చిత్తశుద్ధితోటే విత్త వృద్ధి | NPA and loans growth rate day by day raising | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధితోటే విత్త వృద్ధి

Published Fri, Jul 1 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

చిత్తశుద్ధితోటే విత్త వృద్ధి

చిత్తశుద్ధితోటే విత్త వృద్ధి

సమకాలీనం
పేరున్న నాయకుడో, బడా పారిశ్రామికవేత్తో, ఓ కంపెనీయో బ్యాంకులకు వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని వార్తలు వచ్చినపుడు సామాన్యుల బుర్రను తొలిచే ప్రశ్న ఒకటే! ఏ రైతో, చిరుద్యోగో, చిన్న వ్యాపారో పదివేలో, ఇరవైవేలో అప్పు కావాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసి, గ్యారెంటీలు-కౌంటర్ గ్యారెంటీలతోనే రుణాలిచ్చే బ్యాంకులు ఈ ‘బడా’ల ముందు ఎందుకు బోల్తాపడతాయి? వారి నుంచి అప్పు తిరిగి రాబట్టుకునే విధానాలు ఎందుకుండవు? కాస్త లోతుగా పరిశీలిస్తే వీరి బండారం బయటపడుతుంది.
 
ఈమధ్య బ్యాంకులు తరచూ వార్తల్లో ఉంటున్నాయి. అది మంచి కార ణాలతో అయితే ఫరవాలేదు, కానీ, చెడు కారణాలతో కావడమే బాధాకరం. వైద్యుడు, జీవనది, మంచి చెడులు చెప్పే పండితుడితో పాటు అప్పిచ్చేవా డున్న ఊళ్లోనే ఉండాలని సుమతీ శతకకారుడు బద్దెన రాశాడు. అప్పులిచ్చే సదుపాయం, అంటే బ్యాంకింగ్ వ్యవస్థకు అప్పట్నుంచే మనవాళ్లు అంత ప్రాధాన్యతనిచ్చారు. సంపద సంగతెలా ఉన్నా... డబ్బు ఉన్నపుడు, లేనపుడు ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి నుంచి పుట్టిన ఈ ప్రక్రియ సుదీర్ఘకాలం పాటు విలువలతో నడిచిందీ నేలపైన. ఇటీవలి కాలం వరక్కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు షావుకార్లు అతి తక్కువ వడ్డీరేట్లపైన రుణాలిచ్చేవారు. రుణ గ్రహీత కూడా అవసరానికి తీసుకొని తన చేయి తిరగ్గానే వడ్డీతోసహా తిరిగి చెల్లించేవాడు. ఒకటీ, అర కేసుల్లో ఎవరైనా దుర్బుద్ధితో ఎగ్గొట్టడానికి యత్నించినా, వారి బంధువుల్ని పిలిపించో, గ్రామస్తుల సమక్షంలోనో చిన్నపాటి చర్చ, పంచాయతీ పెట్టి దారికి తెచ్చుకునేవారు. తర్వాతి కాలంలో వాటి స్థానే వ్యవస్థీకృతమైన బ్యాంకులొచ్చాయి.

కొంతకాలం పాటు రెండు వ్యవస్థలూ సమాంతరంగా నడిచాయి. కొన్నిచోట్ల ఇంకా నడుస్తున్నాయి! ఇంకొకరి అవసరాన్ని తమ అవకాశంగా మలచుకొని ఇబ్బడి ముబ్బడి వడ్డీలు, చక్రవడ్డీలతో కాల్చుకు తినే అప్పులవాళ్లు కూడా ఎక్కువయ్యారు. షావుకార్లు, కాబూలీవాలాలు, మైక్రో ఫైనాన్స్‌ల నుంచి ఇవాళ్టి కాల్‌మనీ కాల సర్పాల వరకు రూపాంతరం చెందిందీ ప్రైవేటు అప్పుల వ్యవస్థ. అప్పు తెచ్చుకొని ముంచేవాళ్లు తయారయ్యారు. చట్టం నీడలో, తగు రక్షణ ఏర్పా ట్లతో వ్యవస్థీకృతంగా ఉంటాయనుకునే బ్యాంకుల్ని ముంచే మహాటోకరా గాళ్లూ తయారయ్యారు. అది కార్పొరేట్ రంగమే కావడం దురదృష్టం. భారత బ్యాంకింగ్ వ్యవస్థకు పట్టిన ఈ జాడ్యమే మన ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి పెను సవాల్ విసురుతోంది. 2008లో, 2012లో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో అమెరికా, ఐరోపాదేశాల వంటి అభివృద్ధి చెందిన సమాజాలు అతలాకుతలమైనపుడు, మనం తట్టుకొని నిలబడగలిగామంటే అందుకు పటిష్టమైన మన బ్యాంకింగ్ వ్యవస్థే కారణమని నిపుణులు విశ్లేషిం చారు. ఆ విశ్వాసం ఇప్పుడు సడలుతోంది.

బడాచోర్... పెద్దప్పుల కార్పొరేట్లే!
 మొన్నటి మార్చి మాసాంతానికి మన బ్యాంకుల మొండి బకాయిలు, లోగడ ఎప్పుడూ లేనంత అధికంగా రూ.5.8 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇవి నికరంగా నిరర్థక ఆస్తులు(ఎన్పీయే). వాటిని అర్థవంతమైన ఆస్తులుగా మార్చే ప్రక్రియ ఒకడుగు ముందుకి రెండడుగులు వెనక్కి అన్నట్టుగానే సాగుతోంది. మధ్య తరగతి, ఎగువ-దిగువ మధ్య తరగతి కుటుంబాల వాళ్లు కష్టపడి పైసా పైసా కూడబెట్టిన డిపాజిట్లతో ఖజానా నింపుకునే బ్యాంకుల్ని బడా చోర్లు కొల్లగొట్టడం వల్లే నిరర్థక ఆస్తులు పెరుగుతున్నాయి. బ్యాంకింగ్ స్ఫూర్తే భంగపడుతోంది. పెరుగుతున్న ఈ మొండి బకాయిల భారం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ కుంగిపోయే ప్రమాద పరిస్థితులు అధికమౌతున్నాయని భారత రిజర్వు బ్యాంక్ తాజా (ఆర్థిక స్థిరత్వ) ద్వైవార్షిక నివేదిక హెచ్చరించింది. గత సెప్టెంబరులో 5.1 శాతంగా ఉన్న ఈ స్థూల మొండి బకాయిలు ఆరు మాసాల్లో 7.6 శాతానికి పెరిగాయనీ, ఇదే పరిస్థితి కొనసాగితే... 2017 నాటికి 9.3 శాతాన్ని దాట వచ్చనీ అంచనా వేసింది. అదే సమయంలో రుణ వృద్ధి రేటు తగ్గడం మరింత నిరాశాజనకమని ఈ నివేదికకు రాసిన ముందు మాటలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.

గత సెప్టెంబరులో 9.4 శాతంగా ఉన్న రుణ వృద్ధిరేటు మార్చినాటికి 8.8 శాతానికి పడిపోయింది. పెద్ద మొత్తాల్లో రుణాలు తీసుకుంటున్న భూరి గ్రహీతల మొండిబకాయిల వల్లే ఈ పరిస్థితి దాపురించింది. మొత్తం మొండి బకా యిల్లో భూరి రుణ గ్రహీతలవే 86.4 శాతం ఉండగా, అగ్రభాగాన ఉన్న వంద మంది రుణ గ్రహీతల వాటాయే 22 శాతం! మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇదే ఆరుమాసాల కాలంలో బ్యాంకేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీ ఎఫ్సీ) నిలకడగా వృద్ధి సాధించాయి. భారత బ్యాంకింగ్ రంగం సంక్షుభిత పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రపంచ పరిస్థితితో పోల్చినపుడు మన ఆర్థిక వ్యవస్థ దృఢంగానే ఉందని రాజన్ అంటున్నారు. అయితే, మారుతున్న ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా దేశీయంగా దృఢ విధానాలు, వ్యవస్థాగత సంస్క రణలు అత్యవసరమని ఆయన అభిప్రాయం.

ఎందుకీ దుస్థితి?
 పేరున్న నాయకుడో, బడా పారిశ్రామికవేత్తో, ఓ కంపెనీయో బ్యాంకులకు వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని వార్తలు వచ్చినపుడు సామాన్యుల బుర్రను తొలిచే ప్రశ్న ఒకటే! ఏ రైతో, చిరుద్యోగో, చిన్న వ్యాపారో పదివేలో, ఇరవై వేలో అప్పు కావాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసి, గ్యారెంటీలు-కౌంటర్ గ్యారెంటీలతోనే రుణాలిచ్చే బ్యాంకులు ఈ ‘బడా’ల ముందు ఎందుకు బోల్తా పడతాయి? వారి నుంచి అప్పు తిరిగి రాబట్టుకునే విధానాలెందుకుండవు? కాస్త లోతుగా పరిశీలిస్తే వీరి బండారం సులభంగానే బయటపడుతుంది. అన్నిసార్లూ మోసాలే కాకపోవచ్చు! ఒకోసారి స్థాయికి, సామర్థ్యానికి మించిన విస్తరణలకు వెళ్లి, సరిగా నిర్వహించలేక కంపెనీలు, కార్పొరేట్లు బొక్క బోర్లా పడుతాయి. అప్పుడూ బ్యాంకులు మునగాల్సిందే! బుద్ధి వక్రిం చిన వారు ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు బురిడీ కొట్టే ఉదంతాలూ ఉంటాయి.

పలుకుబడితో రుణాలు పొందడం, ఆయా కంపె నీల్ని పనిగట్టుకు దివాలా తీయించడం, ఈ లోపున సదరు కంపెనీల ఆస్తుల్ని ఇతరేతర కంపెనీలకు దారి మళ్లించడం, మొదటి కంపెనీల్ని డొల్ల పరిచి అప్పులిచ్చిన బ్యాంకుల్ని నిలువునా ముంచడం... ఇదీ తంతు. రైతులకు రుణ వితరణ విషయంలో కటువుగా ఉండే బ్యాంకులు కార్పొరేట్లకు దాసోహమం టాయనేది సామాజిక శాస్త్రవేత్తల విమర్శ. కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకునేం దుకు రుణాల్ని మాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు హామీలిచ్చి, గద్దెనెక్కాక రైతుకు టోకరా ఇచ్చే ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంటి నాయకులూ ఉంటారు. ‘మాఫీ’ పద ్ధతే మంచిది కాదని, అది ఖాతాదారుడి అప్పు తీర్చే సంస్కృతిని నశింపజేస్తుందని నీతులు చెప్పే బ్యాంకులు, కార్పొరేట్ పెద్దల గడ్డాలు పట్టుకొని ‘వన్‌టైమ్ సెటిల్‌మెంట్’కి రమ్మని బతి మాలుతూ రెండు నాల్కల ధోరణి చూపుతాయి.  ఏ రుణాలైతేనేం, 2015లోనే బ్యాంకులు మాఫీ చేసిన (రిటన్ ఆఫ్) రుణ మొత్తం 52,000 కోట్ల రూపాయ లని ఆర్బీఐ చెబుతోంది.

మరేమిటి పరిష్కారం?
కార్పొరేట్ మొండి బకాయిల సమస్యను అధిగమించే యుద్ధానికి వెళ్లేట ప్పుడు బ్యాంకులు ఉత్తిచేతులతో కాకుండా వినూత్న ఆయుధ సంపత్తితో వెళ్లాలని అరుంధతీ భట్టాచార్య (ఎస్బీఐ) అంటారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు పేరుకుపోతూ ఆర్థిక వ్యవస్థే డోలాయమానమైనపుడు పరిస్థితిని అధిగమించడానికిగాను రిజర్వు బ్యాంకు, కేంద్రం చేపడుతున్న చర్యల్లో పెద్ద పురోగతి లేదు. వ్యూహాత్మక రుణ పునర్ వ్యవస్థీకరణ (ఎస్డీయార్) వంటివి పెద్దగా ఫలించడం లేదు. ఈ వ్యవహారాల్లో న్యాయస్థానాల తీర్పుల అమలు కూడా అంతంతమాత్రమే. ప్రపంచ ఆర్థిక మాంద్యం దరిమిలా ఉత్పన్నమైన దుస్థితిని అధిగమించడానికి తదనంతర కాలాలలో వివిధ దేశాల్లో వేర్వేరు పద్ధతులను అనుసరించారు. అవి కొంతమేర ఫలితమిచ్చాయి. కొన్ని చోట్ల వికటించాయి.

ఇటలీలో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి తటస్థ ఏజెన్సీ ద్వారా ఆస్తుల ఆర్థిక పరిపుష్టికి యత్నించారు. స్పెయిన్, ఐర్లాండ్ వంటి దేశాల్లో ఇటువంటి యత్నాలు వికటించిన అనుభవాలున్నాయి. అమెరికాలో ప్రభు త్వమే ఆయా ఆస్తుల్ని కొనుగోలు చేసి ట్రబుల్డ్ అసెట్ రిలీఫ్ ప్రోగ్రామ్ (టిఏఆర్పీ) అమలు చేసింది. మన దేశంలో పూర్తిగా ప్రభుత్వమే భారం మోసే పద్ధతి సాధ్యపడదు. అందుకు, మన ఆర్థికపరిమితులు అనుమతిం చవు. మొండి బకాయిలు, నిరర్థక ఆస్తుల వల్ల దెబ్బతిన్న బ్యాంకుల పరిపుష్టికి రిజర్వుబ్యాంకు (సెంట్రల్ బ్యాంకు) ఎమర్జెన్సీ నిధుల్ని ఉపయోగించాలనే ఓ కొత్త ఆలోచన తెరపైకి వస్తోంది. ఇది, ఆర్థిక మంత్రిత్వశాఖ ముఖ్య సలహా దారు అరవింద్ సుబ్రహ్మణియన్ యోచన అంటున్నారు. రాజన్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. చైనాలో ‘డెట్ ఈక్విటీ కన్వర్షన్’ పద్ధతి అనుసరించారు.

దెబ్బతిన్న కంపెనీలు బాకీపడ్డ మొత్తాల్లో సగం వరకు ఈక్విటీ కింద మార్చుకునే వెసులుబాటును మన రిజర్వుబ్యాంకు ఇటీవల కల్పించింది. ఫలితాలెలా ఉంటాయో చూడాలి. ప్రపంచ చేదు అనుభవాల తర్వాత అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్మెఫ్) నిపుణుడొకరు మన పునరు ద్ధరణకు 3 పరిష్కారాల్ని సూచిస్తున్నారు. 1) సమస్య మరింత జటిలం కాక ముందే సత్వర, ప్రభావవంతమైన చర్యల్ని ఆర్బీఐ-కేంద్ర ప్రభుత్వం చేప ట్టాలి. బ్యాంకులు కూడా నిజాల్ని దాచి, రుణాల్ని పెంచుతూ పోవడం కాకుండా ఆస్తుల నాణ్యతపై చర్చకు సిద్ధపడాలి. 2) రుణదాత-గ్రహీత ఇరు వురి వైపు నుంచి సానుకూల యోచనతో, అప్పు కట్టలేని స్థితిలో ఉన్న కంపె నీల పెట్టుబడుల నిర్వహణలో మార్పులకైనా సిద్ధపడేలా చర్యలుండాలి. 3) బ్యాలెన్స్ షీట్‌లో సర్దుబాట్లు కాకుండా బ్యాలెన్స్ సర్దుబాటుకు యత్నించాలి. కంపెనీ-కార్పొరేట్ల నిర్వహణ సామర్థ్యాన్ని, సమస్యల్ని ప్రభావితం చేసే పరిష్కారాలకు విధాన నిర్ణేతలు సిద్ధం కావాలి.

బ్యాంకుల విలీనంపైనా సందేహాలు
 విలీన ప్రక్రియ ద్వారా దేశంలోని నలభై, యాభై బ్యాంకుల్ని అయిదారు బ్యాంకులుగా చేయాలనే ప్రతిపాదనకు కార్యాచరణ మొదలైంది. ఎస్బీ హెచ్‌తో సహా ఓ అయిదు బ్యాంకుల్ని ఎస్బీఐలో విలీనం చేసే ప్రక్రియను మొదట చేపట్టారు. ఇది తీవ్ర విమర్శల్నెదుర్కొంటోంది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు లక్ష నుంచి పది లక్షల కోట్ల రూపాయల రుణం అందించే ప్రపంచ స్థాయి  బ్యాంకుల్ని దేశంలో తయారుచేసే క్రమంలో ఇది చేపట్టినట్టు చెబుతున్నారు. ఇదొక సాకు మాత్రమేనని, విలీన ప్రక్రియ వెనుక కార్పొరేట్ శక్తుల దురుద్దేశాలున్నాయని ఉద్యోగ సంఘాల వారు, నిపుణులు పేర్కొంటు న్నారు. విలీనం ద్వారా బ్యాంకుల సామర్థ్యం పెరుగుతుందని, ఫలితంగా సత్వర సేవలతో పాటు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలివ్వగలరనే వాదనా ఉంది.
 మానవ సంబంధాలన్నీ సారంలో ఆర్థిక సంబంధాలే అన్న కారల్ మార్క్స్ భావాల సారంలాగా నేడు ప్రతి మనిషి జీవితంలో అవిభాజ్య భాగ మైన బ్యాంకులు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్దేశిస్తాయి. అంతటి ప్రాముఖ్యత కలిగిన రంగాన్ని సరైన దిశలో నడపాల్సిన బాధ్యత పాలకులదే!


 దిలీప్ రెడ్డి, 'సాక్షి' ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్,
 ఈమెయిల్: dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement