Indias GDP
-
భారత్ వృద్ధి రేటు అంచనాకు మూడీస్ రెండవ కోత
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణమని పేర్కొంది. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ స్థూల ఆర్థిక అంశాల అవుట్‌లుక్ 2023–24 నివేదికలో మూడీస్ పేర్కొంది. 2024లోనే వెలుగు రేఖలు... 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందని అవుట్‌లుక్ పేర్కొంది. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. బలహీన రూపాయి, అధిక చమురు ధరలు ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తాయని మూడీస్ అంచనావేసింది. 2023, 2024లో అంతర్జాతీయ వృద్ధి స్పీడ్ మందగిస్తుందని పేర్కొంటూ, 2023లో జీ–20 దేశాల జీడీపీ 1.3 శాతం క్షీణిస్తుందని తెలిపింది. క్రితం 2.1 శాతం క్షీణ అంచనాలు తగ్గడం కొంత ఊరట. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సహా పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థి క, వాణిజ్య దిగ్గజ సంస్థలు 2022–23 భారత్ తొలి వృద్ధి అంచనాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. 6.5 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి న మోదవుతుందన్నది ఆయా అంచనాల సారాంశం. -
యాప్స్ ద్వారా రూ.1.4 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, దానిలో కనీసం ఓ ఐదు నుంచి పది యాప్స్ అయినా ఉంటాయి. ప్రస్తుతం దేశంలో యాప్స్ వాడకం అంతలా పెరిగిపోయింది. ఏ పనిచేయాలన్న స్మార్ట్‌ఫోన్ యూజర్ మొదట ఆశ్రయించేది యాప్‌నే. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ యాప్స్ రెవెన్యూలు కూడా భారీగానే పెరుగుతున్నట్టు తెలుస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీకి ఇంటర్నెట్ యాప్స్ రూ.1.4 లక్షల కోట్లను అందించినట్టు తాజా నివేదికలు పేర్కొన్నాయి. 2020 నాటికి ఈ మొత్తం మరింత పెరిగి రూ.18 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఓ అధ్యయన రిపోర్టు పేర్కొంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్, బ్రాండ్‌బ్యాండు ఇండియా ఫోరం చేపట్టిన అధ్యయన రిపోర్టును కేంద్ర సమాచారాల శాఖ మంత్రి మనోజ్ సిన్హా శుక్రవారం విడుదల చేశారు. వాయిస్ కంటే డేటా ఎక్కువగా ఇండస్ట్రీని రన్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ప్రజా సంప్రదింపుల మేరకు ప్రస్తుత టెలికాం పాలసీని కూడా తాము పునఃపరిశీలిస్తున్నామని సిన్హా చెప్పారు. యాప్స్ వల్ల మనదేశ ఆర్థికవ్యవస్థకు కనీసం సగానికి పైగా సహకారం ఇంటర్నెట్ ద్వారానే అందుతున్నట్టు అధ్యయన రిపోర్టు తెలిపింది. 2020 నాటికి భారత జీడీపీకి ఇంటర్నెట్ ఎకానమీ 537.4 బిలియన్ డాలర్ల సహకారం అందిస్తుందని ఈ స్టడీ అంచనావేస్తోంది. వీటిలో కనీసం 270.9 బిలియన్ డాలర్లు యాప్స్ ద్వారానే వస్తాయని చెప్పింది. ప్రత్యేక పనులు నిర్వర్తించడానికి ఎక్కువగా యాప్స్ లేదా అప్లికేషన్లనే వాడుతున్నారని స్టడీ చెప్పింది. ఐటీ కంపెనీ సిస్కో అంచనావేసిన వర్చ్యువల్ నెట్వర్కింగ్ ఇండెక్స్ ఆధారితంగా ఇంటర్నెట్ వాడకాన్ని అధ్యయనం చేశారు. సిస్కో అంచనాల ప్రకారం 2015లో మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో భారత ఇంటర్నెట్ ట్రాఫిక్ నాన్-పీసీ డివైజ్‌లో 28 శాతముంది. -
భారత జీడీపీ ఇకముందు బలంగానే
• ఈ ఏడాది 7.6%.. వచ్చే ఏడాది 7.7% • ప్రపంచ బ్యాంకు అంచనా వాషింగ్టన్: భారత జీడీపీ ఇక ముందూ జోరుగానే ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 2016లో 7.6 శాతం, 2017లో 7.7 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. వ్యవసాయ రంగం పుంజుకోవడం, ఉద్యోగుల వేతన సవరణలు వినియోగానికి ఊతమిస్తాయని... ఎగుమతుల నుంచి సానుకూల తోడ్పాటుతో పాటు ప్రైవేటు పెట్టుబడులు మధ్య కాలానికి కోలుకోవడం వంటివి వృద్ధికి మద్దతునిస్తాయని తెలియజేసింది. ఈ మేరకు దక్షిణాసియా ఆర్థిక రంగంపై ప్రపంచ బ్యాంకు తాజాగా ద్వైవార్షిక నివేదికను విడుదల చేసింది. భారత్‌లో పేదరికాన్ని వేగంగా తగ్గించటం, అన్ని వర్గాలనూ వృద్ధిలో భాగస్వాముల్ని చేయడం వంటి అనేక సవాళ్లున్నాయని బ్యాంకు తన నివేదికలో ప్రస్తావించింది. దక్షిణాసియా ప్రాంతం ప్రపంచ అభివృద్ధి కేంద్రంగానే కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. చైనా మందగమనం, ఉద్దీపనలపై అనిశ్చితి తదితర వెలుపలి ఒత్తిళ్లలను సైతం తట్టుకుని నిలబడిందని పేర్కొంది. స్వల్ప కాలంలో సమస్యలు స్వల్ప కాలంలో వృద్ధి రేటును మందగింపజేసే సమస్యలను కూడా నివేదిక ప్రస్తావించింది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొనడం, కమోడిటీ ధరల ఒడిదుడుకులు, ప్రపంచ వాణిజ్యంపై బ్రెగ్జిట్ ప్రభావం, చైనా ఆర్థిక రంగం మరింత నిదానించడం వంటివి ఆర్థిక రంగం కోలుకోవడాన్ని మరింత ఆలస్యం చేస్తాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. రెండేళ్లు ఇదే స్థాయిలో: ఐఎంఎఫ్ భారత్ జీడీపీ విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మరింత సానుకూలతను వ్యక్తం చేసింది. గత అంచనాలను పెంచింది. భారత జీడీపీ వృద్ధి వేగంగా పెరుగుతోందని, 2016, 2017 సంవత్సరాల్లో 7.6 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఐఎంఎఫ్ ఈ ఏడాది జూలైలో ప్రకటించిన వృద్ధి రేటు అంచనాల కంటే తాజా అంచనాలు 0.2 బేసిస్ పాయింట్లు ఎక్కువ కావడం గమనార్హం. -
ఇతరులతో పోలిస్తే మెరుగే కానీ..
భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాల్లో స్వల్ప కోత ♦ 0.2% తగ్గించిన ప్రపంచ బ్యాంక్ ♦ ఈ ఏడాది 7.6 శాతంగా అంచనా... ♦ ఎన్పీఏలతో కార్పొరేట్ రుణాలకు గండి ♦ రెండేళ్లుగా సరైన వర్షాలు లేకపోవటం కూడా ప్రతికూలమే ♦ తాజా నివేదికలో వెల్లడి వాషింగ్టన్: దేశ వృద్ధి రేటు అంచనాలకు ప్రపంచ బ్యాంక్ స్వల్పంగా కోత విధించింది. ఈ ఏడాది(2016)లో భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.6 శాతంగా ఉండొచ్చని తాజాగా అంచనా వేసింది. ‘ప్రపంచ ఆర్థిక అంచనాలు’ పేరిట మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయం చెప్పింది. వచ్చే రెండేళ్ల(2017, 18)కు వృద్ధి రేటు అంచనాలను సైతం 0.2 శాతం తగ్గించి 7.7 శాతానికి చేర్చింది. అయితే, ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లో వృద్ధి పరుగులు తీస్తోందని... మొత్తంమీద 2016-17 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాల కాలంలో భారత్ వృద్ధి రేటు 7.6-7.7 శాతంగా ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. దేశీయ డిమాండ్ దన్ను... గతేడాది(2015-16)లో వృద్ధి 7.6 %కి(0.4% పెరుగుదల) పుంజుకోవడానికి ప్రధానంగా దేశీయ డిమాండ్ పెరగటమే కారణమని ఈ నివేదిక అభిప్రాయపడింది. ‘‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనల సరళీకరణకు మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కూడా వృద్ధికి ఆసరాగా నిలుస్తున్నాయి. 2014 అక్టోబర్‌లో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచీ ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ చూస్తే ఎఫ్‌డీఐలు 37% వృద్ధి చెందాయి’’ అని నివేదిక పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలివీ.. ♦ ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌లో మందగమనం ఉన్నప్పటికీ.. గత ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో తయారీ రంగం 9.3 శాతం పుంజుకుంది. ♦ ఇతర పెద్ద వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లో వ్యాపార సెంటిమెంట్ బలంగా ఉంది. ♦ స్టార్టప్ సంస్థల జోరు పెరిగింది. ముఖ్యంగా ఫైనాన్షియల్ సేవలు, ఈ-కామర్స్‌లో కొత్తకొత్త స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నాయి. ♦ ఆర్థిక పరమైన కార్యకలాపాల్లో వేగం పెరగడం ఉద్యోగాల సృష్టికి వీలుకల్పిస్తోంది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో కొనసాగడం, వేతనాల్లో పెరుగుదలతో ప్రజల వాస్తవ ఆదాయాలు జోరందుకొని అర్బన్ వినిమయం ఎగబాకుతోంది. ♦ విద్యుదుత్పత్తి, రోడ్లు, రైల్వేలు, అర్బన్ ఇన్ఫ్రాలో ప్రభుత్వ వ్యయం పెరగడంతో వ్యాపార సెంటిమెంట్ మెరుగుపడటంతో పాటు సరఫరాపరమైన అడ్డుంకులు కూడా తొలగుతున్నాయి. ♦ వరుసగా రెండేళ్లు సరైన వర్షపాతం లేకపోవడంతో గ్రామీణ వినియమం తీవ్రంగా పడిపోవడం మాత్రం ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలాంశమే. ♦ 2015 నుంచి 5 సార్లు వడ్డీరేట్లలో కోత విధించినప్పటికీ కార్పొరేట్ రంగ రుణ వృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు భారీగా పెరిగిపోవడం దీనికి కారణం. ప్రపంచ వృద్ధి అంచనాల్లో భారీ కోత... అభివృద్ధి చెందిన దేశాల్లో మందగమనం, కమోడిటీ రేట్ల పతనం, అంతర్జాతీయ వాణిజ్యంలో బలహీనతల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి అంచనాల్లో భారీగా కోత పడింది. ఈ ఏడాది 2.4 శాతానికి పరిమితం కావచ్చని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. జనవరిలో అంచనా వేసిన 2.9 శాతంతో పోలిస్తే అర శాతం తగ్గించడం గమనార్హం. ఇక చైనా వృద్ధి గతేడాది స్థాయిలోనే 6.7 శాతంగా ఉండొచ్చని తెలిపింది. వృద్ధి మందగమనాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ దేశాలన్నీ తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, తీవ్ర పేదరికంలో ఉన్న ప్రజలకు బాసటగా నిలవాలని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఊపందుకున్న జీడీపీ వృద్ధి రేటు
న్యూఢిల్లీ : భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు పెరిగింది. మార్చి త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు 7.9 శాతంగా నమోదైందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గత త్రైమాసికంలో ఈ రేటు 7.2 శాతంగా నమోదైంది. అదేవిధంగా మార్చి నెలతో ముగిసిన 2015-16 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదైందని ప్రభుత్వం గణాంకాలు ప్రకటించాయి. గత 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 7.2 శాతంగానే ఉంది. అంచనావేసిన దానికంటే ఎక్కువగానే జీడీపీ వృద్ది రేటు ఊపందుకుందని ఆర్థిక నిపుణులు తెలిపారు. కోర్ రంగ జోరు.. అదేవిధంగా కోర్ రంగ ఉత్పత్తి వరుసగా ఐదు నెల కూడా పెరిగింది. ఏప్రిల్ లో నెలల్లో ఈ రంగం 8.5శాతం వృద్ధి నమోదుచేసిందని వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.. మార్చి నెలల్లో ఈ రంగ వృద్ధి 6.4 శాతంగా నమోదైంది. అయితే గతేడాది ఇదే నెలలో ఈ రంగ వృద్ది 0.2 శాతం పడిపోయింది. ఎనిమిది పరిశ్రమ రంగాలు కోల్, క్రూడ్ ఆయిల్, నాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్ లు, ఫెర్టిలైజర్లు, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ లతో కోర్ సెక్టార్ ఇండెక్స్ ను కొలుస్తారు. పరిశ్రమ ఉత్పత్తిలో వీటి వాటా 38 శాతంగా ఉంటుంది. ఈ ఎనిమిది రంగాల్లో ఐదు రంగాలు పాజిటివ్ వృద్దినే నమోదుచేయడంతో ఏప్రిల్ నెలలో కోర్ రంగ వృద్ధి గత నెలకంటే 2.7శాతం పెరిగిందని గణాంకాలు తెలిపాయి. -
ఈ ఏడాది భారత వృద్ధి 7.5%
ఐఎంఎఫ్ తాజా నివేదిక వాషింగ్టన్: భారత్ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి చేరుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) పేర్కొంది. ఈ ఏడాది చైనా జీడీపీ కన్నా భారత జీడీపీ 1 శాతం అధికంగా ఉంటుందని తన తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదికలో ఐఎంఎఫ్ తెలిపింది. ప్రైవేట్ వినియోగం జోరుగా ఉండడం, పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడం దీనికి ప్రధాన కారణాలని వివరించింది. గత ఏడాది అక్టోబర్ అంచనాలనే ఐఎంఎఫ్ కొనసాగించింది. భారత్‌లో ద్రవ్య పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయని, 5 శాతం కంటే దిగువగానే ద్రవ్యోల్బణం ఉందని పేర్కొంది. అయితే ప్రతికూలమైన వర్షపాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగడం...ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించింది. -
జీడీపీకి ‘డిజిటల్’ జోష్!
2020 నాటికి 101 బిలియన్ డాలర్ల జత న్యూఢిల్లీ: పెరుగుతున్న డిజిటల్ టెక్నాలజీ వినియోగం ద్వారా 2020 నాటికి భారత జీడీపీకి 101 బిలియన్ డాలర్లు సమకూరుతాయని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ యాక్సెంచర్ తెలిపింది. యాక్సెంచర్ నివేదిక ప్రకారం, డిజిటల్ టెక్నాలజీ వల్ల చైనాకు వచ్చే ఆదాయం 410 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. అదే బ్రెజిల్‌కు అయితే 97 బిలియన్ డాలర్ల ఆదాయం రానుంది. అంతర్జాతీయంగా చూస్తే డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చే ఆదాయంలో భారత్ నాల్గో స్థానంలో నిలువనుంది. భారత్‌కు ముందు వరుసలో చైనా, అమెరికా (365 బిలియన్ డాలర్లు), జపాన్ (114 బిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చే ఆదాయం అభివృద్ధి చెందిన దేశాలలో 0.25 శాతం జీడీపీ వృద్ధికి, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 0.5 శాతం జీడీపీ వృద్ధికి దోహదపడుతుంది. డిజిటల్ టెక్నాలజీ వినియోగం వల్ల టాప్ 10 ఆర్థికవ్యవస్థలను కలిగిన దేశాల ఉత్పాదకత పెరిగి, వాటికి దాదాపు 1.36 ట్రిలియన్ డాలర్ల సంపద చేకూరనుంది. -
గట్టెక్కినట్టే..!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2013 ఏప్రిల్ నుంచి 2014 మార్చి వరకూ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 4.9 శాతంగా ప్రభుత్వం అంచనా వేసింది. జీడీపీ వృద్ధి ముందస్తు అంచనాలను కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాలు గత ఆర్థిక సంవత్సరం (2012-13)కన్నా కొంత మెరుగ్గా ఉన్నాయి. గత ఏడాది ఈ రేటు 4.5 శాతం మాత్రమే. వ్యవసాయం, అనుబంధ రంగాలు 2013-2014 ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు పెరగడానికి ప్రధానంగా చేయూతనిస్తాయని గణాంకాలు పేర్కొన్నాయి. తలసరి ఆదాయం రూ. 39,961: 2004-05 ధరల ఆధారంగా వాస్తవ ప్రాతిపదికన తలసరి ఆదాయం 2013-14లో రూ.39,961 ఉండవచ్చని అంచనా. 2012-13లో ఈ మొత్తం రూ. 38,856. అంటే 2.8 శాతం పెరిగింది. ఈ రేటు 2012-13లో 2.1 శాతం. ఇక ద్రవ్యోల్బణం, తత్సంబంధ అంశాలను పరిగణలోకి తీసుకోకుంటే (ప్రస్తుత ధరల ప్రాతిపదికన) ఈ రెండేళ్లలో తలసరి ఆదాయం 10.4 శాతం వృద్ధితో రూ.67,839 నుంచి రూ. 74,920కి చేరవచ్చు. దీని ప్రకారం భారత్ మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిమాణం 1.7 ట్రిలియన్ డాలర్లు. రూపాయల్లో అక్షరాలా రూ.105.39 లక్షల కోట్లు. మొత్తం జాతీయ ఆదాయాన్ని దేశ ప్రజలతో భాగిస్తే- వచ్చేదే తలసరి ఆదాయం. ప్రస్తుత ధరల ప్రాతిపదికన చూస్తే- మొత్తం జీడీపీ 12.26 శాతం వృద్ధితోరూ.99.88 లక్షల కోట్ల నుంచి రూ. 105.39 లక్షల కోట్లకు చేరవచ్చు. దేశ మొత్తం జనాభా 2013 మార్చిలో 121.7 కోట్లు ఉండగా, 2014 మార్చి నాటికి రూ. 123 కోట్లకు పెరుగుతుందని అంచనా. పెట్టుబడుల పరిస్థితి పెట్టుబడులకు సూచిక అయిన స్థూల స్థిర పెట్టుబడుల కూర్పు (జీఎఫ్‌సీఎఫ్) ప్రస్తుత ధరల ప్రాతిపదికన రూ.30.7 లక్షల కోట్ల నుంచి రూ. 32.2 లక్షల కోట్లకు పెరగవచ్చు. అయితే ద్రవ్యోల్బణం తత్సంబంధ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ- 2004-05 ధరల ప్రకారం ఈ విలువ రూ. 20 లక్షల కోట్ల నుంచి రూ. 20.1 లక్షల కోట్లకు మాత్రమే పెరుగుతుందని అంచనా. అసలు ఈ అంచనాలు ఎందుకు? సహజంగా ఫిబ్రవరిలో ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్‌కు ముందే వివిధ రంగాల పనితీరు, వృద్ధి సంబంధిత అంచనాలపై ప్రభుత్వానికి ఒక అవగాహన అవసరం. ఈ అవగాహన ప్రధాన లక్ష్యంగానే సీఎస్ఓ జీడీపీ ముందస్తు అంచనాలను ఆవిష్కరిస్తుంది. ప్రభుత్వంలోని ఆర్థిక నిర్ణేతలు ఈ ‘అంచనా’ గణాంకాలకు కట్టుబడాల్సిన పనిలేదు. మరిన్ని చర్యలు అవసరం: పరిశ్రమలు తాజా గణాంకాల పట్ల పారిశ్రామిక వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. మౌలిక రంగంపై ప్రత్యేక దృష్టి అవసరమని పేర్కొన్నాయి. బలహీన వినియోగం, పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయాల నేపథ్యంలో డిమాండ్ పుంజుకున్నట్లు సంకేతాలు కనిపించడం లేదని పేర్కొన్నాయి. ముఖ్యంగా తయారీ, మైనింగ్ రంగాల పురోగతి కీలకమని వ్యాఖ్యానించాయి. సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ, నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఊపును ఇవ్వడానికి ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సమీప భవిష్యత్తులో వృద్ధి పునరుత్తేజమవుతుందన్న ఆశలు ఆవిరవుతున్నట్లు అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 5.5 శాతానికి మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా వ్యక్తం చేశారు. ముఖ్య రంగాలు ఇలా... వ్యవసాయం, అనుబంధ రంగాలు: మొత్తం జీడీపీలో దాదాపు 14 శాతం వరకూ వాటా ఉన్న ఈ రంగం వృద్ధి రేటు 4.6 శాతంగా ఉండవచ్చు. ఈ రేటు 2012-13లో 1.4 శాతం మాత్రమే. తయారీ: జీడీపీలో దాదాపు 15 శాతం ఉన్న ఈ రంగంలో అసలు వృద్ధి లేదు. గత ఏడాదితో పోల్చితే -0.2 క్షీణించవచ్చు. 2012-13లో ఈ రంగం 1.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. సేవల రంగం (ఫైనాన్స్, బీమా, రియల్టీ, బిజినెస్ సేవలుసహా): జీడీపీలో దాదాపు 55% వాటా కలిగిన ఈ విభాగం వృద్ధి 11.2%గా నమోదుకావచ్చు. 2012-13లో ఈ రంగం వృద్ధి రేటు 10.9%. మైనింగ్ అండ్ క్వారీ: క్షీణతలోనే కొనసాగుతుంది. అయితే క్షీణత -2.2 శాతం నుంచి -1.9 శాతానికి తగ్గొచ్చు. నిర్మాణం: ఈ రంగంలో కూడా వృద్ధి 1.1 శాతం నుంచి 1.7 శాతానికి మెరుగుపడనుంది. విద్యుత్, గ్యాస్, నీటి పారుదల రంగం: వృద్ధి రేటు 2.3 శాతం నుంచి 6 శాతానికి పెరిగే అవకాశం వాణిజ్యం, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు: వృద్ధి రేటు 5.1 శాతం నుంచి 3.5 శాతానికి పడిపోయే అవకాశం. కమ్యూనిటీ సామాజిక, వ్యక్తిగత సేవలు: ఈ రంగంలో వృద్ధి రేటు 5.3 శాతం నుంచి 7.4 శాతానికి ఎగియనుంది.