యాప్స్ ద్వారా రూ.1.4 లక్షల కోట్లు
యాప్స్ ద్వారా రూ.1.4 లక్షల కోట్లు
Published Sat, Jul 15 2017 4:00 PM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, దానిలో కనీసం ఓ ఐదు నుంచి పది యాప్స్ అయినా ఉంటాయి. ప్రస్తుతం దేశంలో యాప్స్ వాడకం అంతలా పెరిగిపోయింది. ఏ పనిచేయాలన్న స్మార్ట్‌ఫోన్ యూజర్ మొదట ఆశ్రయించేది యాప్‌నే. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ యాప్స్ రెవెన్యూలు కూడా భారీగానే పెరుగుతున్నట్టు తెలుస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీకి ఇంటర్నెట్ యాప్స్ రూ.1.4 లక్షల కోట్లను అందించినట్టు తాజా నివేదికలు పేర్కొన్నాయి. 2020 నాటికి ఈ మొత్తం మరింత పెరిగి రూ.18 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఓ అధ్యయన రిపోర్టు పేర్కొంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్, బ్రాండ్‌బ్యాండు ఇండియా ఫోరం చేపట్టిన అధ్యయన రిపోర్టును కేంద్ర సమాచారాల శాఖ మంత్రి మనోజ్ సిన్హా శుక్రవారం విడుదల చేశారు. వాయిస్ కంటే డేటా ఎక్కువగా ఇండస్ట్రీని రన్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ప్రజా సంప్రదింపుల మేరకు ప్రస్తుత టెలికాం పాలసీని కూడా తాము పునఃపరిశీలిస్తున్నామని సిన్హా చెప్పారు.
యాప్స్ వల్ల మనదేశ ఆర్థికవ్యవస్థకు కనీసం సగానికి పైగా సహకారం ఇంటర్నెట్ ద్వారానే అందుతున్నట్టు అధ్యయన రిపోర్టు తెలిపింది. 2020 నాటికి భారత జీడీపీకి ఇంటర్నెట్ ఎకానమీ 537.4 బిలియన్ డాలర్ల సహకారం అందిస్తుందని ఈ స్టడీ అంచనావేస్తోంది. వీటిలో కనీసం 270.9 బిలియన్ డాలర్లు యాప్స్ ద్వారానే వస్తాయని చెప్పింది. ప్రత్యేక పనులు నిర్వర్తించడానికి ఎక్కువగా యాప్స్ లేదా అప్లికేషన్లనే వాడుతున్నారని స్టడీ చెప్పింది. ఐటీ కంపెనీ సిస్కో అంచనావేసిన వర్చ్యువల్ నెట్‌వర్కింగ్ ఇండెక్స్ ఆధారితంగా ఇంటర్నెట్ వాడకాన్ని అధ్యయనం చేశారు. సిస్కో అంచనాల ప్రకారం 2015లో మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో భారత ఇంటర్నెట్ ట్రాఫిక్ నాన్-పీసీ డివైజ్‌లో 28 శాతముంది.
Advertisement
Advertisement