నారీ గూఢచారి | Rajani Pandit is the first woman private detective | Sakshi
Sakshi News home page

నారీ గూఢచారి

Published Fri, Nov 2 2018 12:06 AM | Last Updated on Fri, Nov 2 2018 12:06 AM

Rajani Pandit is the first woman private detective - Sakshi

తొలి మహిళా ప్రైవేట్‌ డిటెక్టివ్‌ రజనీ పండిత్‌ ఇప్పటివరకు 80 వేలకు పైగా కేసులను పరిశోధించి, పరిష్కరించారు.

‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ అనే ప్రసిద్ధ ఫేస్‌బుక్‌ పేజీలో రెండు రోజుల క్రితం అక్టోబర్‌ 31 వతేదీ నాడు ఒక మహిళ ఒక  పోస్ట్‌ పెట్టింది. పదిహేడు గంటల్లో పద్నాలుగు వేల లైక్స్, వెయ్యి షేర్లతో వైరల్‌ అయింది ఈ పోస్ట్‌. ఆ పోస్టు సారాంశం ఇదీ.
   
‘‘చాలా ఏళ్ల కిందట.. ఒక డబుల్‌ మర్డర్‌ జరిగింది. తండ్రి, కొడుకు ఇద్దరూ హత్యకు గురయ్యారు. ఛేదించడానికి చిన్న క్లూ కూడా లేదు. ఈ కేస్‌కు సంబంధించి ఎందరో అనుమానితులు. ఫిల్టర్‌ చేయగా చేయగా ఒక మహిళ మిగిలింది. ఆమే.. కాదో తేల్చుకోవాలి. ఎలా? వాళ్లింట్లో పని మనిషిగా చేరాను. ఓ ఆర్నెల్లు ఉన్నాను. ఆమెకు నమ్మిన బంటుగా మారడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాల్సి వచ్చిందో.  ఆమె జబ్బు పడితే సపర్యలూ చేశా. అట్లా నెమ్మది నెమ్మదిగా ఆమె నమ్మకాన్ని సాధించా. కానీ ఒకసారి.. అంతా నిశ్శబ్దంగా ఉంది. జరగబోయే సంభాషణ రికార్డ్‌ చేద్దామని రికార్డర్‌ ఆన్‌ చేశా.. రహస్యంగా.  క్లిక్‌మన్న సౌండ్‌ను విని ఆమె నన్ను అనుమానించడం మొదలుపెట్టింది. బయటకు వెళ్లనివ్వకుండా ఆపేది. దాదాపుగా హౌస్‌ అరెస్ట్‌ చేసేసింది.ఒకరోజు.. ఒక వ్యక్తి వచ్చాడు. అతనికి, ఆమెకు జరిగిన సంభాషణను బట్టి అతను కిరాయి హంతకుడు అని తేలింది. ఇక ఆ అవకాశం వదులుకోదల్చుకోలేదు నేను. వంటింట్లోకి వెళ్లి కత్తితో కాలు మీద గాటు పెట్టుకున్నా. అదేదో ప్రమాదవశాత్తు జరిగినట్టు నటించి.. రక్తమోడుతున్న కాలుని ఆమెకు చూపించి వెంటనే డాక్టర్‌ దగ్గరకు వెళ్లి కట్టుకట్టించుకుని వస్తానని చెప్పి.. ఆమె పర్మిషన్‌ కోసం చూడకుండా వడివడిగా బయటకు నడిచాను. గేట్‌ దాటాక  పరిసరాల్లో ఉన్న పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌కి పరిగెత్తాను. పోలీసులకు ఫోన్‌ చేసి .. వాళ్లొచ్చేవరకు అక్కడే కాపు కాసి వాళ్లు వచ్చాక వాళ్లతోపాటే మళ్లీ ఆమె ఇంటికి వెళ్లాను. అప్పటికే ఆ కిరాయి హంతకుడికి, ఆమెకు ఏదో వాగ్వివాదం జరుగుతోంది. పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. ఇదీ నా కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన, కఠినమైన కేస్‌..’’
   
పై పోస్టు పెట్టిన ఆ మహిళ పేరు రజనీ పండిత్‌. మన దేశపు ఫస్ట్‌ విమెన్‌ ప్రైవేట్‌ డిటెక్టివ్‌. రజనీ తండ్రి సీఐడీలో పనిచేసేవారు. ఆయన ఇన్‌స్పిరేషన్, ఇన్‌ఫ్లుయెన్స్‌తోనే ఆమె ఇన్వెస్టిగేషన్‌ పట్ల ఆసక్తిని పెంచుకుంది. తండ్రి వర్కింగ్‌ స్టయిల్‌ను దగ్గరగా చూసి, చూసి తనూ నైపుణ్యమూ సంపాదించుకుంది. డిగ్రీలో ఉన్నప్పుడే పార్ట్‌టైమ్‌గా డిటెక్టివ్‌ వర్క్‌ మొదలుపెట్టింది. ఆమె చేపట్టిన మొదటికేస్‌.. తన యజమాని ఇంట్లో జరుగుతున్న వరుస దొంగతనాల దొంగను పట్టుకోవడం. ఆ దొంగ ఎవరో కాదు.. యజమాని కొడుకే అని తన ఇన్వెస్టిగేషన్‌తో తేల్చేసింది రజనీ. నాటి నుంచి నేటి వరకు రజనీ 80 వేల కేసులకు పైగా పరిశోధించి, పరిష్కరించింది. రెండు పుస్తకాలనూ రాసింది. అందిన పురస్కారాలకు లెక్కేలేదు. 22వ యేట ఆరంభమైన ఆమె పరిశోధన ఇప్పటి దాకా అప్రతిహతంగా సాగుతూనే ఉంది.. పెళ్లి, పిల్లలతో సొంత కుటుంబాన్ని ఏర్పర్చుకోవాలనే ధ్యాస, తలపు లేకుండా. అందుకే అంటుంది.. ‘‘ఇన్వెస్టిగేషనే నా జీవన సహచరుడు’’ అని. అంత నిబద్ధత రజనీకి తన పనిపట్ల. కాబట్టే ఆమెను  ‘‘దేశీ షెర్లాక్‌’’ అంటారంతా!   
– శరాది 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement