బ్యాంకులపై రూ.18,000 కోట్ల భారం
♦ 12 భారీ ఎన్‌పీఏలకే పక్కన పెట్టాల్సిన అవసరం
♦ 25 శాతం లాభాలకు గండి: ఇండియా రేటింగ్స్
ముంబై: ఆర్‌బీఐ గుర్తించిన భారీ రుణ ఎగవేత కేసుల రూపంలో దేశీయ బ్యాంకుల లాభదాయకత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం తగ్గిపోనుందని ఇండియా రేటింగ్స్ ఏజెన్సీ పేర్కొంది. ఇటీవల ఆర్‌బీఐ 12 భారీ రుణ ఎగవేత కేసుల్లో ఇన్‌సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ కింద చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. వీటి కోసం బ్యాంకులు అదనంగా రూ.18,000 కోట్ల నిధులను పక్కన పెట్టాల్సి ఉంటుందని ఇండియా రేటింగ్స్ వివరించింది. ఈ 12 కేసుల్లో ఒకటైన ఎస్సార్ స్టీల్ ఆర్‌బీఐ ఆదేశాలను గుజరాత్ హైకోర్టులో సవాల్ చేయగా... కోర్టు బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఖాతాలకు సగటు కేటాయింపులు 42 శాతంగా ఉండగా, ఆర్‌బీఐ ఆదేశాల నేపథ్యంలో 50 శాతం చేయాల్సి ఉంటుందని ఇండియా రేటింగ్స్ పేర్కొంది.
అది ఈ ఆర్థిక సంవత్సరంలోనే నెరవేర్చాల్సి ఉందని తెలిపింది. ఈ అదనపు కేటాయింపుల వల్ల నేరుగా బ్యాంకుల లాభంపై 25 శాతం మేర ప్రభావం పడుతుందని వివరించింది. ఆస్తుల రాబడులపైనా 0.12 శాతం ప్రభావం చూపిస్తుందని తెలిపింది. కొన్ని మధ్య స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకుల లాభ, నష్టాల ఖాతాలపై ఈ ఒత్తిడి అసాధారణంగా ఉంటుందని అంచనా వేసింది. పెద్ద స్థాయి ప్రభుత్వ రంగ బ్యాంకులకు మెరుగైన మార్కెట్ విలువ, నిధులు పొందే సౌలభ్యం ఉందని, నాన్ కోర్ ఆస్తులను విక్రయించగలవని... చిన్న స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకులకు బెయిలవుట్ ప్యాకేజీ (ప్రభుత్వం నుంచి నిధుల సాయం) అవసరమవుతుందని నివేదికలో ఇండియా రేటింగ్స్ పేర్కొంది. ప్రభుత్వరంగ ఎస్‌బీఐ ఎన్‌పీఏలకు అధిక కేటాయింపులు చేయాల్సి ఉంటుందని, అయినా లాభాలపై పెద్దగా ప్రభావం ఉండబోదని ఇప్పటికే స్పష్టం చేయగా... ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంకు మాత్రం భారీ రుణ ఎగవేత కేసులకు సంబంధించి తగినంత నిధులు కేటాయింపులు చేయాల్సి ఉందని ప్రకటించింది.
రుణాలపై అదనపు వివరాలు వెల్లడించాల్సిందే: సెబీ
ఆస్తుల వర్గీకరణ మధ్య తేడా, నిధుల కేటాయింపులు (ప్రొవిజనింగ్)కు సంబంధించి అదనపు వివరాలు వెల్ల డించాలని లిస్టెడ్ బ్యాంకులను సెబీ కోరింది. ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా చేసే కేటాయింపులు లాభాల్లో 15 శాతం దాటితే బ్యాంకులు స్టాక్ ఎక్సేంజ్‌లకు ప్రత్యేకంగా తెలియజేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా పెరిగిన స్థూల ఎన్‌పీఏల్లో ఆర్‌బీఐ గుర్తించిన స్థూల ఎన్‌పీఏలు 15 శాతం మించినాగానీ ఆ వివరాలను ఆర్థిక ఫలితాలతో పాటు స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేయాల్సి ఉంటుందని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది.