ఇతరులతో పోలిస్తే మెరుగే కానీ..
భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాల్లో స్వల్ప కోత
♦ 0.2% తగ్గించిన ప్రపంచ బ్యాంక్
♦ ఈ ఏడాది 7.6 శాతంగా అంచనా...
♦ ఎన్‌పీఏలతో కార్పొరేట్ రుణాలకు గండి
♦ రెండేళ్లుగా సరైన వర్షాలు లేకపోవటం కూడా ప్రతికూలమే
♦ తాజా నివేదికలో వెల్లడి
వాషింగ్టన్: దేశ వృద్ధి రేటు అంచనాలకు ప్రపంచ బ్యాంక్ స్వల్పంగా కోత విధించింది. ఈ ఏడాది(2016)లో భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.6 శాతంగా ఉండొచ్చని తాజాగా అంచనా వేసింది. ‘ప్రపంచ ఆర్థిక అంచనాలు’ పేరిట మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయం చెప్పింది. వచ్చే రెండేళ్ల(2017, 18)కు వృద్ధి రేటు అంచనాలను సైతం 0.2 శాతం తగ్గించి 7.7 శాతానికి చేర్చింది. అయితే, ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లో వృద్ధి పరుగులు తీస్తోందని... మొత్తంమీద 2016-17 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాల కాలంలో భారత్ వృద్ధి రేటు 7.6-7.7 శాతంగా ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.
దేశీయ డిమాండ్ దన్ను...
గతేడాది(2015-16)లో వృద్ధి 7.6 %కి(0.4% పెరుగుదల) పుంజుకోవడానికి ప్రధానంగా దేశీయ డిమాండ్ పెరగటమే కారణమని ఈ నివేదిక అభిప్రాయపడింది. ‘‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనల సరళీకరణకు మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కూడా వృద్ధికి ఆసరాగా నిలుస్తున్నాయి. 2014 అక్టోబర్లో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచీ ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ చూస్తే ఎఫ్‌డీఐలు 37% వృద్ధి చెందాయి’’ అని నివేదిక పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలివీ..
♦ ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌లో మందగమనం ఉన్నప్పటికీ.. గత ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో తయారీ రంగం 9.3 శాతం పుంజుకుంది.
♦ ఇతర పెద్ద వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లో వ్యాపార సెంటిమెంట్ బలంగా ఉంది.
♦ స్టార్టప్ సంస్థల జోరు పెరిగింది. ముఖ్యంగా ఫైనాన్షియల్ సేవలు, ఈ-కామర్స్‌లో కొత్తకొత్త స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నాయి.
♦ ఆర్థిక పరమైన కార్యకలాపాల్లో వేగం పెరగడం ఉద్యోగాల సృష్టికి వీలుకల్పిస్తోంది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో కొనసాగడం, వేతనాల్లో పెరుగుదలతో ప్రజల వాస్తవ ఆదాయాలు జోరందుకొని అర్బన్ వినిమయం ఎగబాకుతోంది.
♦ విద్యుదుత్పత్తి, రోడ్లు, రైల్వేలు, అర్బన్ ఇన్‌ఫ్రాలో ప్రభుత్వ వ్యయం పెరగడంతో వ్యాపార సెంటిమెంట్ మెరుగుపడటంతో పాటు సరఫరాపరమైన అడ్డుంకులు కూడా తొలగుతున్నాయి.
♦ వరుసగా రెండేళ్లు సరైన వర్షపాతం లేకపోవడంతో గ్రామీణ వినియమం తీవ్రంగా పడిపోవడం మాత్రం ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలాంశమే.
♦ 2015 నుంచి 5 సార్లు వడ్డీరేట్లలో కోత విధించినప్పటికీ కార్పొరేట్ రంగ రుణ వృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు భారీగా పెరిగిపోవడం దీనికి కారణం.
ప్రపంచ వృద్ధి అంచనాల్లో భారీ కోత...
అభివృద్ధి చెందిన దేశాల్లో మందగమనం, కమోడిటీ రేట్ల పతనం, అంతర్జాతీయ వాణిజ్యంలో బలహీనతల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి అంచనాల్లో భారీగా కోత పడింది. ఈ ఏడాది 2.4 శాతానికి పరిమితం కావచ్చని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. జనవరిలో అంచనా వేసిన 2.9 శాతంతో పోలిస్తే అర శాతం తగ్గించడం గమనార్హం. ఇక చైనా వృద్ధి గతేడాది స్థాయిలోనే 6.7 శాతంగా ఉండొచ్చని తెలిపింది. వృద్ధి మందగమనాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ దేశాలన్నీ తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, తీవ్ర పేదరికంలో ఉన్న ప్రజలకు బాసటగా నిలవాలని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.