మొండిపద్దుల వర్గీకరణ నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సవరించడం వల్ల మూడో త్రైమాసికంలో నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) పరిమాణం 1.50 శాతం ఎగిసి 6.80 శాతానికి చేరిందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. ఒకవేళ నిబంధనలను సవరించకపోయి ఉంటే స్థూల ఎన్‌పీఏలు (జీఎన్‌పీఏ) 0.30 శాతం మేర తగ్గి 5.3 శాతానికి దిగి వచ్చేవని పేర్కొంది.
అయితే, ఎకానమీలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడుతుండటం, చాలా మటుకు ఎన్‌బీఎఫ్‌సీలు .. తమ వసూళ్ల ప్రక్రియను పటిష్టం చేసుకోవడం తదితర పరిణామాల కారణంగా రాబోయే రోజుల్లో ఎన్‌బీఎఫ్‌సీల జీఎన్‌పీఏలు క్రమంగా తగ్గగలవని క్రిసిల్ ఒక నివేదికలో వివరించింది. డిసెంబర్ క్వార్టర్‌కి ఎన్‌పీఏల వర్గీకరణ విధానాన్ని సవరిస్తూ ఆర్‌బీఐ గతంలో ఒక సర్క్యులర్ జారీ చేసింది. పలు విభాగాలపై దీని ప్రభావం వివిధ రకాలుగా ఉందని క్రిసిల్ తెలిపింది.
బంగారం రుణాల విభాగం మెరుగ్గానే ఉండగా.. వాహనాల ఫైనాన్స్ విభాగంపై అత్యధికంగా ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొంది. అయితే, సర్క్యులర్‌లో నిబంధనల అమలును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ ఆర్‌బీఐ వాయిదా వేయడంతో ఎన్‌బీఎఫ్‌సీలకు కాస్త వెసులుబాటు లభించవచ్చని క్రిసిల్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment