ఇక ప్రభుత్వ బ్యాంకుల ఎఫ్‌పీఓల జోరు!
► మొండిబకాయిల పరిష్కారానికి ప్రభుత్వ చర్యల ఆసరా...
► మార్కెట్ నుంచి నిధుల సమీకరణ వేగవంతం...
► ఆర్థిక శాఖ సీనియర్ అధికారి వెల్లడి
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగాన్ని పట్టిపీడీస్తున్న మొండి బకాయిల ఎన్‌పీఏ) సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని చర్యలను ప్రకటించడంతో... ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) నిధుల సమీకరణ ప్రయత్నాలు ఇక జోరందుకోనున్నాయి. ఎన్‌పీఏలకు అడ్డుకట్టకోసం రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)కి మరిన్ని అధికారాలు కల్పించేలా బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
‘కేంద్రం ఎన్‌పీఏలపై తీసుకుంటున్న చర్యలు.. పీఎస్‌బీల బ్యాలెన్స్‌షీట్లు మెరుగుపడేందుకు దోహదం చేయనున్నాయి. దీనివల్ల షేరు విలువలు కూడా పుంజుకోవడానికి వీలవుతుంది. దీంతో మార్కెట్ నుంచి నిధుల సమీకరణ వేగవంతం కానుంది’ అని ఆర్థిక శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ముంచుకొస్తున్న ‘బాసెల్’ గడువు...
బాసెల్–3 అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మన బ్యాంకులు తగినంత మూలధనాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాణాలు 2019 మార్చి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ లోగా భారతీయ బ్యాంకుల క్యాపిటల్‌అడిక్వషీ రేషియో(సీఏఆర్) బాసెల్–3 ప్రమాణాలకు అనుగుణంగా పెంచుకోవాలి. దీనికోసం పీఎస్‌బీలకు కేంద్రం ఇప్పటికే ఇంద్రధనుష్ పేరుతో ఒక ప్రణాళికను ప్రకటించింది. దీనిప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎస్‌బీలకు రూ.70 వేల కోట్ల మూలధనం అందుతుంది.
ఇప్పటికే ఇందులో రూ.50 వేల కోట్లను పీఎస్‌బీలకు సమకూర్చింది. మిగతా మొత్తాన్ని కూడా 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఇవ్వనుంది. కాగా, బాసెల్–3 అవసరాల నిమిత్తం మరో రూ.1.1 లక్షల కోట్లను ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) సహా ఇతరత్రా మార్గాల్లో మార్కెట్ నుంచి పీఎస్‌బీలు సమీకరించాల్సి ఉంటుందని ‘ఇంద్రధనుష్’లో నిర్ధేశించారు. ఆర్థిక శాఖ అంచనాల ప్రకారం... ప్రస్తుత 2017–18 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సుమారు అరడజను బ్యాంకులు మార్కెట్ నుంచి నిధులను సమీకరించే అవకాశం ఉంది. ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) వంటివి ఈ ఏడాది ఎఫ్‌పీఓలను జారీచేయొచ్చని ఆర్థిక శాఖ అధికారి చెప్పారు. కాగా, ఈ ఏడాది ఎఫ్‌పీఓ సహా ఇతరత్రా మార్గాల్లో రూ.15,000 కోట్ల మేర నిధుల సమీకరణకు ఎస్‌బీఐ డైరెక్టర్ల బోర్డు ఇప్పటికే ఆమోదముద్ర కూడా వేసింది.