ఎగవేతదారులపై నిఘా నేత్రం!
డిటెక్టివ్‌ల సహాయాన్ని ఆశ్రయిస్తున్న బ్యాంకింగ్
* డిఫాల్టర్ల లావాదేవీలు తెలుసుకునే ప్రయత్నం
న్యూఢిల్లీ: మొండిబకాయిలు (ఎన్‌పీఏ), అలాగే ఆర్థిక మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు బ్యాంకింగ్ వినూత్న రీతిలో ప్రైవేట్ డిటెక్టివ్‌ల సహాయాన్ని తీసుకుంటోంది. కోట్లాది రూపాయల్లో బ్యాంకులకు టోపీ పెట్టినవారు ఎక్కడ ఉంటున్నారు? ఏమి చేస్తున్నారు.? వారి ఆర్థిక లావాదేవీలు ఏమిటి?వంటి అంశాలను డిటెక్టివ్‌లు రహస్యంగా విచారించి సంబంధిత బ్యాంక్ అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారు.
ఇందుకు సంబంధించి డిటెక్టివ్‌ల ఎంపికకు... సంబంధిత ఏజెన్సీలను సంప్రదించడం, ప్రకటనల వంటి ప్రక్రియలో బ్యాంకింగ్ నిమగ్నమయినట్లు సమాచారం. నిజానికి గతంలో చిన్న ఎగవేతదారుల విషయంపై కొన్ని బ్యాంకులు ఇలాంటి చర్యలు తీసుకునేవని, అయితే ఇప్పుడు బడా వ్యక్తుల సమాచారాన్ని సేకరించడంపై పలు బ్యాంకులు దృష్టి సారించాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ డిటెక్టివ్స్ ఆఫ్ ఇండియా (ఏపీడీఐ) కున్వర్ విక్రమ్ సింగ్ తెలిపారు.
రుణ గ్రహీత, గ్యారెంటార్, డెరైక్టర్ వంటి ఎగవేత సంస్థ కీలక వ్యక్తుల వివరాలను తెలుసుకునే విషయంలో ఒక్కొక్క కేసుకూ రూ.7,500 ఒక ప్రముఖ బ్యాంక్ చెల్లిస్తున్నట్లు డిటెక్టివ్ ఏజెన్సీ ఒకటి పేర్కొంది. బ్యాంకింగ్ రికార్డుల్లో లేని ఆస్తులను గుర్తిస్తే.. రూ.20,000 చెల్లిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.