాధించగలమని జైట్లీ పేర్కొన్నారు.

ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనానికి పూర్తి మద్దతు
ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ... ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనానికి కట్టుబడిఉన్నామని, ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగువేసే ప్రసక్తే లేదని జైట్లీ తేల్చిచెప్పారు. ఐదు అనుబంధ బ్యాంకుల(స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, బికనీర్ అండ్ జైపూర్, ట్రావంకోర్, పాటియాలా, మైసూర్)తో పాటు భారతీయ మహిళా బ్యాంకు(బీఎంబీ)ను ఎస్‌బీఐలో విలీనం చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడం తెలిసిందే.

‘ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ప్రభుత్వం పూర్తి మద్దతు పలికింది. కేబినెట్ కూడా ఓకే చెప్పింది. నిబంధనల ప్రకారమే విలీనం పూర్తవుతుంది’ అని జైట్లీ పేర్కొన్నారు. కాగా, విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. అఖిలభారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో ఐదు అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేయడం విదితమే. మరోపక్క, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ట్రావంకోర్ విలీనం వద్దంటూ కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. కాగా, ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా విక్రయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని జైట్లీ తెలిపారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 73.98% వాటా ఉంది. దీన్ని దశలవారీగా 49%కి తగ్గించుకోవాలన్నది కేంద్రం యోచన.

ద్రవ్యోల్బణం తగ్గుదలను ఆర్‌బీఐ పరిగణించాలి..
రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలను(ఆగస్టులో 5.05 శాతం) దృష్టిలోపెట్టుకొని రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రానున్న పాలసీ సమీక్ష(అక్టోబర్ 4న)లో వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు అరుణ్ జైట్లీ చెప్పారు. ద్రవ్యోల్బణం దిగొస్తున్న నేపథ్యంలో రేట్ల కోతకు ఆస్కారం ఉందా అన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి ఈ విధంగా బదులిచ్చారు. ‘వచ్చే నెలలో జరిగే సమీక్షలో ఆర్‌బీఐ/ఎంపీసీ(ఒకవేళ అప్పటికి మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటైతే) ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నా. ఆర్‌బీఐ అనేది అత్యంత బాధ్యతాయుతమైన నియంత్రణ సంస్థ. దాని నిర్ణయంకోసం మనం ఎదురుచూడటంతో పాటు విశ్వసించాలి కూడా’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం పెరుగుదల ఆందోళనల నేపథ్యంలో గడిచిన సమీక్షలో ఆర్‌బీఐ పాలసీ రేట్లను యథాతథంగా కొన సాగించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement