జీడీపీకి ‘డిజిటల్’ జోష్!
2020 నాటికి 101 బిలియన్ డాలర్ల జత
న్యూఢిల్లీ: పెరుగుతున్న డిజిటల్ టెక్నాలజీ వినియోగం ద్వారా 2020 నాటికి భారత జీడీపీకి 101 బిలియన్ డాలర్లు సమకూరుతాయని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ యాక్సెంచర్ తెలిపింది. యాక్సెంచర్ నివేదిక ప్రకారం, డిజిటల్ టెక్నాలజీ వల్ల చైనాకు వచ్చే ఆదాయం 410 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. అదే బ్రెజిల్‌కు అయితే 97 బిలియన్ డాలర్ల ఆదాయం రానుంది.
అంతర్జాతీయంగా చూస్తే డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చే ఆదాయంలో భారత్ నాల్గో స్థానంలో నిలువనుంది. భారత్‌కు ముందు వరుసలో చైనా, అమెరికా (365 బిలియన్ డాలర్లు), జపాన్ (114 బిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చే ఆదాయం అభివృద్ధి చెందిన దేశాలలో 0.25 శాతం జీడీపీ వృద్ధికి, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 0.5 శాతం జీడీపీ వృద్ధికి దోహదపడుతుంది. డిజిటల్ టెక్నాలజీ వినియోగం వల్ల టాప్ 10 ఆర్థికవ్యవస్థలను కలిగిన దేశాల ఉత్పాదకత పెరిగి, వాటికి దాదాపు 1.36 ట్రిలియన్ డాలర్ల సంపద చేకూరనుంది.