
న్యూఢిల్లీ: భారీ రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వాటాల వ్యూహాత్మక విక్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే, వాటాలు విక్రయించినప్పటికీ ఎయిరిండియా భారతీయుల చేతుల్లోనే ఉండాలని కేంద్రం భావిస్తోందని ఆయన చెప్పారు. గతంలో ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఈ నేపథ్యంలో ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.
ఎయిరిండియా పనితీరు చాలా బాగా ఉందని, కాకపోతే అధిక రుణభారం, వడ్డీలే పెద్ద సమస్యగా మారాయని గురువారం లోక్‌సభలో ఆయన చెప్పారు. ‘ఎయిరిండియా ఒక అత్యుత్తమ అసెట్‌లాంటిది. దానికి 125 విమానాలు ఉన్నాయి. దాదాపు సగం విమానాలు 40 అంతర్జాతీయ రూట్లలో, 80 విమానాలు దేశీయంగా వివిధ రూట్లలో నడుస్తున్నాయి. కంపెనీ పనితీరు చాలా బాగుంది. కానీ మోయలేనంత రుణభారమే పెద్ద సమస్య. ఆ రుణాలపై భారీగా వడ్డీలు కట్టాల్సి వస్తుండటం మరో సమస్య‘ అని పురి వివరించారు. దేశీ విమానయాన మార్కెట్ క్షీణిస్తోందన్న వార్తలన్నీ అపోహలేనని ఆయన కొట్టి పారేశారు. వాస్తవానికి ఇది 17 శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment