రజనీ పండిట్
నాపై అనుమానం రావడంతో నన్ను బయటికి వెళ్లకుండా ఆమె అడ్డుకుంది. కానీ ఓ రోజు హంతకుడు సరాసరి ఆమె ఇంటికే వచ్చాడు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక కత్తితో కోసుకున్నా. ఆ తర్వాత ఇద్దరిని అరెస్టు చేయించా- ప్రైవేట్ డిటెక్టివ్ రజనీ పండిట్
భారత్‌లో మొట్టమొదటి ప్రైవేట్ మహిళా డిటెక్టివ్‌గా గుర్తింపు పొందారు మహారాష్ట్రకు చెందిన రజనీ పండిట్. సీఐడీ ఆఫీసర్ కూతురైన రజనీకి.. ఏ విషయం గురించైనా పూర్తిగా తెలుసుకోవాలనే ఆసక్తి చిన్ననాటి నుంచే మెండుగా ఉండేదట. ఆ ఆసక్తే తనను డిటెక్టివ్‌గా మార్చిందని, సుమారు 80 వేల కేసులు పరిష్కరించేలా చేసిందని రజనీ పేర్కొన్నారు.
అలా మొదలైంది..
‘కాలేజీలో చదువుకునే రోజుల్లో పార్ట్ టైమ్ చేసేదాన్ని. అక్కడే పనిచేసే ఓ మహిళ తన ఇంట్లో తరచుగా దొంగతనం జరుగుతోందని చెప్పింది. కొత్త కోడలిపైనే తనకు అనుమానమట. అయితే ఆధారాలు లేకుండా ఒకరిని నిందించడం తప్పు కదా.. అందుకే మీ ఇంట్లో దొంగతనాలకు కారణం ఎవరో కనిపెడతానని తనకు చెప్పాను. రోజు వాళ్ల వీధిలో కాపలా కాశాను. ఆమె కొడుకుపై అనుమానం వచ్చింది. అన్ని విషయాలు నిర్ధారించుకున్న తర్వాత నేనెవరో చెప్పకుండా.. మీ ఇంట్లో నుంచి డబ్బులు పోవడానికి కారణం నువ్వే కదా అని అతడిని నిలదీశాను. కాసేపటి తర్వాత నేరం ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని అతడి తల్లికి చెప్పి.. వాళ్ల కోడలిని నిర్దోషిగా నిరూపించాను. అలా 22 ఏళ్ల వయస్సులో.. ఓ దొంగతనం కేసుతో నా కెరీర్ మొదలైందంటూ రజనీ పంచుకున్న అనుభవాలను.. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయగా లైక్‌లు, షేర్లతో వైరల్‌గా మారింది.
పనిమనిషిలా ఆరునెలలు..
‘అది జంట హత్యలకు సంబంధించిన కేసు. తండ్రీ కొడుకులిద్దరు హత్యకు గురయ్యారు. కానీ హంతకులను పట్టుకుందామంటే ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే ఓ మహిళపై మాత్రం అనుమానం ఉంది. అందుకే సదరు మహిళ ఇంట్లో పనిమనిషిగా చేరాను. అదే సమయంలో ఆమె అనారోగ్యానికి గురైంది. ఇదేదో నాకు కలిసి వచ్చే అంశమే అనుకున్నా. ఆమె కోలుకునేందుకు సాయం చేస్తూ నెమ్మదిగా ఆమె నమ్మకాన్ని సంపాదించా. అయితే ఓరోజు ఉన్నట్టుండి అంతా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో నా రికార్డర్ ఆన్ అయిన క్లిక్ సౌండ్ వినిపించింది. దీంతో ఆమెకు అనుమానం కలిగింది. అప్పటి నుంచి నన్ను బయటికి వెళ్లకుండా అడ్డుకుంది. అలా ఆరునెలలు గడిచాయి. ఒకరోజు ఆ ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు.
వారి సంభాషణ విన్న తర్వాత అతడే హంతకుడు అని, అతడికి సహకరించిన మరో వ్యక్తి సదరు మహిళేనని నాకు అర్థమయింది. కానీ తప్పించుకోవడం ఎలాగో తెలీలేదు. అందుకే నా పాదంపై కత్తితో కోసుకున్నా. రక్తం కారుతోంది.. నన్ను రక్షించండి అంటూ ఏడ్చాను. బ్యాండేజ్ తెచ్చుకుంటానని చెప్పి బయటికి పరిగెత్తాను. వెంటనే ఎస్టీడీ బూత్‌కు వెళ్లి నా క్లైంట్‌కి ఫోన్ చేసి పోలీసులను తీసుకురావాలని చెప్పాను. ఆ ఇద్దరు దోషులని అరెస్టు చేయించాను’ అంటూ తన కెరీర్‌లో డీల్ చేసిన అత్యంత సంక్లిష్టమైన కేసు ఇదేనని రజనీ పేర్కొన్నారు.
నేను దేశీ షెర్లాక్‌ని...
తన కెరీర్‌లో సుమారు 80 వేల కేసులు పరిష్కరించానన్న రజనీ తనని తాను దేశీ షెర్లాక్(డిటెక్టివ్)గా చెప్పుకోవడానికి ఇష్టపడతానన్నారు. కష్టానికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు పొందిన తనకు.. ఎన్నోసార్లు బెదిరింపులు కూడా వచ్చేవని గుర్తుచేసుకున్నారు. అయితే చేసే పని పట్ల నమ్మకం, నిజాయితీ ఉండి.. కొంచెం ధైర్యం ఉంటే చాలు ఎవరైనా డిటెక్టివ్‌గా దూసుకుపోవచ్చని సలహా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment