ఎన్‌పీఏలపై ఆర్‌బీఐకి వారం గడువు
నిపుణుల నివేదికపై స్పందన తెలియజేయాలన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారానికి చర్యల్ని సూచిస్తూ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై వారం రోజుల్లోగా స్పందన తెలియజేయాలని ఆర్‌బీఐని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. బ్యాంకింగ్ రంగంలో ఎన్‌పీఏలు రూ.8 లక్షల కోట్లకు చేరడంతో వీటి పరిష్కారంపై చర్యల్ని సూచించేందుకు గాను ఆర్‌బీఐ ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ 12 బడా రుణ ఎగవేత కేసుల్లో చర్యలు సూచిస్తూ ఇటీవల ఆర్‌బీఐకి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (సీపీఐఎల్) అనే స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.
సీపీఐఎల్ తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. బ్యాంకులకు రూ.500 కోట్లకు పైబడి రుణ బకాయిలు పడిన అందరి పేర్లను బయటపెట్టాలంటూ ఆర్‌బీఐని ఆదేశించాలని కోరారు. దీన్ని ఆర్‌బీఐ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. పేర్లను వెల్లడించాల్సిన బాధ్యత ఆర్‌బీఐపై లేదని స్పష్టం చేశారు. దీంతో నిపుణుల కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదికపై స్పందన తెలియజేసేందుకు ఈ నెల 24 వరకు ఆర్‌బీఐకి గడువిస్తూ చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
నిజానికి సీపీఐఎల్ ఈ విషయంలో 2003లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రూ.500 కోట్ల పైబడి రుణ ఎగవేతదారుల జాబితాను వెల్లడించాలని సుప్రీంకోర్టు లోగడే ఆర్‌బీఐని కోరింది. ఆ తర్వాత పేర్లను వెల్లడించకపోయినా రుణ బకాయిలు ఎంతున్నాయన్నది బయటపెడితే చాలని వెసులుబాటు ఇచ్చింది. అయినప్పటికీ ఇది గోప్యత అధికారాల కిందకు వస్తుందంటూ ఆర్‌బీఐ దాన్ని వ్యతిరేకిస్తోంది.