ఎస్బీఐ లాభం డౌన్.. షేరు జూమ్!
♦ క్యూ4లో 66 శాతం తగ్గిన నికర లాభం; రూ.1,264 కోట్లు
♦ ఆదాయం రూ.53,527 కోట్లు; 10 శాతం పెరుగుదల
♦ భారీగా పెరిగిన మొండిబకాయిలు...
♦ స్థూల ఎన్‌పీఏలు 4.25 శాతం నుంచి 6.5 శాతానికి చేరిక
♦ షేరుకి రూ.2.6 చొప్పున డివిడెండ్
♦ 10 శాతం దూసుకెళ్లిన షేరు ధర...
కోల్‌కతా: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)ను మొండిబకాయిలు(ఎన్‌పీఏ) వెంటాడుతూనే ఉన్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2015-16, క్యూ4)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 66 శాతం దిగజారి రూ.1,264 కోట్లకు పడిపోయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,742 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మొండిబకాయిలకు ప్రొవిజనింగ్(కేటాయింపులు) రెట్టింపునకు పైగా ఎగబాకడం లాభాలు దిగజారేందుకు దారితీసింది. ఇక క్యూ4లో మొత్తం ఆదాయం రూ. రూ.48,616 కోట్ల నుంచి రూ.53,527 కోట్లకు పెరిగింది. 10 శాతం వృద్ధి చెందింది.
ఎన్‌పీఏలు ఇలా...: గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు 6.5 శాతానికి పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇవి 4.25 శాతమే. మొత్తం రుణాల్లో విలువ పరంగా చూస్తే... స్థూల ఎన్‌పీఏలు రూ.56,725 కోట్ల నుంచి రూ.98,173 కోట్లకు ఎగబాకాయి. ఇక నికర ఎన్‌పీఏల విషయానికొస్తే... 2.12 శాతం (రూ.27,591 కోట్లు) నుంచి 3.81 శాతానికి (రూ.55,807 కోట్లు) చేరాయి. మొండిబకాయిలకు ప్రొవిజనింగ్ మార్చి క్వార్టర్‌లో రెట్టింపునకు పైగా(144 శాతం) పెరిగి రూ.12,140 కోట్లకు ఎగసింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఈ ప్రొవిజనింగ్ రూ.4,986 కోట్లు మాత్రమే. కాగా, క్యూ4లో కొత్తగా రూ.30 వేల కోట్ల విలువైన రుణాలు మొండిబకాయిలుగా మారినట్లు బ్యాంక్ వెల్లడించింది.
పూర్తి ఏడాదికి చూస్తే...
గడచిన 2015-16 పూర్తి ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎస్‌బీఐ నికర లాభం రూ. 9,951 కోట్లకు తగ్గింది. 2014-15 ఏడాదిలో లాభం రూ.13,102 కోట్లతో పోలిస్తే 24 శాతం క్షీణించింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం రూ.1,74,973 కోట్ల నుంచి రూ. 1,91,844 కోట్లకు ఎగసింది. దాదాపు 10 శాతం వృద్ధి నమోదైంది.
ఇతర ముఖ్యాంశాలివీ...
♦ గత ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై ఎస్‌బీఐ డెరైక్టర్ల బోర్డు రూ.2.60 డివిడెండ్‌ను ప్రకటించింది.
♦ క్యూ4లో నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) 3.27 శాతంగా నమోదైంది.
♦ నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 3.9 శాతం వృద్ధితో రూ.14,712 కోట్ల నుంచి రూ. 15,291 కోట్లకు చేరింది.
♦ వడ్డీయేతర(ఫీజులు ఇతరత్రా) ఆదాయం 25.6 శాతం ఎగబాకి రూ. 10,696 కోట్లకు దూసుకెళ్లింది.
♦ క్యూ4లో రుణ వృద్ధి 13 శాతంగా నమోదైంది. మార్చి నాటికి బ్యాంక్ మొత్తం రుణాలు రూ.15.09 లక్షల కోట్లకు చేరాయి. ఇక డిపాజిట్లు 10 శాతం వృద్ధితో రూ.17.3 లక్షల కోట్లకు పెరిగాయి.
షేరు రయ్...
మొండిబకాయిలు(ఎన్‌పీఏ) భారీగా పెరగడంతోపాటు, లాభాలు దిగజారినప్పటికీ ఎస్‌బీఐ షేరు మాత్రం దూసుకెళ్లింది. శుక్రవారం బీఎస్‌ఈలో బ్యాంక్ షేరు ధర ఒకానొక దశలో 10 శాతం మేర ఎగసి రూ.202 గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 6.5 శాతం లాభంతో రూ.196 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ప్రధాన సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఎస్‌బీఐయే కావడం గమనార్హం. శుక్రవారం ఒక్కరోజే బ్యాంక్ మార్కెట్ విలువ రూ.9,160 కోట్లు ఎగబాకింది. ఇది రూ1,51,801 కోట్లకు చేరింది. ఎస్‌బీఐ లాభం మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఉందని ఏంజెల్ బ్రోకింగ్ సీనియర్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్(బ్యాంకింగ్) సిద్ధార్థ్ పురోహిత్ పేర్కొన్నారు. ఎన్‌పీఏల సమస్యతో ఇతర పీఎస్‌యూ బ్యాంకులన్నీ తీవ్రమైన నష్టాలను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఎస్‌బీఐ మాత్రం లాభాలను కొనసాగిస్తుండడం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దోహదం చేసిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అనుబంధ బ్యాంకుల విలీనానికి రూ. 3,000 కోట్ల వ్యయం..
ఆర్‌బీఐ మొండిబకాయిల సమీక్ష(ఏక్యూఆర్) నిబంధనల కారణంగా మార్చి క్వార్టర్‌లో రూ.9,000 కోట్ల రుణాలను ఎన్‌పీఏలుగా పరిగణించడంతో ప్రొవిజనింగ్ భారీగా పెరిగింది. లాభాలు దిగజారడానికి ఇది కూడా ప్రధాన కారణం. మరోపక్క, రూ.31,000 కోట్ల రుణ ఖాతాలను ప్రత్యేక పరిశీలన జాబితాలో చేర్చాం. ఇందులో విద్యుత్, ఇనుము-ఉక్కు ఇంజనీరింగ్, చమురు-గ్యాస్, నిర్మాణ రంగాలకు చెందిన కంపెనీల ఖాతాలు ఉన్నాయి. ఈ జాబితాలోని రుణాల్లో 70 శాతం మొండిబకాయిలుగా మారే అవకాశం ఉంది.
ఇక గతేడాది క్యూ4లో కొత్తగా ఎన్‌పీఏలుగా మారిన రూ.30 వేల కోట్లలో రూ.1,000 కోట్లు చిన్న మధ్యస్థాయి సంస్థలు(ఎస్‌ఎంఈ), వ్యవసాయ రుణాలకు సంబంధించినవి. మిగతా రూ.29,000 కోట్లు బడా, మధ్యస్థాయి కార్పొరేట్ కంపెనీలవే. అయితే, రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే.. ఎన్‌పీఏలు దిగొస్తాయని భావిస్తున్నాం. ఇక 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్ విలీనం వల్ల ఎస్‌బీఐ నిర్వహణా సామర్థ్యం మెరుగుపడుతుంది. అలాగే నిధుల సమీకరణ భారం కూడా దాదాపు ఒకశాతం మేర తగ్గుతుంది. విలీన ప్రక్రియకు దాదాపు రూ.3,000 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నాం. - అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చైర్‌పర్సన్