గుదిబండగా మారిన ఎన్‌పీఏలు
► భూసేకరణ, ఇతర ఇబ్బందులతో ఆగిన ప్రాజెక్టులు
► ముడి పదార్థాల సరఫరా సమస్యలు
► రుణాలు చెల్లించలేని పరిస్థితికి కార్పొరేట్ సంస్థలు
► దీంతో పెరిగిపోయిన ఎన్‌పీఏలు
దేశ బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభానికి గురి చేసిన వసూలు కాని మొండి బకాయిల (ఎన్‌పీఏలు/నిరర్థక ఆస్తులు) సమస్యకు చికిత్స చేసేందుకు ఎట్టకేలకు కేంద్రం నడుం బిగించింది. ఫలితమే బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ఆర్డినెన్స్‌ను రూపొందించడం. దీనికి మార్కెట్లు కూడా చాలా సానుకూలంగా స్పందించాయి. బ్యాంకింగ్ షేర్లు గురువారం లాభాల్లో ముగియడమే ఇందుకు నిదర్శనం. నిజానికి ఎన్‌పీఏల సమస్య ఈ స్థాయికి చేరడం విధానాల్లో లోపంగానే కనిపిస్తోంది.
కొంచెంగా మొదలై...
గత ఐదేళ్లలోనే ఎన్‌పీఏల పెరుగుదల భారీగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 2012 మార్చి నాటికి ఉన్న స్థూల ఎన్‌పీఏలు రూ.1.3 లక్షల కోట్లు. 2016 సెప్టెంబర్ నాటికి అవి రూ.6.7 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. నిరర్థక ఆస్తులన్నింటినీ గుర్తించి వాటికి కేటాయింపులు చేయడం ద్వారా 2017 మార్చి నాటికి తమ ఖాతా పుస్తకాలను ప్రక్షాళన చేయాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తన హయాంలో నిర్దేశించారు. 2015 సెప్టెంబర్ నాటికి రూ.3.4 లక్షల కోట్లుగా ఉన్న స్థూల ఎన్‌పీఏలు ఏడాదిలోనే 2016 సెప్టెంబర్ నాటికి రెట్టింపు కావడం గమనార్హం.
విధానపరమైన సమస్యలు ఎన్‌పీఏలకు ఓ కారణంగానూ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నో భారీ ప్రాజెక్టులు భూసేకరణ పరమైన అడ్డంకుల కారణంగా నిలిచిపోయాయి. దీనికితోడు ముడి పదార్థాల సరఫరా పరంగానూ ఇబ్బందులు తలెత్తడంతో ఆయా ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకున్న సంస్థలు ఇక్కట్ల పాలయ్యాయి.
ఇక ఆర్థిక సంక్షోభం దరిమిలా క్షీణించిన డిమాండ్ తిరిగి పుంజుకోకపోవడంతో చాలా రంగాల్లో మిగులు ఉత్పత్తికి దారితీసింది. దీంతో రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యం పడకేసింది. ఇక బ్యాంకులు సైతం కార్పొరేట్ సంస్థలకు రుణాలిచ్చే విషయంలో సరైన పరిశీలనలు చేపట్టకుండా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా గుడ్డిగా వ్యవహరించడం కూడా సమస్యను తీవ్రతరం చేసింది.
రుణాలు తీర్చే సామర్థ్యం తగ్గుదల
ఆర్‌బీఐ పలు పథకాలను ప్రకటించినప్పటికీ ఎన్‌పీఏల సమస్యకి పరిష్కారం లభించలేదు. మూలంలోనే సమస్య ఉండడంతో మొండి బకాయిలు కట్టలు తెంచుకున్నాయి. దేశీయ సంస్థల రుణ చెల్లింపుల సామర్థ్యం సైతం దెబ్బతిన్నది. ముఖ్యంగా విద్యుత్తు, స్టీల్ రంగాల్లోని ప్రముఖ కంపెనీలకూ ఈ పరిస్థితి ఎదురైంది.
ఆర్‌బీఐ గత డిసెంబర్‌లో విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం భారీ రుణాలు తీసుకున్న సంస్థల వాటా బ్యాంకుల మొత్తం రుణాల్లో 56 శాతంగా ఉండగా... మొత్తం ఎన్‌పీల్లో ఈ సంస్థల వాటా 88 శాతం కావడం గమనించాల్సిన అంశం. 40–50 పెద్ద సంస్థలపై దృష్టి సారిస్తే చాలు ఎన్‌పీఏల సమస్య పరిష్కారమైపోతుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఇటీవలే పేర్కొన్నారు.
బ్యాంకులకు కష్టాలు
పెరుగుతున్న ఎన్‌పీఏలకు బ్యాంకులు తమ లాభాల్లోంచి కేటాయింపులు చేయాల్సి రావడం వాటికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఎన్‌పీఏలకు కేటాయింపుల కారణంగా గత ఆరు నెలలుగా అవి నష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇవి సమీప కాలంలోనూ పరిష్కారమయ్యేలా లేవు. ఎందుకంటే ఒత్తిడిని ఎదుర్కొంటున్న (సకాలంలో తీర్చలేని) మంచి రుణాలకు సైతం బ్యాంకులు కేటాయింపులు చేయాలని ఆర్‌బీఐ ఇటీవలే సూచించింది. ఈ విధమైన సమస్యలు 2019 నాటికి బాసెల్–3 మూలధన అవసరాలను చేరుకునే విషయంలో బ్యాంకులకు అవరోధంగా నిలుస్తున్నాయి.