ముంబై: అంతర్జాతీయంగా మొండిబకాయిల భారం (ఎన్‌పీఏ) మోస్తున్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. బ్రిక్స్ (బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో మనదే మొదటి స్థానంలో నిలుస్తుండటం మరో ముఖ్యాంశం. భారత బ్యాంకుల మొండి బకాయిల భారం మొత్తంగా రూ.9.5 లక్షల కోట్లు. మొత్తం రుణాల్లో ఈ పరిమాణం దాదాపు 10 శాతం. ఈ విషయంలో భారతదేశం హై రిస్క్ కేటగిరీలో నిలుస్తున్నట్లు ‘కేర్’ రేటింగ్స్ విడుదల చేసిన తాజా నివేదిక తెలియజేసింది. నివేదికలోని మరిన్ని అంశాలు చూస్తే...
►యూరోపియన్ యూనియన్‌లో(ఈయూ) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నాలుగు దేశాలు–గ్రీస్ (36.4%), ఇటలీ (16.4 శాతం), పోర్చుగల్ (15.5 శాతం), ఐర్లాండ్ (11.9 శాతం) మొండి బకాయిల భారాన్ని మోస్తున్నాయి. భారత్ తరువాత ఆరవ స్థానంలో రష్యా (9.7 శాతం), ఏడవ స్థానంలో స్పెయిన్ (5.3 శాతం) నిలిచాయి.
►ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా భారత ఆర్థిక వ్యవస్థ మొండిబకాయిల ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
►కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవీస్ విశ్లేషణ ప్రకారం– ఎన్‌పీఏల సమస్య భారత్‌లో తీవ్రంగా ఉంది. రుణ నాణ్యత (ఏఆర్‌క్యూ) విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2015లో దృష్టి సారించిన తరువాత కూడా ఈ సమస్య పెరుగుతూనే వచ్చింది. అయితే యూరోపియన్ దేశాల్లో ఈ సమస్య చాలా కాలం నుంచీ నలుగుతున్నదే. భారత్‌లో మాత్రం కేవలం రెండేళ్లలో ఈ సమస్య ఆందోళనకర స్థితికి చేరింది.
► 2015 మార్చిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్‌పీఏల విలువ రూ.2.78 లక్షల కోట్లు. ఈ విలువ 2017 జూన్ నాటికి ఏకంగా రూ.9.5 లక్షల కోట్లకు ఎగసింది.
►ఆదాయాల వృద్ధి మందగమనం, అధిక వడ్డీరేట్లు మొండిబకాయిలు పెరగడానికి కారణాల్లో ప్రధానమైనవి.
► కేంద్రం, ఆర్‌బీఐ, వాణిజ్య బ్యాంకులు సమస్యను అధిగమించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవల భారత్ ప్రవేశపెట్టిన దివాలా (ఐబీసీ) చట్టం ఇందులో ఒకటి. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఈ చట్టం సెగను ఎదుర్కొంటున్నాయి. అలాగే బ్యాంకింగ్‌కు ప్రభుత్వం నుంచి తగిన మూలధన మద్దతూ అందుతోంది.
► ఎన్‌పీఏల సమస్యను కేర్ నాలుగు కేటగిరీలుగా (లో, వెరీ లో, మీడియం, హై లెవెల్) విభజించింది. కేవలం ఒక శాతం ఎన్‌పీఏలను ఎదుర్కొంటున్న దేశాల్లో (లో కేటగిరీ) ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రిటన్ ఉన్నాయి. చైనా, జర్మనీ, జపాన్, అమెరికాల్లో ఈ సమస్య రెండు శాతంగా (రెండవ కేటగిరీ) ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు– బ్రెజిల్, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, టర్కీలు మూడవ కేటగిరీలో ఉన్నాయి.
మొండి బకాయిల్లో మనది ఐదోస్థానం!
Published Fri, Dec 29 2017 12:09 AM | Last Updated on Fri, Dec 29 2017 12:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment