
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగానికి మొండిబకాయిల(ఎన్‌పీఏ) బెడద ఇప్పట్లో తీరేలా కనబడటంలేదు. ఇప్పటికే కొండలాపేరుకుపోయిన ఈ మొండిబాకీలకు మరో రూ.40 వేల కోట్ల మేర అదనంగా ఎన్‌పీఏలు జతయ్యే ప్రమాదం ఉందని బ్యాంకింగ్ రంగం ఆందోళనచెందుతోంది. ఆర్‌బీఐ ఆదేశాలతో యాక్సిస్ బ్యాంక్ కన్సార్షియంకు చెందిన ఎనిమిది రుణ ఖాతాలను ఎన్‌పీఏలుగా పునర్‌వర్గీకరించడమే దీనికి ప్రధాన కారణం.
2016–17కు సంబంధించి వార్షిక రిస్క్ ఆధారిత పర్యవేక్షణ ప్రక్రియ(ఆర్‌బీఎస్)లో భాగంగా ఈ ఏడాది మార్చి నాటికి యాక్సిస్ రుణాల వర్గీకరణ, కేటయింపులపై ఆర్‌బీఐ ఈ ఆదేశాలను జారీచేసింది. దీని ఫలితంగా మొత్తం 9 స్టాండర్డ్ (క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించేవి)రుణ ఖాతాలను ఎన్‌పీఏలుగా చూపాల్సివచ్చిందని.. ఇందులో 8 ఖాతాలు కన్సార్షియం (ఇతర బ్యాంకులతో కలిపి ఇచ్చిన రుణాలు)కు చెందినవని ఇటీవలి క్యూ2(2017–18, సెప్టెంబర్ క్వార్టర్) ఫలితాల సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది.
ఈ ఏడాది జూన్ వరకూ ఈ 9 ఖాతాలనూ యాక్సిస్ బ్యాంక్ స్టాండర్డ్ రుణాలుగానే ఖాతా పుస్తకాల్లో వర్గీకరించింది. జూన్ చివరినాటికి ఈ ఖాతాల రుణ బకాయిల విలువ దాదాపు రూ.42,000 కోట్లుగా అంచనా. వీటిలో కేవలం 6 శాతం రుణ బకాయిని మాత్రమే ఎన్‌పీఏలుగా యాక్సిస్ లెక్కగట్టడం గమనార్హం. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ ఖాతాలన్నింటినీ యాక్సిస్ బ్యాంక్ ఎన్‌పీఏలుగా ప్రకటించడంతో కన్సార్షియంలోని ఇతర బ్యాంకుల్లో భయం మొదలైంది. తమ రుణ బకాయిల పరిస్థితి ఏంటన్నది ఆయా బ్యాంకుల ఆందోళన.
అవి కూడా ఆ ఖాతాల్ని ఎన్‌పీఏలుగా చూపించాల్సివుంటుంది.ఇప్పటికే బ్యాంకింగ్ రంగం రూ.8 లక్షల కోట్లకు పైగా మొండిబకాయిలతో తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ వెలువడిన క్యూ2 ఫలితాలను చూస్తే.. పరిస్థితి కుదుటపడకపోగా, ఎన్‌పీఏలు అంతకంతకూ పెరుగుతున్న దాఖలాలు స్పష్టమవుతున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు.
లాభాలకు చిల్లు..
‘యాక్సిస్ చర్యలతో కన్సార్షియంలోని ఇతర బ్యాంకులపై ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఈ ఖాతాలకు సంబంధించి తమ రుణాలను కూడా ఆయా బ్యాంకులు రేపోమాపో ఎన్‌పీఏలుగా చూపాల్సివస్తుంది. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఈ పునర్‌వర్గీకరణ ఉండొచ్చు. దీంతో మరిన్ని కేటాయింపులు(ప్రొవిజనింగ్) చేయాల్సి వస్తుంది. మొత్తానికి వాటి లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని మెక్వారీ క్యాపిటల్ సెక్యూరిటీస్‌కు చెందిన సురేష్ గణపతి వ్యాఖ్యానించారు.
మరోపక్క, ఇప్పటికే కన్సార్షియంలోని ఒక బ్యాంకు ఈ ఖాతాలను ఎన్‌పీఏలుగా గుర్తించిన నేపథ్యంలో.. మిగతా బ్యాంకులు ఈ ఖాతాలకు(రుణ గ్రహీతలు) కొత్తగా రుణాలిచ్చే పరిస్థితి లేదని ఒక సీనియర్ బ్యాంకర్ అభిప్రాయపడ్డారు. యాక్సిస్ బ్యాంక్ ఈ ఏడాది మార్చి క్వార్టర్ స్థూల ఎన్‌పీఏల్లో రూ.5,637 కోట్లు తక్కువగా చూపినట్లు ఆర్‌బీఐ తనిఖీల్లో బయటపడింది. దీంతో మార్చి చివరినాటికి బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు రూ.21,280 కోట్ల నుంచి రూ.26,913 కోట్లకు పెరిగినట్టు లెక్క. సెప్టెంబర్ క్వార్టర్‌లో స్థూల, నికర ఎన్‌పీఏలు భారీగా పెరగడం తెలిసిందే.