
బ్యాంకుల నుంచి కేంద్రానికి తగ్గనున్న డివిడెండ్
పెద్ద నోట్ల రద్దు ప్రభావాలు, మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం తదితర అంశాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల...
• ఈసారి రూ. 1,000 కోట్ల కన్నా తక్కువే
• కొంతైనా చెల్లించలేమని చేతులెత్తేసిన కొన్ని బ్యాంకులు
• డీమోనిటైజేషన్, ఎన్‌పీఏలే కారణం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావాలు, మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం తదితర అంశాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) నుంచి కేంద్రానికి వచ్చే డివిడెండ్ తగ్గవచ్చని తెలుస్తోంది. ఇది రూ. 1,000 కోట్ల కన్నా తక్కువే ఉండొచ్చని సమాచారం. కొన్ని పీఎస్‌బీలు ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికే డివిడెండ్ చెల్లించకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ మంజూరీ అంతంత మాత్రంగా ఉండటం, ఎన్‌పీఏల భారం తదితర అంశాలతో లాభాలు తగ్గనుండటంతో తాము డివిడెండ్ చెల్లించలేమంటూ పలు పీఎస్‌బీల అధిపతులు.. ఆర్థిక శాఖకు ఇప్పటికే తెలియజేసినట్లు వివరించాయి.
గతేడాది జూన్ ఆఖరు నాటికి రూ. 5,50,346 కోట్లుగా ఉన్న పీఎస్‌బీల స్థూల ఎన్‌పీఏలు సెప్టెంబర్ 30 నాటికి రూ. 6,30,323 కోట్లకు పెరిగాయి. ఇక పెద్ద నోట్ల రద్దు దరిమిలా బ్యాంకింగ్ కార్యకలాపాలపై రెండు నెలల పాటు ప్రతికూల ప్రభావం పడటంతో వాటి ఆదాయం ఆ మేర తగ్గినట్లు పరిశీలకుల అంచనా. నోట్ల రద్దు అనంతరం రుణాల మంజూరీ రికార్డు కనిష్టం 5.3 శాతం స్థాయిని తాకింది. మరింత మూలధనం కావాలంటూ కోరుతున్న బ్యాంకులు.. ఈ పరిస్థితుల్లో డివిడెండ్ చెల్లించలేకపోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
పీఎస్‌బీల్లో ప్రభుత్వానికి మెజారిటీ వాటాలు ఉంటాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం లాభాల్లో ఉన్న బ్యాంకులు తమ ఈక్విటీలో కనీసం 20%మైనా లేదా పన్ను అనంతర లాభాల్లో 20 శాతం గానీ (ఏది ఎక్కువైతే అది) డివిడెండ్ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వివిధ అంశాల కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ సహా 16 పీఎస్‌బీలు 2015–16లో డివిడెండ్ చెల్లించలేదు.
దీంతో కేంద్రానికి పీఎస్‌బీల నుంచి రావాల్సిన డివిడెండ్ ఆదాయం సుమారు 67% క్షీణించి రూ. 1,445 కోట్లకు తగ్గిపోయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 4,336 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం కాస్త తక్కువ ఇచ్చినా.. ఎస్‌బీఐ సహా ఆరు బ్యాంకులు మాత్రమే డివిడెండ్ చెల్లించాయి. ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం 2015–16లో ఎస్‌బీఐ అత్యధికంగా రూ. 1,214.6 కోట్లు కట్టింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 22% తక్కువే. మరోవైపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రితం కట్టిన దాంట్లో మూడింట ఒక్క వంతు రూ. 85 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఐదో వంతు రూ. 12.4 కోట్లు కట్టింది. అలహాబాద్ బ్యాంక్, బీఓబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి డివిడెండ్ చెల్లించనే లేదు.