ప్రైవేటు బ్యాంకుల మొండి బాకీలు రూ.లక్ష కోట్ల పైనే | Bad loans of private banks exceed Rs 1 lakh crore | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బ్యాంకుల మొండి బాకీలు రూ.లక్ష కోట్ల పైనే

Published Sat, May 12 2018 1:13 AM | Last Updated on Sat, May 12 2018 8:26 AM

Bad loans of private banks exceed Rs 1 lakh crore - Sakshi

న్యూఢిల్లీ:  దేశ బ్యాంకింగ్‌ రంగంలో అడ్డగోలుగా మంజూరై, వసూలు కాని మొండి రుణాల (ఎన్‌పీఏల) వ్యవహారం.. బ్యాంకు ఖాతాల ప్రక్షాళన కార్యక్రమం ఫలితంగా వెలుగు చూసింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి భారీ స్థాయిలో ఎన్‌పీఏలు బయటకు వచ్చాయి. వీటితో పోలిస్తే ప్రైవేటు బ్యాంకులు ఎన్‌పీఏల విషయంలో కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ, అలా అని దూరంగాను లేవు.

ఎందుకంటే ప్రైవేటు బ్యాంకుల్లోనూ ఎన్‌పీఏలు పెరిగిపోతున్నాయి మరి. ఆరు ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 2018 మార్చి నాటికి రూ.లక్ష కోట్లు దాటాయి. 2015 సెప్టెంబర్‌లో బ్యాంకుల ఆస్తుల నాణ్యత సమీక్ష చేపట్టే నాటికి ఆరు ప్రధాన ప్రైవేటు బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.28,033 కోట్లుగా ఉంటే, అవి ఈ ఏడాది మార్చి ఆఖరుకి రూ.లక్ష కోట్లకు పెరిగిపోయాయి.

వీటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, కోటక్‌ మహింద్రా బ్యాంకు, యస్‌ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ఉన్నాయి. మొండి బకాయిలకు సంబంధించి ఆర్‌బీఐ నూతన కార్యాచరణను అమల్లో పెట్టడం వల్ల మార్చి క్వార్టర్లో ప్రైవేటు బ్యాంకుల ఎన్‌పీఏలు మరోసారి గణనీయంగా పెరిగిపోయాయి.

మార్చి క్వార్టర్లో భారీగా పెరుగుదల
గతేడాది డిసెంబర్‌ నాటికి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నింటి స్థూల ఎన్‌పీఏలు రూ.8.8 లక్షల కోట్లుగా ఉన్నాయి. అయితే, మార్చి ముగింపు నాటికి ఇవి మరింత పెరిగిపోయాయి. కార్పొరేట్‌ రంగానికి అధికంగా రుణాలు ఇచ్చిన ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకులు ఎన్‌పీఏలను ఎక్కువగా చూపించాయి. మార్చి చివరికి ఐసీఐసీఐ బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు 238 శాతం ఎగిసి రూ.54,063 కోట్లకు చేరాయి.

అదే యాక్సిస్‌ బ్యాంకు విషయానికొస్తే స్థూల ఎన్‌పీఏలు 670 శాతం పెరిగి రూ.34,249 కోట్లకు చేరాయి. ఈ రెండు బ్యాంకుల స్థూల ఎన్‌పీఏల నిష్పత్తి భారీగా పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంకు స్థూల ఎన్‌పీఏ రేషియో 2015 సెప్టెంబర్‌ నాటికి మొత్తం రుణాల్లో 3.26 శాతంగా ఉండగా, 2018 మార్చి నాటికి అది 10 శాతానికి పెరిగిపోయింది. అటు యాక్సిస్‌ బ్యాంకు స్థూల ఎన్‌పీఏ రేషియో ఇదే కాలంలో 1.38 శాతం నుంచి 6.7%కి ఎగిసింది. 2015 సెప్టెంబర్‌ నాటి నుంచి చూస్తే యస్‌ బ్యాంకు ఎన్‌పీఏల రేషియా ఈ ఏడాది మార్చి చివరికి 434 శాతం పెరిగిపోయింది.  

ఆర్‌బీఐ నిబంధనల వల్లే...
బ్యాంకుల ఎన్‌పీఏలు జనవరి–మార్చి త్రైమాసికంలోనూ పెరగడం ఆర్‌బీఐ నూతన కార్యాచరణ పర్యవసానమేనని ఏంజెల్‌ బ్రోకింగ్‌ అనలిస్ట్‌ సిద్ధార్థ్‌ పురోహిత్‌ పేర్కొన్నారు. ‘‘ఆర్‌బీఐ... రుణాలను తగిన విధంగా వర్గీకరించాలని, చెల్లింపులు ఆగిపోయిన రోజు నుంచి 180 రోజుల్లోపు వాటిని పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసింది. అప్పటికీ సాధ్యం కాకపోతే వాటిని దివాలా చర్యల కింద సిఫారసు చేయాలని ఆదేశాలే జారీచేసింది.

ఈ ఆదేశాల నేపథ్యంలో ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకులు కొన్ని ఖాతాలను ఎన్‌పీఏలుగా తిరిగి వర్గీకరించాయి. ఈ ఖాతాలకు సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి బ్యాంకులు పరిష్కార ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ రెండు నెలలు కీలకం’’ అని సిద్ధార్థ్‌ పురోహిత్‌ పేర్కొన్నారు.


మారిన ప్రాధాన్యం   
ఐసీఐసీఐ బ్యాంకు ఎదురుదెబ్బల ఫలితంగా రిస్క్‌తో కూడిన కార్పొరేట్‌ రుణాలకు దూరం జరిగింది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకు కార్పొరేట్‌ రంగానికి ఇచ్చిన రుణాలు రూ.7,008 కోట్లు మాత్రమే. గత మూడు సంవత్సరాలుగా ఐసీఐసీఐ బ్యాంకు లోన్‌బుక్‌ వార్షికంగా 3.3 శాతం చొప్పున పెరుగుతూ వస్తోందని, ఇతర బ్యాంకుల కంటే ఐసీఐసీఐ బ్యాంకు ఎన్‌పీఏలు ఎక్కువగా పెరగడానికి కారణం ఇదేనంటున్నారు విశ్లేషకులు.

ప్రధానంగా కార్పొరేట్‌ రంగాన్నే నమ్ముకున్న బ్యాంకులు ఎన్‌పీఏల షాక్‌తో రిటైల్‌ రుణాలపై దృష్టి సారిస్తున్నాయి. దీంతో బ్యాంకుల రుణాల వృద్ధిలో ఎక్కువ భాగం రిటైల్‌ విభాగం నుంచే ఉంటోంది. యాక్సిస్‌ బ్యాంకు రిటైల్‌ లోన్‌బుక్‌ 2015 మార్చి నాటికి రూ1.1 లక్ష కోట్లుగా ఉండగా, 2018 మార్చి నాటికి రూ.2 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం రుణాల్లో 47 శాతానికి చేరాయి.

అటు ఐసీఐసీఐ బ్యాంకు మొత్తం రుణాల్లో రిటైల్‌ రుణాల వాటా 42.4 శాతం నుంచి 56.6 శాతానికి పెరిగింది. 2020 నాటికి 60 శాతం వాటా రిటైల్‌ రుణాలే ఆక్రమిస్తాయని బ్యాంకు అంచనా వేస్తోంది. బ్యాంకులు తమ పోర్ట్‌ఫోలియోను మార్చుకుంటున్నాయని, కార్పొరేట్‌ రుణాల్లో వృద్ధి ఒక అంకెకు పరిమితమైనా, 20 శాతం వృద్ధి ఉన్న రిటైల్‌ రుణాల నుంచి ప్రయోజనం పొందుతాయని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ కార్తీక్‌ శ్రీనివాస్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement