Private Detective
-
ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
Kiran Gosavi, NCB Witness In Aryan Khan Case, Arrest: ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విట్నెస్, డిటెక్టివ్ కిరణ్ గోసవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ని పూణె పోలీసులు విచారిస్తున్నారు. ఆర్యన్ అరెస్ట్ తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కారణ్ గోసవి ఇటీవలె ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 2న క్రూయిజ్ నౌకపై దాడి జరిగిన కిరణ్ గోసవి సహా ఆయన వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్సీబీ గోసవిని, ప్రభాకర్‌ని సాక్షులుగా చేర్చి విచారించింది. చదవండి: ఆర్యన్‌కు బెయిల్ రాకపోతే జరిగేది ఇదే.. ఆర్యన్‌ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు కిరణ్ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాతో తెగ వైరల్ అయ్యింది. అయితే తర్వాత గోసవి కనిపించకుండాపోవడం, అతనిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా ఇటీవలె మీడియాతో మాట్లాడుతూ ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్‌ఖాన్‌ను విడిచిపెట్టడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులతో రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని ప్రభాకర్ సాయిల్ సంచలన కామెంట్స్ చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభాకర్ తాను సమర్పించిన అఫిడవిట్లో ఆరోపించారు. చదవండి: Aryan Khan: ఆర్యన్‌ను వదిలేయడానికి రూ.25 కోట్లు? వాంఖెడే X నవాబ్ మాలిక్ -
నారీ గూఢచారి
తొలి మహిళా ప్రైవేట్ డిటెక్టివ్ రజనీ పండిత్ ఇప్పటివరకు 80 వేలకు పైగా కేసులను పరిశోధించి, పరిష్కరించారు. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ప్రసిద్ధ ఫేస్బుక్ పేజీలో రెండు రోజుల క్రితం అక్టోబర్ 31 వతేదీ నాడు ఒక మహిళ ఒక పోస్ట్ పెట్టింది. పదిహేడు గంటల్లో పద్నాలుగు వేల లైక్స్, వెయ్యి షేర్లతో వైరల్ అయింది ఈ పోస్ట్. ఆ పోస్టు సారాంశం ఇదీ. ‘‘చాలా ఏళ్ల కిందట.. ఒక డబుల్ మర్డర్ జరిగింది. తండ్రి, కొడుకు ఇద్దరూ హత్యకు గురయ్యారు. ఛేదించడానికి చిన్న క్లూ కూడా లేదు. ఈ కేస్‌కు సంబంధించి ఎందరో అనుమానితులు. ఫిల్టర్ చేయగా చేయగా ఒక మహిళ మిగిలింది. ఆమే.. కాదో తేల్చుకోవాలి. ఎలా? వాళ్లింట్లో పని మనిషిగా చేరాను. ఓ ఆర్నెల్లు ఉన్నాను. ఆమెకు నమ్మిన బంటుగా మారడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాల్సి వచ్చిందో. ఆమె జబ్బు పడితే సపర్యలూ చేశా. అట్లా నెమ్మది నెమ్మదిగా ఆమె నమ్మకాన్ని సాధించా. కానీ ఒకసారి.. అంతా నిశ్శబ్దంగా ఉంది. జరగబోయే సంభాషణ రికార్డ్ చేద్దామని రికార్డర్ ఆన్ చేశా.. రహస్యంగా. క్లిక్‌మన్న సౌండ్‌ను విని ఆమె నన్ను అనుమానించడం మొదలుపెట్టింది. బయటకు వెళ్లనివ్వకుండా ఆపేది. దాదాపుగా హౌస్ అరెస్ట్ చేసేసింది.ఒకరోజు.. ఒక వ్యక్తి వచ్చాడు. అతనికి, ఆమెకు జరిగిన సంభాషణను బట్టి అతను కిరాయి హంతకుడు అని తేలింది. ఇక ఆ అవకాశం వదులుకోదల్చుకోలేదు నేను. వంటింట్లోకి వెళ్లి కత్తితో కాలు మీద గాటు పెట్టుకున్నా. అదేదో ప్రమాదవశాత్తు జరిగినట్టు నటించి.. రక్తమోడుతున్న కాలుని ఆమెకు చూపించి వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి కట్టుకట్టించుకుని వస్తానని చెప్పి.. ఆమె పర్మిషన్ కోసం చూడకుండా వడివడిగా బయటకు నడిచాను. గేట్ దాటాక పరిసరాల్లో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్‌కి పరిగెత్తాను. పోలీసులకు ఫోన్ చేసి .. వాళ్లొచ్చేవరకు అక్కడే కాపు కాసి వాళ్లు వచ్చాక వాళ్లతోపాటే మళ్లీ ఆమె ఇంటికి వెళ్లాను. అప్పటికే ఆ కిరాయి హంతకుడికి, ఆమెకు ఏదో వాగ్వివాదం జరుగుతోంది. పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఇదీ నా కెరీర్లో అత్యంత క్లిష్టమైన, కఠినమైన కేస్..’’ పై పోస్టు పెట్టిన ఆ మహిళ పేరు రజనీ పండిత్. మన దేశపు ఫస్ట్ విమెన్ ప్రైవేట్ డిటెక్టివ్. రజనీ తండ్రి సీఐడీలో పనిచేసేవారు. ఆయన ఇన్స్పిరేషన్, ఇన్‌ఫ్లుయెన్స్‌తోనే ఆమె ఇన్వెస్టిగేషన్ పట్ల ఆసక్తిని పెంచుకుంది. తండ్రి వర్కింగ్ స్టయిల్‌ను దగ్గరగా చూసి, చూసి తనూ నైపుణ్యమూ సంపాదించుకుంది. డిగ్రీలో ఉన్నప్పుడే పార్ట్‌టైమ్‌గా డిటెక్టివ్ వర్క్ మొదలుపెట్టింది. ఆమె చేపట్టిన మొదటికేస్.. తన యజమాని ఇంట్లో జరుగుతున్న వరుస దొంగతనాల దొంగను పట్టుకోవడం. ఆ దొంగ ఎవరో కాదు.. యజమాని కొడుకే అని తన ఇన్వెస్టిగేషన్తో తేల్చేసింది రజనీ. నాటి నుంచి నేటి వరకు రజనీ 80 వేల కేసులకు పైగా పరిశోధించి, పరిష్కరించింది. రెండు పుస్తకాలనూ రాసింది. అందిన పురస్కారాలకు లెక్కేలేదు. 22వ యేట ఆరంభమైన ఆమె పరిశోధన ఇప్పటి దాకా అప్రతిహతంగా సాగుతూనే ఉంది.. పెళ్లి, పిల్లలతో సొంత కుటుంబాన్ని ఏర్పర్చుకోవాలనే ధ్యాస, తలపు లేకుండా. అందుకే అంటుంది.. ‘‘ఇన్వెస్టిగేషనే నా జీవన సహచరుడు’’ అని. అంత నిబద్ధత రజనీకి తన పనిపట్ల. కాబట్టే ఆమెను ‘‘దేశీ షెర్లాక్’’ అంటారంతా! – శరాది -
‘అలా హంతకులను అరెస్టు చేయించాను’
నాపై అనుమానం రావడంతో నన్ను బయటికి వెళ్లకుండా ఆమె అడ్డుకుంది. కానీ ఓ రోజు హంతకుడు సరాసరి ఆమె ఇంటికే వచ్చాడు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక కత్తితో కోసుకున్నా. ఆ తర్వాత ఇద్దరిని అరెస్టు చేయించా- ప్రైవేట్ డిటెక్టివ్ రజనీ పండిట్ భారత్‌లో మొట్టమొదటి ప్రైవేట్ మహిళా డిటెక్టివ్‌గా గుర్తింపు పొందారు మహారాష్ట్రకు చెందిన రజనీ పండిట్. సీఐడీ ఆఫీసర్ కూతురైన రజనీకి.. ఏ విషయం గురించైనా పూర్తిగా తెలుసుకోవాలనే ఆసక్తి చిన్ననాటి నుంచే మెండుగా ఉండేదట. ఆ ఆసక్తే తనను డిటెక్టివ్‌గా మార్చిందని, సుమారు 80 వేల కేసులు పరిష్కరించేలా చేసిందని రజనీ పేర్కొన్నారు. అలా మొదలైంది.. ‘కాలేజీలో చదువుకునే రోజుల్లో పార్ట్ టైమ్ చేసేదాన్ని. అక్కడే పనిచేసే ఓ మహిళ తన ఇంట్లో తరచుగా దొంగతనం జరుగుతోందని చెప్పింది. కొత్త కోడలిపైనే తనకు అనుమానమట. అయితే ఆధారాలు లేకుండా ఒకరిని నిందించడం తప్పు కదా.. అందుకే మీ ఇంట్లో దొంగతనాలకు కారణం ఎవరో కనిపెడతానని తనకు చెప్పాను. రోజు వాళ్ల వీధిలో కాపలా కాశాను. ఆమె కొడుకుపై అనుమానం వచ్చింది. అన్ని విషయాలు నిర్ధారించుకున్న తర్వాత నేనెవరో చెప్పకుండా.. మీ ఇంట్లో నుంచి డబ్బులు పోవడానికి కారణం నువ్వే కదా అని అతడిని నిలదీశాను. కాసేపటి తర్వాత నేరం ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని అతడి తల్లికి చెప్పి.. వాళ్ల కోడలిని నిర్దోషిగా నిరూపించాను. అలా 22 ఏళ్ల వయస్సులో.. ఓ దొంగతనం కేసుతో నా కెరీర్ మొదలైందంటూ రజనీ పంచుకున్న అనుభవాలను.. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయగా లైక్‌లు, షేర్లతో వైరల్‌గా మారింది. పనిమనిషిలా ఆరునెలలు.. ‘అది జంట హత్యలకు సంబంధించిన కేసు. తండ్రీ కొడుకులిద్దరు హత్యకు గురయ్యారు. కానీ హంతకులను పట్టుకుందామంటే ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే ఓ మహిళపై మాత్రం అనుమానం ఉంది. అందుకే సదరు మహిళ ఇంట్లో పనిమనిషిగా చేరాను. అదే సమయంలో ఆమె అనారోగ్యానికి గురైంది. ఇదేదో నాకు కలిసి వచ్చే అంశమే అనుకున్నా. ఆమె కోలుకునేందుకు సాయం చేస్తూ నెమ్మదిగా ఆమె నమ్మకాన్ని సంపాదించా. అయితే ఓరోజు ఉన్నట్టుండి అంతా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో నా రికార్డర్ ఆన్ అయిన క్లిక్ సౌండ్ వినిపించింది. దీంతో ఆమెకు అనుమానం కలిగింది. అప్పటి నుంచి నన్ను బయటికి వెళ్లకుండా అడ్డుకుంది. అలా ఆరునెలలు గడిచాయి. ఒకరోజు ఆ ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. వారి సంభాషణ విన్న తర్వాత అతడే హంతకుడు అని, అతడికి సహకరించిన మరో వ్యక్తి సదరు మహిళేనని నాకు అర్థమయింది. కానీ తప్పించుకోవడం ఎలాగో తెలీలేదు. అందుకే నా పాదంపై కత్తితో కోసుకున్నా. రక్తం కారుతోంది.. నన్ను రక్షించండి అంటూ ఏడ్చాను. బ్యాండేజ్ తెచ్చుకుంటానని చెప్పి బయటికి పరిగెత్తాను. వెంటనే ఎస్టీడీ బూత్‌కు వెళ్లి నా క్లైంట్‌కి ఫోన్ చేసి పోలీసులను తీసుకురావాలని చెప్పాను. ఆ ఇద్దరు దోషులని అరెస్టు చేయించాను’ అంటూ తన కెరీర్లో డీల్ చేసిన అత్యంత సంక్లిష్టమైన కేసు ఇదేనని రజనీ పేర్కొన్నారు. నేను దేశీ షెర్లాక్‌ని... తన కెరీర్లో సుమారు 80 వేల కేసులు పరిష్కరించానన్న రజనీ తనని తాను దేశీ షెర్లాక్(డిటెక్టివ్)గా చెప్పుకోవడానికి ఇష్టపడతానన్నారు. కష్టానికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు పొందిన తనకు.. ఎన్నోసార్లు బెదిరింపులు కూడా వచ్చేవని గుర్తుచేసుకున్నారు. అయితే చేసే పని పట్ల నమ్మకం, నిజాయితీ ఉండి.. కొంచెం ధైర్యం ఉంటే చాలు ఎవరైనా డిటెక్టివ్‌గా దూసుకుపోవచ్చని సలహా ఇచ్చారు. -
దేశంలో పెరుగుతున్న డిటెక్టివ్‌ల బిజినెస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఎవరి ఫోన్ డేటాను సేకరించవద్దని, అసలు ఫోన్ డేటానే కోరవద్దని, అలా చేసినట్లయితే సంఘంలో సభ్యత్వం రద్దవుతుందని ‘అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ డిటెక్టివ్స్ అండ్ ఇన్వెస్టిగేటర్స్–ఇండియా’ ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న తమ సభ్యులను హెచ్చరించింది. కాల్‌డేటా రికార్డులను అక్రమంగా సేకరించి వాటిని విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ముంబైలో ఇటీవల ప్రైవేట్ డిటెక్టివ్‌లను వరుసగా పోలీసులు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో అసోసియేషన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. దేశంలో తొలి మహిళా ప్రైవేటు డిటెక్టివ్ రజనీ పండిత్‌ను, కంగనా రనౌత్, నవాజుద్దీన్ సిద్ధికీ లాంటి బాలీవుడ్ తారలను క్లైంటులుగా కలిగిన లాయర్ రిజ్వాన్ సిద్ధికీని ఇవే ఆరోపణలపై పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. భారత దేశంలో ప్రైవేటు డిటెక్టివ్ వ్యవస్థ రోజు రోజుకు పుంజుకుంటోంది. ఏడాదికి 30 శాతం చొప్పున పెరుగుతోంది. 2020 నాటికి ఈ వ్యవస్థ 1700 కోట్ల రూపాయలకు చేరుకుంటుందన్నది ఓ అంచనా. దేశంలో పోలీసు వ్యవస్థతోపాటు పలు దర్యాప్తు సంస్థలు ఉన్నప్పటికీ ప్రైవేటు డిటెక్టివ్‌ల అవసరం ఎందుకు పెరుగుతోంది? ఈ డిటెక్టివ్లు టార్గెట్ వ్యక్తులను అనుసరించి వారు ఎక్కడెక్కడికి వెళుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, వారి ఫోన్ కాల్స్ సమాచారాన్ని సేకరించడం నేరమా? వ్యక్తుల ఫోన్ కాల్స్ సమాచారాన్ని వారి అనుమతి లేకుండా సేకరించడం మాత్రం చట్ట ప్రకారం నేరమే. క్రిమినల్ కేసుల్లో, అది డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి ఆదేశంతో పోలీసులు ఫోన్ కాల్స్ డేటాను సేకరించవచ్చు. ప్రైవేటు డిటెక్టివ్లకు ఆ అనుమతిలేదు. అయినా వారు తమ పలుకుబడిని ఉపయోగించి లేదా టెలికమ్ కంపెనీల ఉద్యోగులను ప్రలోభపెట్టి కాల్ డేటాను సేకరిస్తుంటారు. ఎవరు, ఎవరితో మాట్లాడారు? ఎక్కడి నుంచి మాట్లాడారు? ఎంత సేపు మాట్లాడారు? ఎక్కడి నుంచి మాట్లాడారు? అన్న సమాచారం టెలికమ్ సంస్థల వద్ద రికార్డయి ఉంటుంది. సాధారణంగా పోలీసులు టేకప్ చేయని కేసులను ఈ ప్రైవేట్ డిటెక్టివ్లు టేకప్ చేస్తారు. భార్య లేదా భర్త ఎవరెవరితో తిరుగుతున్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఎవరెవరితో మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో, వారి మధ్య అక్రమ సంబంధం ఉందా, లేదా? అన్న విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువ మంది ప్రైవేటు డిటెక్టివ్‌లను ఆశ్రయిస్తారు. పెళ్లి చేసుకోబోయే యువకుడు లేదా యువతి నడతను తెలుసుకునేందుకు కూడా వీరు ఉపయోగపడుతున్నారు. కాలేజీ కెళుతున్న తమ పిల్లలు ఏ సమయానికి, ఏం చేస్తున్నారో, వారి స్నేహితులు ఎలాంటి వారు? వారికి చెడు అలవాట్లు ఏమైనా అబ్బాయా? అన్న అంశాలను తెలుసుకోవడానికి ఈ మధ్య తల్లిదండ్రులు తమ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని ముంబైలోని మరాఠా డిటెక్టివ్ ఏజెన్సీ అధిపతి జిగ్నేష్ ఛెడ తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములు ఏమైనా మోసం చేస్తున్నారా? ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారు? అన్న విషయాలతోపాటు వివిధ రకాల ప్రాజెక్టుల్లో ఎవరి ఎంత బిడ్డింగ్ వేస్తున్నారో కూపీ లాగడం కోసం కూడా డిటెక్టివ్‌ల సేవలను ఉపయోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. వ్యక్తులను ఫాలో అవడం, వారి ఫొటోలను తీయడం, వారి కాల్ డేటాను సేకరించడం చట్ట విరుద్ధం కాదా ? అని ప్రశ్నించగా, పోలీసులు టేకప్ చేయని కేసులే తమ వద్దకు వస్తాయని, ఆ కేసులను పరిష్కరించడంలో తాము ఈ పద్ధతులను అనుసరించక తప్పదని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఢిల్లీ డిటెక్టివ్ ఒకరు చెప్పారు. క్లైంట్ భార్య లేదా భర్తకు అక్రమ సంబంధం ఉందని రుజువు చేయాలంటే ఫొటోలు, వారి కాల్‌డేటా అవసరం అవుతుందని ఆయన అన్నారు. కొందరు కాబోయే భార్య లేదా భర్త మెడికల్ హిస్టరీని తెలుసుకునేందుకు కూడా వీరి సేవలను వాడుకుంటున్నారు. దేశంలో ప్రైవేటు డిటెక్టివ్‌ల ఏజెన్సీలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం 2007లో ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది. అయితే దాన్ని ఇంతవరకు ఆమోదించకుండా పక్కన పడేసింది. పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా భారత్‌లో బలమైన ‘ప్రైవసీ’ చట్టాలు లేవుగానీ, ఉంటే డిటెక్టివ్‌ల ఏజెన్సీల మనుగడ ఉండేది కాదు. తమ ప్రొఫెషన్‌ను క్రమబద్ధీకరించేందుకు ఓ చట్టం ఉండాలని హైదరాబాద్‌లోని ‘థర్డ్ ఐ ఇన్వెస్టిగేషన్’ సీఈవో పీ. దామోదర్ అభిప్రాయపడ్డారు. -
కాల్ డేటా స్కాంలో నటుడి లాయర్ అరెస్ట్
ముంబై : కాల్ డేటా రికార్డు స్కామ్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజ్ద్దీన్ సిద్ధిఖీ న్యాయవాది రిజ్వాన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. రిజ్వాన్ ఇంతకు ముందు ప్రముఖ సెలబ్రిటీలకు న్యాయవాదిగా వ్యవహరించడంతో ఈ కేసుకు మరింత ప్రధాన్యత సంతరించుకుంది. కాగా కాల్ డేటా రికార్డు స్కాం కేసు నగరంలో కలకలం రేపుతోంది. నలుగురు ప్రవేటు డిటెక్టివ్స్ అరెస్ట్‌తో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 11మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న రిజ్వాన్ ను థానే పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. చట్ట విరుద్దంగా ఇతరుల కాల్ డేటాను రికార్డ్ చేస్తోన్న నలుగురు ప్రవేటు డిటెక్టివ్స్‌ను జనవరి 24న అరెస్ట్ చేశాం. లాయర్ రిజ్వాన్ వారి నుంచి నవాజుద్దీన్ తన భార్య కాల్ డేటాను పొందినట్లు అరెస్ట్ అయిన ప్రశాంత్ పాలేకర్ విచారణలో అంగీకరించాడు. కాల్ డేటా కోసం 50వేల రూపాయలు వారికి చెల్లించినట్టు తెలిసింది. ఇదే అంశంపై రిజ్వాన్‌తోపాటు నవాజుద్దీన్ దంపతులకు నోటిసులు పంపాం. శుక్రవారం విచారణకు హాజరైన రిజ్వాన్ కాల్ డేటా పొందినట్టు రుజువు కావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నాం. నవాజుద్దీన్ దంపతులు దీనిపై విచారణకు హాజరు కావాల్సి ఉందని తెలిపారు. -
మిస్ డిటెక్టివ్
చేతిలో సెల్‌ఫోన్, బ్యాగ్‌లో కాస్మొటిక్స్ మాత్రమే కాదు... కత్తి, పిస్టల్‌లను కూడా బ్యాగ్‌లో క్యారీ చేస్తున్నారు త్రిష. ఎందుకంటే.. ప్రైవేటు డిటెక్టివ్ కదా. ఆ మాత్రం సెల్ఫ్ కేర్ తీసుకోవాల్సిందేగా. త్రిష చేయబోయే సీక్రెట్ ఆపరేషన్ ఏంటి? టార్గెట్ ఎవరు? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్. కొత్త దర్శకుడు వెర్నిక్యు దర్శకత్వంలో రూపొందనున్న ఉమన్సెంట్రిక్ ఫిల్మ్ ‘కుట్రపయర్చి’ (నేరము శిక్షణ అని అర్థం)లో లీడ్ రోల్ చేస్తున్నారు త్రిష. ‘‘స్టోరీ చెప్పినప్పుడు త్రిష చాలా ఎగై్జట్ అయ్యారు. ఆమె క్యారెక్టర్లో మల్టీషేడ్స్ ఉంటాయి. సరదాగా ఉండే తన పాత్ర సడన్‌గా స్ట్రాంగ్ అండ్ డేర్ డెసిషన్స్ తీసుకుంటుంది’’ అన్నారు వెర్నిక్యూ. అంతేకాదు ఈ సినిమాలో షార్ట్ హెయిర్‌తో డిఫరెంట్‌గా కనిపించనున్నారట త్రిష. దేశంలో ఫస్ట్ ఇండియన్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ రజనీ పండిట్‌ని ఆదర్శంగా తీసుకుని త్రిష క్యారెక్టర్‌ను డిజైన్ చేశారట చిత్రబృందం. గతేడాది ఒక్క సినిమాలోనూ కనిపించని త్రిష ఈ ఏడాది మినిమమ్ అరడజను సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. -
ఎగవేతదారులపై నిఘా నేత్రం!
డిటెక్టివ్‌ల సహాయాన్ని ఆశ్రయిస్తున్న బ్యాంకింగ్ * డిఫాల్టర్ల లావాదేవీలు తెలుసుకునే ప్రయత్నం న్యూఢిల్లీ: మొండిబకాయిలు (ఎన్పీఏ), అలాగే ఆర్థిక మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు బ్యాంకింగ్ వినూత్న రీతిలో ప్రైవేట్ డిటెక్టివ్‌ల సహాయాన్ని తీసుకుంటోంది. కోట్లాది రూపాయల్లో బ్యాంకులకు టోపీ పెట్టినవారు ఎక్కడ ఉంటున్నారు? ఏమి చేస్తున్నారు.? వారి ఆర్థిక లావాదేవీలు ఏమిటి?వంటి అంశాలను డిటెక్టివ్లు రహస్యంగా విచారించి సంబంధిత బ్యాంక్ అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారు. ఇందుకు సంబంధించి డిటెక్టివ్‌ల ఎంపికకు... సంబంధిత ఏజెన్సీలను సంప్రదించడం, ప్రకటనల వంటి ప్రక్రియలో బ్యాంకింగ్ నిమగ్నమయినట్లు సమాచారం. నిజానికి గతంలో చిన్న ఎగవేతదారుల విషయంపై కొన్ని బ్యాంకులు ఇలాంటి చర్యలు తీసుకునేవని, అయితే ఇప్పుడు బడా వ్యక్తుల సమాచారాన్ని సేకరించడంపై పలు బ్యాంకులు దృష్టి సారించాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ డిటెక్టివ్స్ ఆఫ్ ఇండియా (ఏపీడీఐ) కున్వర్ విక్రమ్ సింగ్ తెలిపారు. రుణ గ్రహీత, గ్యారెంటార్, డెరైక్టర్ వంటి ఎగవేత సంస్థ కీలక వ్యక్తుల వివరాలను తెలుసుకునే విషయంలో ఒక్కొక్క కేసుకూ రూ.7,500 ఒక ప్రముఖ బ్యాంక్ చెల్లిస్తున్నట్లు డిటెక్టివ్ ఏజెన్సీ ఒకటి పేర్కొంది. బ్యాంకింగ్ రికార్డుల్లో లేని ఆస్తులను గుర్తిస్తే.. రూ.20,000 చెల్లిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. -
నిఘా... నిగ నిగ
ఎన్నికల వేళ డిటెక్టివ్ ఏజెన్సీల కళకళ ప్రైవేట్ డిటెక్టివ్లకు ఎన్నడూ లేనంత గిరాకీ పెరిగింది. ఎన్నికల వేళ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలన్నీ రాజకీయ బేరాలతో కళకళలాడుతున్నారు. ఎన్నికల్లో అమీ తుమీ తేల్చుకునేందుకు బరిలోకి దిగిన అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై నిఘా పెట్టిస్తున్నారు. ప్రత్యర్థుల కదలికలు, వారి బలాబలాలు, వ్యూహ ప్రతివ్యూహాలను ముందే పసిగట్టి, అందుకు అనుగుణంగా తమ కార్యాచరణను మార్చుకునేందుకు ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థలతో బేరాలు కుదుర్చుకుంటున్నారు. ప్రత్యర్థులపై నిఘా పెట్టించేందుకు బరిలో ఉన్న అభ్యర్థులెవరూ ఖర్చుకు వెనుకాడటం లేదు. ప్రైవేట్ డిటెక్టివ్ సేవలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీలూ గుంభనంగానే ఉంటున్నా, వారితో బేరాలు కుదుర్చుకున్న డిటెక్టివ్ సంస్థలు మాత్రం తాము ‘రాజకీయ’ సేవలు అందిస్తున్న మాట నిజమేనని ‘బహిరంగ రహస్యం’గా అంగీకరిస్తున్నాయి. దేశంలో దాదాపు 15 వేల డిటెక్టివ్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటిలో కనీసం 50 ఏజెన్సీలు పూర్తిగా రాజకీయ గూఢచర్యంలోనే ఆరితేరాయి. వివిధ పార్టీలు, వాటి అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమ సేవలు పొందుతున్నట్లు ఢిల్లీకి చెందిన డిటెక్టివ్ ఏజెన్సీ ‘స్లూత్స్ ఇండియా’ మేనేజింగ్ డెరైక్టర్ నామన్ జైన్ చెప్పారు. అయితే, తమ సేవలు పొందుతున్న వారి పేర్లను వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. కేవలం ప్రత్యర్థులపై నిఘా కోసమే కాకుండా, ఓట్లను ఆకట్టుకునే వ్యూహాలపై కూడా పలువురు డిటెక్టివ్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నట్లు ప్రైవేట్ డిటెక్టివ్స్ సంఘం అధ్యక్షుడు కన్వర్ విక్రమ్ సింగ్ చెప్పారు. గత 2009 ఎన్నికల సమయంలో పత్రికల్లోని క్లాసిఫైడ్ ప్రకటనలు చూసి ప్రైవేట్ డిటెక్టివ్‌లను సంప్రదించేవారని, ఈసారి ఎన్నికలకు కొద్ది నెలల ముందే డిటెక్టివ్ ఏజెన్సీలను వెదుక్కొని మరీ ఆశ్రయించడం మొదలైందని ఆయన చెప్పారు. పోలింగ్ బూత్ స్థాయి సమాచారం, ఓటర్ల ఆకాంక్షలపై ఆరా, వ్యూహ ప్రతివ్యూహాలు తదితరమైన వాటి కోసం పలువురు అభ్యర్థులు డిటెక్టివ్ ఏజెన్సీల సేవలు పొందుతున్నారు. వాటి కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. సేవల స్థాయి బట్టి ఒక్కో అభ్యర్థి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అయితే, బయటకు వెల్లడించని ఈ ఖర్చుల లెక్కలను ఎన్నికల కమిషన్ ఎలా తేలుస్తుందో వేచి చూడాల్సిందే.