
ఎస్‌బీఐ మొండిబకాయిలు పైపైకి
దేశీ బ్యాంకింగ్ అగ్రగామి ఎస్‌బీఐని మొండిబకాయిలు (ఎన్‌పీఏ) వెంటాడుతూనే ఉన్నాయి. అనుబంధ బ్యాంకుల విలీనంతో ఈ భారం మరింత ఎగబాకనుంది.
⇒ ఏడాదిలో 50 శాతం అప్...
⇒ అనుంబంధాల విలీనంతో మరింత భారం
⇒ భారీగా పెరగనున్న ఎన్‌పీఏ కేటాయింపులు
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి ఎస్‌బీఐని మొండిబకాయిలు (ఎన్‌పీఏ) వెంటాడుతూనే ఉన్నాయి. అనుబంధ బ్యాంకుల విలీనంతో ఈ భారం మరింత ఎగబాకనుంది. గతేడాది(2016) డిసెంబర్ నాటికి బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు ఏకంగా 48.6 శాతం పెరిగిపోయాయి. రూ.1.08 లక్షల కోట్లకు చేరాయి. అంతక్రితం ఏడాది డిసెంబర్‌నాటికి ఈ మొత్తం రూ.72,792 కోట్లుగా నమోదైంది. ఇక నికర ఎన్‌పీఏలైతే 52.6 శాతం ఎగబాకడం గమనార్హం. అనుబంధ బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఇప్పుడు ఎన్‌పీఏలకు కేటాయింపులు(ప్రొవిజనింగ్) మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.
డిసెంబర్ నాటికి ఐదు అనుబంధ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు ఏకంగా 173 శాతం దూసుకెళ్లి.. రూ.55,164 కోట్లకు చేరడం గమనార్హం. 2015 డిసెంబర్ చివరికి ఈ మొత్తం రూ.20,218 కోట్లు మాత్రమే. ఇక నికర ఎన్‌పీఏలైతే 219 శాతం ఎగిశాయి. ‘అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎన్‌పీఏలకు ప్రొవిజనింగ్ కవరేజీలో మార్పులు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం బ్యాంక్ ప్రొవిజనింగ్ కవరేజీ నిష్పత్తి 59 శాతంగా ఉంది. అయితే, పరిశ్రమలో 100 శాతం కవరేజీ విధానం ఎక్కడా లేదు. ఎన్‌పీఏల కాలవ్యవధి ఆధారంగా నిబంధనల మేరకు కేటాయింపులు చేస్తాం’ అని ఎస్‌బీఐ ఎండీ దినేశ్ కుమార్ ఖరా పేర్కొన్నారు.