ఐసీఐసీఐపై బకాయిల బండ | ICICI Bank's Q4 net falls 76% to Rs 702 cr on exceptional provisioning | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐపై బకాయిల బండ

Published Sat, Apr 30 2016 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

ఐసీఐసీఐపై బకాయిల బండ

ఐసీఐసీఐపై బకాయిల బండ

క్యూ4 నికర లాభం 87% డౌన్; 407 కోట్లు
11 ఏళ్ల కనిష్టస్థాయి ఇది...
ఎన్‌పీఏలకు భారీ ప్రొవిజనింగ్,
కంటింజెన్సీ రిజర్వ్‌కు కేటాయింపుల ప్రభావం
5.82 శాతానికి పెరిగిన స్థూల ఎన్‌పీఏలు
షేరుకి రూ.5 చొప్పున డివిడెండ్...

 ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంకును మొండిబకాయిలు(ఎన్‌పీఏ) వెంటాడుతున్నాయి. గడిచిన దశాబ్దంపై కాలంలో ఎన్నడూలేనంత నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో(2015-16, క్యూ4)లో ఏకంగా 87 శాతం దిగజారి రూ.407 కోట్లకు పడిపోయింది. గడిచిన 11 ఏళ్లలో లాభాలు ఇంత తక్కువ నమోదుచేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతక్రితం ఏడాది ఇదే మార్చి త్రైమాసికంలో లాభం రూ.3,084 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మొండిబకాయిల పెరుగుదలతో కేటాయింపులు(ప్రొవిజనింగ్) అత్యంత భారీగా ఎగబాకడం, రానున్న కాలంలో ఎదురయ్యే ఎన్‌పీఏ రిస్కులను తట్టుకోవడానికి వీలుగా రూ.3,600 కోట్లతో ఒక ప్రత్యేక కంటింజెన్సీ నిధి(రిజర్వ్)ని ఏర్పాటు చేయడం లాభాలు ఘోరంగా పడిపోయేందుకు దారితీసింది.

మొండిబకాయిలపై సమీక్ష(ఏక్యూర్)లో భాగంగా 150 కార్పొరేట్ రుణ ఖాతాలకు సంబంధించి బ్యాంకులన్నీ ప్రొవిజనింగ్‌ను తప్పనిసరిగా చేయాల్సిందేనని ఆర్‌బీఐ గతేడాది చివర్లో ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో అనేక బ్యాంకులు డిసెంబర్, ప్రస్తుత మార్చి క్వార్టర్‌లో వీటికి కేటాయింపులను చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇనుము-ఉక్కు, మైనింగ్, రిగ్గులు, విద్యుత్, సిమెంట్ రంగాల్లో రానున్న కాలంలో ఎన్‌పీపీఏల రిస్కులు ఉండొచ్చన్న కారణంగా కంటింజెన్సీ రిజర్వును నెలకొల్పినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. కాగా, మార్చి క్వార్టర్‌లో కన్సాలిడేటెడ్‌గా బ్యాంక్ మొత్తం ఆదాయం 13% పెరిగి రూ.28,217 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.24,914 కోట్లుగా ఉంది. కాగా, మార్కెట్ వర్గాలు క్యూ4లో నికర లాభం రూ.3,770 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. కంటింజెన్సీ రిజర్వును పరిగణనలోకి తీసుకుంటే లాభం అంచనాల మేరకే ఉందని బ్రోకరేజి సంస్థ ఎంకే గ్లోబల్ అభిప్రాయపడింది.

 స్టాండెలోన్ లాభం 76 శాతం క్షీణత..
ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలను మాత్రమే చూస్తే(స్టాండెలోన్ ప్రాతిపదికన) ఐసీఐసీఐ నికర లాభం క్యూ4లో రూ.702 కోట్లకు దిగజారింది. అంతక్రితం ఏడాది క్యూ4లో లాభం రూ. 2,922 కోట్లతో పోలిస్తే 76 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ.16,235 కోట్ల నుంచి రూ.18,591 కోట్లకు చేరింది. 14.5 శాతం పెరిగింది.

 భారీగా పెరిగిన మొండిబకాయిలు...
మార్చి క్వార్టర్(క్యూ4)లో కొత్తగా రూ.7,000 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారాయని ఐసీఐసీఐ వెల్లడించింది. దీంతో బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు 5.82%కి(రైటాఫ్‌లు పోను రూ.26,211 కోట్లు) ఎగబాకాయి. అంత క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఇవి 3.78%(రూ.15,095 కోట్లు) కాగా, డిసెంబర్ క్వార్టర్‌లో 4.72%(రూ.21,149 కోట్లు)గా ఉన్నాయి. మొండిబకాయిలకు ప్రొవిజనింగ్ రూ.1,345 కోట్ల(అంతక్రితం ఏడాది క్యూ4) నుంచి ఈ క్యూ4లో రూ.3,326 కోట్లకు పెరిగిపోయాయి.

మార్చి క్వార్టర్‌లో కొత్తగా ఎన్‌పీఏలుగా మారిన రూ.7,000 కోట్ల రుణాల్లో 60%మేర  ఆర్‌బీఐ ఏక్యూఆర్ నిబంధనల కారణంగా నమోదైనవేనని బ్యాంక్ పేర్కొంది. రూ.2,700 కోట్లు మాత్రం పునర్‌వ్యవస్థీకరించిన రుణాల నుంచి ఎన్‌పీఏలుగా మారాయని తెలిపింది. కాగా, రూ.8,573 కోట్ల విలువైన పునర్‌వ్యవస్థీకరణ రుణాలు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఇక నికర ఎన్‌పీఏలు కూడా మార్చి క్వార్టర్‌లో 1.61%(రూ.6,256 కోట్లు) నుంచి 2.98%కి(రూ.12,963 కోట్లు) ఎగబాకాయి. గతేడాది డిసెంబర్ క్వార్టర్‌లో ఇవి 2.28%(రూ.9,908 కోట్లు).

 పూర్తి ఏడాదికి చూస్తే...
స్టాండెలోన్‌గా గతేడాది నికర లాభం కూడా 13 శాతం పడిపోయి రూ.11,175 కోట్ల నుంచి రూ.9,726 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.61,267 నుంచి రూ.68,062 కోట్లకు పెరిగింది.

 ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
రూ. 2 ముఖ విలువైన ఒక్కో షేరుకి రూ.5 చొప్పున డివిడెండ్‌ను బ్యాంక్ ప్రకటించింది.

జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 6 శాతం వృద్ధి తో రూ.5,404 కోట్లుగా నమోదైంది.

వడ్డీయేతర ఆదాయం ఏకంగా 46 శాతం ఎగబాకి రూ.5,109 కోట్లకు దూసుకెళ్లింది. మ్యుంగా లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ అనుబంధ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా లభించిన రూ.2,131 కోట్లు దీనికి దోహదం చేసింది.

నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) 3.57% నుంచి 3.37%కి తగ్గింది.

ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర శుక్రవారం బీఎస్‌ఈలో 1.5 శాతం క్షీణించి రూ.237 వద్ద ముగిసింది.

ప్రుడెన్షియల్ లైఫ్ ఐపీఓకి ఓకే..
అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌లో పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా మరింత వాటాను విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం మెజారిటీ వాటానే అట్టిపెట్టుకుంటుంది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, కమోడిటీ ధరల తగ్గుముఖంతోపాటు దేశీయంగా వృద్ధి రికవరీ ఇంకా మందకొడిగానే ఉండటం.. రుణగ్రహీతలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితులు కుదుటపడాలంటే మరికొంతకాలం పట్టొచ్చు. మొండి బకాయిల కుదుపుల నేపథ్యంలో ఈ ఏడాది(2016-17)లో కార్పొరేట్ రుణా ల వృద్ధి 5-7% మాత్రమే ఉండేలా చూసుకుంటున్నాం. ప్రధానంగా రైల్వేలు, రోడ్లు, డిఫెన్స్ వంటి పనితీరు బాగున్న రంగాలపైనే దృష్టిసారిస్తున్నాం. ఇక గతేడాది రిటైల్ రుణాల వృద్ధి 16.4% కాగా, దీన్ని ఈ సంవత్సరంలో 18%కి పెంచుకోనున్నాం.
- చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement