మొండిబకాయిలు.. బాబోయ్!
⇔ మొత్తం రుణాల్లో 15 శాతానికి చేరే అవకాశం
⇔ అత్యధికంగా ఎన్‌పీఏలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే
⇔ పెరగనున్న పీఎస్‌బీల మూలధన అవసరాలు
⇔ బ్యాంకింగ్ రంగంపై 2018 నాటికి ఎస్‌అండ్‌పీ అంచనా
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి దేశీయంగా బ్యాంకుల్లో మొండిబకాయిల (ఎన్‌పీఏ) పరిమాణం మొత్తం రుణాల్లో 15 శాతా నికి చేరనున్నాయి. నియంత్రణ సంస్థ నిబంధనలకు అనుగుణమైన మూలధన అవసరాలు మాత్రం 2019 దాకా పెరుగుతూనే ఉంటాయి. భారతీయ బ్యాంకుల కష్టాలు, చికిత్స మీద ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2018 మార్చి ఆఖరు నాటికి బ్యాంకింగ్ రంగంలో మొత్తం నిరర్ధక ఆస్తుల పరిమాణం 13–15 శాతం దాకా పెరగొచ్చని, ఈ రుణాల్లో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ బ్యాంకులదే ఉండనుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ దీపాలీ సేఠ్ చాబ్రియా తెలిపారు.
తాము రేటింగ్ ఇస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్‌లో నిరాశాజనకంగా ఉందని పేర్కొన్నారు. ఏటా నిరర్ధక రుణాల పరిమాణం పెరుగుతుండటం.. అధిక ప్రొవిజనింగ్‌కు, లాభాలు తగ్గడానికి కారణమవుతోందని వివరించారు. దీంతో అనూహ్య నష్టాలను భరించేం దుకు అందుబాటులో ఉన్న మూలధనం చాలా తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. రాబోయే 12 నెలల్లో బ్యాంకుల రుణ పరపతి మెరుగయ్యే అవకాశాలు కనిపించడం లేదని నివేదికలో ఎస్‌అండ్‌పీ తెలిపింది.
దశాబ్ద కనిష్టానికి రుణాల వృద్ధి..
రుణాల మంజూరులో వృద్ధి ప్రస్తుతం దశాబ్ద కనిష్ట స్థాయిలో ఉన్నట్లు ఎస్‌అండ్‌పీ పేర్కొంది. బాసెల్ త్రీ నిబంధనలకు అనుగుణంగా మూలధనం సమకూర్చుకోవాలంటే బ్యాంకులు ఇతరత్రా వనరులపై ఆధారపడాల్సి రావొచ్చని లేదా ప్రాధాన్యేతర ఆస్తులను విక్రయించుకోవాల్సి ఉంటుందని దీపాలీ చెప్పారు. ఏదైనా సమస్యలు తలెత్తితే తట్టుకోవడానికి ఆస్కారం లేకుండా బ్యాంకుల వద్ద మూలధనం తక్కువ స్థాయిలో ఉందని, లాభసాటిగా లేని ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాల్లో కోత విధించుకోవాల్సి కూడా రావొచ్చని దీపాలీ చెప్పారు. నిబంధనల ప్రకారం మరింత మూలధనాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం 2019 దాకా పెరుగుతూనే ఉండొచ్చని, లాభదాయకత మాత్రం ఒక మోస్తరుగానే ఉండొచ్చని తెలిపారు.
2016–19 మధ్యలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) రూ. 70,000 కోట్లు కేంద్రం సమకూర్చనున్న సంగతి తెలిసిందే. అయితే, పీఎస్‌బీల అవసరాలు పూర్తిగా తీర్చేందుకు ఈ నిధులు సరిపోవని ఎస్‌అండ్‌పీ తెలిపింది. మూలధనం కొరత, అసెట్ క్వాలిటీ సమస్యలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కన్సాలిడేషన్‌కు తెరతీయొచ్చని పేర్కొంది. ప్రభుత్వం మూలధనం సమకూర్చడం, అసాధారణ స్థాయిలో తోడ్పాటు అందించడం భారతీయ పీఎస్‌బీల రేటింగ్‌ను పెంచడంలో కీలకపాత్ర పోషించగలవని ఎస్‌అండ్‌పీ తెలిపింది.