నిఘా... నిగ నిగ
ఎన్నికల వేళ డిటెక్టివ్ ఏజెన్సీల కళకళ
ప్రైవేట్ డిటెక్టివ్‌లకు ఎన్నడూ లేనంత గిరాకీ పెరిగింది. ఎన్నికల వేళ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలన్నీ రాజకీయ బేరాలతో కళకళలాడుతున్నారు. ఎన్నికల్లో అమీ తుమీ తేల్చుకునేందుకు బరిలోకి దిగిన అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై నిఘా పెట్టిస్తున్నారు. ప్రత్యర్థుల కదలికలు, వారి బలాబలాలు, వ్యూహ ప్రతివ్యూహాలను ముందే పసిగట్టి, అందుకు అనుగుణంగా తమ కార్యాచరణను మార్చుకునేందుకు ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థలతో బేరాలు కుదుర్చుకుంటున్నారు. ప్రత్యర్థులపై నిఘా పెట్టించేందుకు బరిలో ఉన్న అభ్యర్థులెవరూ ఖర్చుకు వెనుకాడటం లేదు. ప్రైవేట్ డిటెక్టివ్ సేవలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీలూ గుంభనంగానే ఉంటున్నా, వారితో బేరాలు కుదుర్చుకున్న డిటెక్టివ్ సంస్థలు మాత్రం తాము ‘రాజకీయ’ సేవలు అందిస్తున్న మాట నిజమేనని ‘బహిరంగ రహస్యం’గా అంగీకరిస్తున్నాయి. దేశంలో దాదాపు 15 వేల డిటెక్టివ్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటిలో కనీసం 50 ఏజెన్సీలు పూర్తిగా రాజకీయ గూఢచర్యంలోనే ఆరితేరాయి. వివిధ పార్టీలు, వాటి అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమ సేవలు పొందుతున్నట్లు ఢిల్లీకి చెందిన డిటెక్టివ్ ఏజెన్సీ ‘స్లూత్స్ ఇండియా’ మేనేజింగ్ డెరైక్టర్ నామన్ జైన్ చెప్పారు.
అయితే, తమ సేవలు పొందుతున్న వారి పేర్లను వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. కేవలం ప్రత్యర్థులపై నిఘా కోసమే కాకుండా, ఓట్లను ఆకట్టుకునే వ్యూహాలపై కూడా పలువురు డిటెక్టివ్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నట్లు ప్రైవేట్ డిటెక్టివ్స్ సంఘం అధ్యక్షుడు కన్వర్ విక్రమ్ సింగ్ చెప్పారు. గత 2009 ఎన్నికల సమయంలో పత్రికల్లోని క్లాసిఫైడ్ ప్రకటనలు చూసి ప్రైవేట్ డిటెక్టివ్‌లను సంప్రదించేవారని, ఈసారి ఎన్నికలకు కొద్ది నెలల ముందే డిటెక్టివ్ ఏజెన్సీలను వెదుక్కొని మరీ ఆశ్రయించడం మొదలైందని ఆయన చెప్పారు. పోలింగ్ బూత్ స్థాయి సమాచారం, ఓటర్ల ఆకాంక్షలపై ఆరా, వ్యూహ ప్రతివ్యూహాలు తదితరమైన వాటి కోసం పలువురు అభ్యర్థులు డిటెక్టివ్ ఏజెన్సీల సేవలు పొందుతున్నారు. వాటి కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. సేవల స్థాయి బట్టి ఒక్కో అభ్యర్థి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అయితే, బయటకు వెల్లడించని ఈ ఖర్చుల లెక్కలను ఎన్నికల కమిషన్ ఎలా తేలుస్తుందో వేచి చూడాల్సిందే.