
యాక్సిస్‌కు ఎన్‌పీఏల సెగ!
► క్యూ4 లాభం 43% డౌన్; 1,225 కోట్లు
► నికర మొండి బకాయిలు 2.11 శాతం
► పూర్తి ఏడాదికి లాభం రూ.3,953 కోట్లు
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకుకు మొండిబకాయిల (ఎన్‌పీఏ) సెగ గట్టిగా తగిలింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో లాభం 43 శాతం తరిగిపోయింది. ఈ కాలంలో బ్యాంకు రూ.1,225 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.2,154 కోట్లు కావడం గమనార్హం. వసూలు కాని మొండిబకాయిలకు నిధుల కేటాయింపులు చేయడమే లాభాలు తరిగిపోవడానికి కారణమని బ్యాంకు తెలియజేసింది. మార్చి త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగి రూ.14,181 కోట్లుగా నమోదైంది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ.13,593 కోట్లు.
స్థూల ఎన్‌పీఏలు అంతకుముందు ఇదే కాలంలో ఉన్న 1.67 శాతం నుంచి 5.04 శాతానికి పెరిగిపోయాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.70 శాతం నుంచి 2.11 శాతానికి చేరాయి. దీంతో ఎన్‌పీఏల కోసం ఈ త్రైమాసికంలో బ్యాంకు రూ.2,581 కోట్లను కేటాయించి పక్కన పెట్టాల్సి వచ్చింది. 2015–16 మార్చి త్రైమాసికంలో ఎన్‌పీఏలకు చేసిన కేటాయింపులు రూ.1,168 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపుకన్నా అధికం. అయితే, 2016 డిసెంబర్ త్రైమాసికంలో కేటాయింపులు రూ.3,795 కోట్ల కంటే కొంచెం తగ్గాయి
. స్థూల ఎన్‌పీఏలకు మార్చి త్రైమాసికంలో నికరంగా రూ.4,811 కోట్లు జతయ్యాయి. ఇదే సమయంలో వసూలైన బకాయిలు రూ.2,804 కోట్లుగానే ఉన్నాయి. దీంతో రూ.1,194 కోట్ల రుణాలను రద్దు చేసినట్టు బ్యాంకు తెలిపింది. ఇక 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు ఆర్జించిన లాభం రూ.3,953 కోట్లుగా ఉంది. 2015–16లో వచ్చిన లాభం రూ.8,223 కోట్లతో పోలిస్తే 52.65 శాతం తరిగిపోయింది. ఆదాయం మాత్రం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే రూ.50,359 కోట్ల నుంచి రూ.56,233 కోట్లకు వృద్ధి చెందింది.
కంపెనీకి ఇన్నాళ్లూ దన్నుగా నిలిచిన కార్పొరేట్ రుణాల విభాగం ఫ్లాట్‌గా కొనసాగగా, రిటైల్ రుణ విభాగం మాత్రం 21 శాతం వృద్ధితో బ్యాంకుకు కీలకంగా నిలిచింది. ఈ దృష్ట్యా భవిష్యత్తులో రిటైల్ రుణాలపై మరింత దృష్టి సారించనున్నట్టు బ్యాంకు తెలిపింది. ఇంకా తమ ముందు సవాళ్లున్నట్టు బ్యాంకు సీఎఫ్‌వో జైరామ్ శ్రీధరన్ పేర్కొన్నారు. రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుపై రూ.5 (250శాతం) డివిడెండ్ ఇవ్వాలని బోర్డు సిఫారసు చేసింది. బీఎస్‌ఈలో యాక్సిస్ బ్యాంకు షేరు ధర బుధవారం అర శాతం పెరిగి రూ.517 వద్ద క్లోజయింది.