
మొండిబాకీల సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కొంత గాడిలోకి వస్తున్న బ్యాంకింగ్ రంగం రానున్న బడ్జెట్‌లో భారీస్థాయి ఆశలేవీ పెట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే మూలధన నిధులను అందించడం, బలహీన బ్యాంకులను విలీనం చేయడం తదితర చర్యలతో ప్రభుత్వం తన ప్రాధాన్యతలను చెప్పకనేచెప్పింది. అయితే, ఎన్‌పీఏ భయాలతో కార్పొరేట్ రంగానికి రుణాలను ఇచ్చేందుకు ఇప్పటికీ బ్యాంకులు జంకుతున్నాయి. ఈ తరుణంలో బడ్జెట్‌లో బ్యాంకులు ఏం కోరుకుంటున్నాయి? ఈ రంగంలో నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం...
హౌసింగ్‌కు ప్రోత్సాహకాలివ్వాలి...
‘ఆర్థిక రంగానికి బ్యాంకులు జీవనరేఖ లాంటివి. ఎకానమీ పుంజుకుంటే ముం దుగా లాభపడేవి బ్యాంకులే. అందుకే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే చర్యలను బడ్జెట్‌లో చేపడతారని భావిస్తున్నాం. అయితే, నేరుగా బ్యాంకులకు సంబంధించి భారీ ప్రకటనలేవీ ఉండకపోవచ్చు’ అని ఫెడరల్ బ్యాంక్ ఎండీ, సీఈఓ శ్యామ్ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. కీలకమైన రంగాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు బ్యాంకింగ్ రంగంపై ప్రభావం చూపుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే లక్ష్యంగా బడ్జెట్‌లో నిర్ణయాలు తీసుకోవాలి. ఇందులో విఫలమైతే మున్ముందు నిరుద్యోగం మరింతగా పెరుగుతుంది.
నాన్‌బ్యాంకింగ్ సంస్థల ద్వారా నేరుగా రుణాలిచ్చిన తనఖాల్లేని రుణాలు(అన్‌సెక్యూర్డ్)తో బ్యాంకుల రిస్కులు మరింత తీవ్రం అవుతాయి’ అని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు హెచ్చరించారు. ఇప్పటికే మంచి కార్పొరేట్ కంపెనీల నుంచి రుణాలకు సంబంధించి డిమాండ్ ఘోరంగా పడిపోవడంతో దీన్ని భర్తీ చేసుకోవాడానికి రిటైల్ రుణాలపై బ్యాంకులు అత్యధికంగా దృష్టిసారిస్తున్నాయి. ‘వాహన, గృహ రుణాలకు సంబంధించి ఎలాంటి ఆందోళనా లేదు. అయితే, వ్యక్తిగత రుణాల చెల్లింపుల్లో మొండి బాకీలు గనుక పెరిగాయంటే బ్యాంకింగ్‌కు కొత్త సమస్యలు తప్పవు’ అని మరో బ్యాంక్ అధికారి అభిప్రాయపడ్డారు.
ఇంకా ఏం ఆశిస్తున్నారంటే...
► హౌసింగ్ రంగానికి ప్రోత్సాహం ఇచ్చే చర్యలు తీసుకోవాలి. దీనివల్ల బ్యాంకింగ్‌కు పరోక్షంగా ప్రయోజం ఉంటుంది.
► నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.25,000 కోట్ల ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి(ఏఐఎఫ్)ను మరింతగా పెంచాలి. దీనివల్ల రియల్టీ రంగం పునరుత్తేజంతో పాటు బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీల సమస్యలకు కూడా అడ్డుకట్టపడుతుంది.
► ద్రవ్యలోటు కట్టడితో పాటు బడ్జెట్‌లో ప్రకటించబోయే ఇతరత్రా విధానపరమైన చర్యల ఆధారంగానే... ఆర్‌బీఐ తదుపరి పాలసీ చర్యలు(వడ్డీరేట్ల విషయంలో) ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీరేట్ల తగ్గింపునకు గత పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ విరామం ప్రకటించింది. తదుపరి సమీక్ష ఫిబ్రవరి 6న జరగనుంది.
► ఇక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లకు సంబంధించి పాక్షిక హామీ పథకం(పీసీజీ)ని ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉంది. సంక్షోభంతో నిధుల సమస్యలను ఎదుర్కొంటున్న ఎన్‌బీఎఫ్‌సీలకు ద్రవ్య సరఫరా పెంచేందుకు కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment