బ్యాంకింగ్‌ అవుట్‌లుక్‌... స్టేబుల్‌ | India Rating Gave Stable Tag To Banking Sector | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌ అవుట్‌లుక్‌... స్టేబుల్‌

Published Wed, Sep 8 2021 9:01 AM | Last Updated on Wed, Sep 8 2021 9:15 AM

India Rating Gave Stable Tag To Banking Sector - Sakshi

ముంబై: భారత బ్యాంకింగ్‌ రంగానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘స్టేబుల్‌’ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు ఇండియా రేటింగ్స్‌ ప్రకటించింది. అయితే రిటైల్, సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు పంపిణీ చేసిన రుణాలకు సంబంధించి బ్యాంకింగ్‌ 2022 మార్చి ముగిసే నాటికి కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా పేర్కొంది. బ్యాంకింగ్‌పై దేశీయ రేటింగ్‌ సంస్థ విడుదల చేసిన అర్థవార్షిక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 


-  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా మొండిబకాయిలు (జీఎన్‌పీఏ) ఇచ్చిన రుణాల్లో 8.6 శాతంగా కొనసాగవచ్చు. ఒత్తిడిని ఎదుర్కొనే రుణాల విషయంలో ఈ శాతం 10.3 శాతంగా ఉండే వీలుంది.  
- కోవిడ్‌–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొనే విషయంలో బ్యాంకింగ్‌ పటిష్టంగా ఉండడం అవుట్‌లుక్‌ యథాతథ కొనసాగింపునకు కారణం.  
- బ్యాంకులకు తగిన మూలధనం అందే అవకాశం ఉంది. అందువల్ల వాటి ఫైనాన్షియల్‌ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతాయి.  
- మొండిబకాయిలకు సంబంధించి కూడా గత నాలుగు సంవత్సరంల్లో తగిన ప్రొవిజన్స్‌  (కేటాయింపులు) జరుగుతున్నాయి.  
- రుణాలు, డిపాజిట్ల విషయంలో ప్రైవేటు బ్యాంకుల మార్కెట్‌ షేర్‌ పెరుగుతుందని వాటికి సంబంధించి ‘స్టేబుల్‌’ అవుట్‌లుక్‌ సూచిస్తోంది. దిగ్గజ ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) గట్టి పోటీని ఇవ్వగలుగుతాయి. ఆయా బ్యాంకులు మూలధన నిల్వలను పెంచుకోగలుగుతున్నాయి. తమ పోర్ట్‌ఫోలియోను సానుకూలంగా, క్రియాశీలంగా నిర్వహించుకోగలుగుతున్నాయి.  
- భారీ మూలధన కేటాయింపుల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని భావిస్తున్నాం. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరం వరకూ  ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం రూ.2.8 లక్షల కోట్ల మూలధనం అందించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 0.2 లక్షల కోట్ల కేటాయింపులు జరిగాయి.  
- బ్యాంకింగ్‌ వ్యవస్థ డిపాజిట్లలో 6.5 శాతం వాటా కలిగిన ఐదు బ్యాంకుల విషయంలో ఇండియా రేటింగ్స్‌ ‘నెగిటివ్‌ అవుట్‌లుక్‌’ను కలిగిఉంది. బలహీన మూలధనం, ఆయా బ్యాంకుల ఆర్థిక పరిస్థితుల విషయంలో బలహీనతలు దీనికి కారణం.  
-  రిటైల్‌ రంగంలో రుణ నాణ్యత విషయానికి వస్తే, ప్రైవేటు బ్యాంకింగ్‌ రంగంలో ఈ విలువ 2020–21తో పోల్చితే 2021–22లో 100 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఇది 45 శాతానికి పరిమితం కావచ్చు.  
- గృహ రుణాలుసహా రిటైల్‌ రుణాల విషయంలో బ్యాంకులు రుణ పునర్‌వ్యవస్థీకరణ జరిపే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల తక్షణం డిఫాల్డ్‌లకు అవకాశం ఉండదు. ఈ విభాగంలో  ఒత్తిడిలో ఉన్న రుణాలు, పునర్‌వ్యవస్థీకరణలో ఉన్న రుణాలు కలిపి 2021–22 ముగిసే నాటికి 5.8 శాతానికి (మొత్తం రుణాల్లో) చేరవచ్చు. 
- ఎంఎస్‌ఎంఈ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పెద్ద నోట్ల రద్దు నుంచీ ఈ సమస్య తలెత్తింది. దీనికితోడు జీఎస్‌టీ, ఆర్‌ఈఆర్‌ఏలూ ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. ఇప్పడు కోవిడ్‌–19తో సవాళ్లు మరింత తీవ్రమయ్యాయి.  అయితే సవాళ్లను ఎదుర్కొనడంలో ప్రభుత్వం నుంచి తగిన మద్దతు అందుతోంది. ఇందులో అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) కింద తగిన లిక్విడిటీ లభ్యం అవుతుండడం గమనార్హం. రుణ పునర్‌వ్యవస్థీకరణ కూడా ఆయా రంగాలకు ప్రయోజనం కలిగిస్తోంది.  
- ఎంఎస్‌ఎంఈ రంగానికి ఇచ్చిన మొత్తం రుణాల్లో స్థూలంగా మొండిబకాయిలు (జీఎస్‌పీఏ) 2021–22 ముగిసేనాటికి 13.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది.   2020–21 ముగిసే నాటికి ఈ రేటు 9.9 శాతం. ఇక ఇదే సమయంలో ఒత్తిడిలో ఉన్న రుణాల శాతం 11.7 శాతం నుంచి 15.6 శాతానికి చేరవచ్చు. కార్పొరేట్‌ రుణాల విషయంలో ఇది జీఎన్‌పీఏ 10.2 శాతానికి, ఒత్తిడి ఉన్న రుణాలు 11.3 శాతానికి ఎగసే వీలుంది. ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ఆదుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 
రుణ వృద్ధి 8.9 శాతం 
2021–22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ రుణ వృద్ధి 8.9 శాతంగా ఉంటుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ ఉండబోదని రేటింగ్‌ ఏజెన్సీ పేర్కొంది. ప్రభుత్వ వ్యయాలు ప్రత్యేకించి మౌలిక రంగంలోకి వెళుతున్న పెట్టుబడులు, రిటైల్‌ రుణాలకు డిమాండ్‌ పునరుద్దరణ వంటి అంశాలు దీనికి దోహదం చేసే అంశాలుగా పేర్కొంది.

స్టేబుల్‌ టూ ఇంప్రూవింగ్‌
నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు, హౌసింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలకు సంబంధించి 2021–22 అవుట్‌లుక్‌ను గత వారమే ఇండియా రేటింగ్స్‌ ‘‘స్టేబుల్‌’’ నుంచి ‘‘ఇంప్రూవింగ్‌’’కు మార్చింది. నిర్వహణా పరమైన, తక్కువ వడ్డీరేటు చర్యల వల్ల నాన్‌ బ్యాంకింగ్‌ తగిన లిక్విడిటీ, మూలధన నిల్వలు, స్థిర మార్జిన్లు కలిగి ఉందని కూడా ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. సవాళ్లను తట్టుకుని నిలబడగలిగిన స్థాయిలో నాన్స్‌ బ్యాంక్‌ ఉన్నాయని విశ్లేషించింది. 

చదవండి : టీప్లస్‌1 సెటిల్‌మెంట్‌కు సెబీ గ్రీన్‌సిగ్నల్‌

ఎకానమీ వృద్ధిరేటు
భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఇండ్‌  రా) ఇటీవలే 30 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెంచింది. ఇంతక్రితం 9.1 శాతం ఉన్న అంచనాలను 9.4 శాతానికి అప్‌గ్రేడ్‌ చేసినట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. అధిక ఎగుమతులు, తగిన వర్షపాతం నేపథ్యంతో కోవిడ్‌–19 సెకండ్‌వేవ్‌ సవాళ్ల నుంచి దేశం ఆశ్చర్యకరమైన రీతిలో వేగంగా కోలుకుంటుండడమే తమ అంచనాల పెంపునకు కారణమని తెలిపింది.  ప్రస్తుతం జరుగుతున్నది ‘వీ’ ( ఠి) నమూనా రికవరీ కాదని, ‘కే’ ( జు) నమూనా రికవరీ అని సంస్థ పేర్కొంటోంది.  వృద్ధి నుంచి కొందరు  మాత్రమే ప్రయోజనం పొందే పరిస్థితి ‘కే’ నమూనా రికవరీలో ఉంటుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement