భారత జీడీపీ ఇకముందు బలంగానే
• ఈ ఏడాది 7.6%.. వచ్చే ఏడాది 7.7%
• ప్రపంచ బ్యాంకు అంచనా
వాషింగ్టన్: భారత జీడీపీ ఇక ముందూ జోరుగానే ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 2016లో 7.6 శాతం, 2017లో 7.7 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. వ్యవసాయ రంగం పుంజుకోవడం, ఉద్యోగుల వేతన సవరణలు వినియోగానికి ఊతమిస్తాయని... ఎగుమతుల నుంచి సానుకూల తోడ్పాటుతో పాటు ప్రైవేటు పెట్టుబడులు మధ్య కాలానికి కోలుకోవడం వంటివి వృద్ధికి మద్దతునిస్తాయని తెలియజేసింది.
ఈ మేరకు దక్షిణాసియా ఆర్థిక రంగంపై ప్రపంచ బ్యాంకు తాజాగా ద్వైవార్షిక నివేదికను విడుదల చేసింది. భారత్‌లో పేదరికాన్ని వేగంగా తగ్గించటం, అన్ని వర్గాలనూ వృద్ధిలో భాగస్వాముల్ని చేయడం వంటి అనేక సవాళ్లున్నాయని బ్యాంకు తన నివేదికలో ప్రస్తావించింది. దక్షిణాసియా ప్రాంతం ప్రపంచ అభివృద్ధి కేంద్రంగానే కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. చైనా మందగమనం, ఉద్దీపనలపై అనిశ్చితి తదితర వెలుపలి ఒత్తిళ్లలను సైతం తట్టుకుని నిలబడిందని పేర్కొంది.
స్వల్ప కాలంలో సమస్యలు
స్వల్ప కాలంలో వృద్ధి రేటును మందగింపజేసే సమస్యలను కూడా నివేదిక ప్రస్తావించింది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొనడం, కమోడిటీ ధరల ఒడిదుడుకులు, ప్రపంచ వాణిజ్యంపై బ్రెగ్జిట్ ప్రభావం, చైనా ఆర్థిక రంగం మరింత నిదానించడం వంటివి ఆర్థిక రంగం కోలుకోవడాన్ని మరింత ఆలస్యం చేస్తాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
రెండేళ్లు ఇదే స్థాయిలో: ఐఎంఎఫ్
భారత్ జీడీపీ విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మరింత సానుకూలతను వ్యక్తం చేసింది. గత అంచనాలను పెంచింది. భారత జీడీపీ వృద్ధి వేగంగా పెరుగుతోందని, 2016, 2017 సంవత్సరాల్లో 7.6 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఐఎంఎఫ్ ఈ ఏడాది జూలైలో ప్రకటించిన వృద్ధి రేటు అంచనాల కంటే తాజా అంచనాలు 0.2 బేసిస్ పాయింట్లు ఎక్కువ కావడం గమనార్హం.