ఐసీఐసీఐ లాభం 3,102 కోట్లు
క్యూ2లో స్వల్పంగా 3.2% వృద్ధి..
భారీగా పెరిగిన మొండిబకాయిలు...
స్థూల ఎన్‌పీఏలు 6.82 శాతానికి...
భారీగా ఎగబాకిన ఎన్‌పీఏ కేటాయింపులు
ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ను మొండిబకాయిలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో బ్యాంక్ స్టాండెలోన్(ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే)నికర లాభం స్వల్పంగా 2.3 శాతం మాత్రమే పెరిగి రూ. 3,102 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,030 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మొండిబకాయిలకు(ఎన్‌పీఏ) కేటాయింపులు(ప్రొవిజనింగ్) భారీగా పెరగడం లాభాలపై ప్రభావం చూపింది.
ఇక బ్యాంక్ స్టాండెలోన్ ఆదాయం క్యూ2లో రూ.22,759 కోట్లకు ఎగబాకింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ. 16,106 కోట్లతో పోలిస్తే 41 శాతం పెరిగింది.కన్సాలిడేటెడ్‌గా చూస్తే..: బీమా, మ్యూచువల్‌ఫండ్ తదితర అనుంబంధ సంస్థలన్నింటితో(కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) కలిపి చూస్తే సెప్టెంబర్ క్వార్టర్‌లో నికర లాభం 13 శాతం దిగజారి రూ.2,979 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ.3,419 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.25,138 కోట్ల నుంచి రూ.32,435 కోట్లకు చేరింది. 29 శాతం వృద్ధి నమోదైంది.
మొండిబకాయిలు పైపైకి...: సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల ఎన్‌పీఏలు రెట్టింపు స్థారుులో 6.82 శాతానికి ఎగబాకాయి. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఇవి 3.77 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా చూస్తే రూ.15,858 కోట్ల నుంచి రూ.32,178 కోట్లకు చేరాయి. అయితే, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్థూల ఎన్‌పీఏలు 5.87 శాతం(రూ.27,194 కోట్లు)తో పోలిస్తే దాదాపు 1 శాతం పెరిగాయి. నికర ఎన్‌పీఏలు 1.65 శాతం(రూ.6,759 కోట్లు) నుంచి 3.57 శాతానికి(రూ.16,215 కోట్లు) ఎగబాకాయి. తొలి త్రైమాసికంలో నికర ఎన్‌పీఏలు 3.35 శాతం(రూ.15,041 కోట్లు)గా ఉన్నాయి.
ఇక క్యూ2లో బ్యాంక్ మొత్తం ప్రొవిజన్‌స అండ్ కంటింజెన్సీస్(ఇతర అవసరాల కోసం) రూ.7,083 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఈ మొత్తం రూ.942 కోట్లు మాత్రమే. ‘క్యూ2లో అదనంగా రూ.3,588 కోట్ల కేటాయింపులు జరపడం ద్వారా బ్యాలెన్స్ షీట్‌ను మరింత పటిష్టం చేశాం. ఇందులో కొన్ని స్టాండర్డ్ రుణాలకు సంబంధించి రూ.1,678 కోట్లు కూడా ఉన్నాయి. ఇక ఫ్లోటింగ్ ప్రాతిపదికన రూ.1,515 కోట్ల కేటాయింపులు జరిపాం’ అని బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. క్యూ2లో తాజాగా రూ.8000 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారాయి.
సోమవారం బ్యాంక్ షేరు ధర బీఎస్‌ఈలో 3.36 శాతం లాభంతో రూ.279 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. కాగా, న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఐసీఐసీఐ ఏడీఆర్ సోమవారం ఒకానొక దశలో 6 శాతంపైగా ఎగబాకి 8.62 డాలర్లను తాకడం గమనార్హం.
ఇతర ముఖ్యాంశాలివీ...
క్యూ2లో నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) రూ.5,253 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఎన్‌ఐఐ రూ.5,251 కోట్లుగా ఉంది.
వడ్డీయేతర ఆదాయం మాత్రం మూడింతలై రూ.3,007 కోట్ల నుంచి రూ.9,120 కోట్లకు దూసుకెళ్లింది.
పధానంగా అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఐపీఓ ద్వారా బ్యాంక్ తన వాటాలో 12.63 శాతాన్ని విక్రరుుంచింది. దీని ద్వారా లభించిన మొత్తంతో కలిపితే క్యూ2లో ఇతర ఆదాయం రూ. 5,682 కోట్లుగా నమోదైంది.
జూలై-సెప్టెంబర్ కాలంలో బ్యాంక్ రిటైల్ రుణాల్లో 16 శాతం వృద్ధి నమోదైంది.
మొత్తం డిపాజిట్లు 17 శాతం వృద్ధితో సెప్టెంబర్ చివరినాటికి రూ.4,49,071 కోట్లకు పెరిగారుు. మొత్తం రుణాలు రూ.4,54,256 కోట్లకు చేరాయి. రుణ వృద్ధి 11 శాతంగా నమోదైంది.
బ్యాంకు మొత్తం ఏటీఎంలు 14,295, బ్రాంచ్‌లు 4,468కి చేరాయి.
అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్‌స నికర లాభం క్యూ2లో రూ.415 కోట్ల నుంచి రూ. 419 కోట్లకు పెరిగింది.
లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్‌స లాభం రూ.143 కోట్ల నుంచి రూ.171 కోట్లకు ఎగసింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ నికర లాభం రూ.83 కోట్ల నుంచి రూ.130 కోట్లకు పెరిగింది.
కొత్తగా మొండిబకాయిలుగా మారిన రుణాల్లో 80 శాతం పరిశీలనలో ఉంచిన(వాచ్‌లిస్ట్) రూ.44,000 కోట్ల రుణ ఖాతాల నుంచే ఉన్నాయి. మా కార్పొరేట్ ఖాతాదారులు కొన్ని కంపెనీలతో కుదుర్చుకున్న తాజా ఒప్పందాలు పూర్తయితే... మొండిబకాయిలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా జేపీ అసోసియేట్స్ సిమెంట్ విభాగాన్ని అల్ట్రాటెక్‌కు విక్రయించేందుకు రూ.16,500 కోట్లతో కుదుర్చుకున్న ఒప్పందం, ఎస్సార్ ఆయిల్‌ను రూయాలు రాస్‌నెఫ్ట్ కన్సార్షియంకు విక్రయిస్తూ తాజాగా కుదుర్చుకున్న డీల్‌లు ఉన్నాయి. ఈ రెండు కంపెనీల నుంచి ఇప్పటికే కొంత బకాయి మొత్తాన్ని అందుకున్నాం. ప్రస్తుతం వాచ్‌లిస్ట్ పరిమాణం రూ.32,490 కోట్లకు తగ్గింది. 6-9 నెలల కాలంలో ఇది మరింత తగ్గుతుందని భావిస్తున్నాం.
- చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్