ఆర్థిక వ్యవస్థకు కొత్తరూపు..! | Demonetisation, GST to transform India, NPAs key risk: RBI | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థకు కొత్తరూపు..!

Published Fri, Dec 30 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

ఆర్థిక వ్యవస్థకు కొత్తరూపు..!

ఆర్థిక వ్యవస్థకు కొత్తరూపు..!

ప్రజలు, వృద్ధి రేటుకు కొద్దిగా సమస్యే..
బ్యాంకుల మొండిబకాయిలు ఆందోళనకరం
కార్పొరేట్‌ రంగం పనితీరు మెరుగుపడింది
ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఆర్‌బీఐ వెల్లడి...  


ముంబై: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌), వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమలుతో భారత్‌ ఆర్థిక వ్యవస్థ స్వరూపం మారిపోనుందని రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) పేర్కొంది. అయితే, వీటివల్ల ఆర్థిక వృద్ధి రేటుపై కొంత ప్రతికూల ప్రభావంతోపాటు ప్రజలకు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయని అభిప్రాయపడింది. మరోపక్క, బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండిబకాయిల(ఎన్‌పీఏ)పై ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం విడుదల చేసిన 14వ ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఎఫ్‌ఎస్‌ఆర్‌)లో ఆర్‌బీఐ ఈ కీలక అంశాలను ప్రస్తావించింది. దీంతోపాటు 2015–16 ఏడాదికిగాను భారత బ్యాంకింగ్‌ రంగంలో నెలకొన్న ధోరణి, ప్రగతిపై కూడా నివేదిక(ఆర్‌టీపీ)ను విడుదల చేసింది.

బ్యాంకులకు ఎన్‌పీఏల దెబ్బ...
ప్రస్తుత 2016–17 ఆర్థిక సంవత్సరంలో దేశ కార్పొరేట్‌ రంగం పనితీరు మెరుగుపడిందని.. కానీ, టర్నోవర్‌ తగ్గుముఖం రిస్క్‌ మాత్రం నెలకొందని ఆర్‌బీఐ పేర్కొంది. బడా కార్పొరేట్‌ కంపెనీల కారణంగానే మొండిబకాయిలు తీవ్రంగా పెరిగిపోయినట్లు కూడా వెల్లడించింది. ‘ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే... ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల వ్యాపార వృద్ధి మందకొడిగానే కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థ నష్టాల్లోకి జారిపోయింది. మార్చి–సెప్టెంబర్‌ మధ్య బ్యాంకుల మొండిబకాయిలు మరింత పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణం. బ్యాంకుల మొత్తం స్థూల ఎన్‌పీఏలు ఈ ఏడాది మార్చి నాటికి 7.8 శాతంగా ఉంటే.. సెప్టెంబర్‌కల్లా ఇవి 9.1 శాతానికి ఎగబాకాయి. దీంతో పునర్‌వ్యవస్థీకరించిన రుణాలతో సహా మొత్తం ఎన్‌పీఏలు 11.5 శాతం నుంచి 12.3 శాతానికి చేరాయి. బ్యాంకింగ్‌ రంగం ప్రధానంగా పీఎస్‌బీలు తీవ్రమైన ప్రతికూలతలను ఎదుర్కొంటున్నప్పటికీ దేశ ఫైనాన్షియల్‌ వ్యవస్థ మాత్రం ఇప్పటికీ స్థిరంగానే ఉంది. స్థూల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు మరింత ఎగబాకవచ్చన్న సంకేతాలు కనబడుతున్నాయి’ అని నివేదిక తెలిపింది.

2018 మార్చికల్లా ఎన్‌పీఏలు 10 శాతం పైకి...
వచ్చే ఏడాది మార్చినాటికి స్థూల ఎన్‌పీఏలు 9.8 శాతానికి పెరిగిపోవచ్చని.. ఇక 2018 మార్చికల్లా 10.1%కి కూడా చేరొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. పీఎస్‌బీల మొండిబకాయిలు మరింత పేరుకుపోతాయని కూడా తెలిపింది. ‘మార్చికల్లా ప్రభుత్వ బ్యాంకుల మొత్తం స్థూల ఎన్‌పీఏలు 12.5%కి చేరవచ్చు. 2018 మార్చినాటికి ఇవి 12.9 శాతానికి ఎగబాకే అవకాశం ఉంది. తీవ్రమైన ఆర్థిక ప్రతికూలతలు నెలకొంటే ఈ పరిమాణం మరింతగా పెరిగిపోవచ్చు’ కూడా అని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. రియల్టీ రంగానికి నియంత్రణ సంస్థ ఏర్పాటు తర్వాత ఈ రంగంలో స్పెక్యులేటివ్‌ కార్యకలాపాలు భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని.. దీనివల్ల గృహ రుణ సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని కూడా ఆర్‌బీఐ పేర్కొంది. డీమోనిటైజేషన్‌ కారణంగా ఇప్పటికే రియల్టీ రంగం దెబ్బతిందంటూ పరిశ్రమ వర్గాలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే.

ఆర్‌టీపీలో ఏం చెప్పిందంటే...
తీవ్రమైన మొండిబకాయిలతో కేటాయింపులు(ప్రొవిజనింగ్‌) పెరగడం, రుణ వృద్ధి పడిపోవడంతో 2015–16 ఆర్థిక సంవత్సరంలో దేశీ బ్యాంకింగ్‌ రంగం తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంది. అయితే, రిటైల్‌ రుణ విభాగంలో మాత్రం రెండంకెల వృద్ధి నమోదైంది. అదేవిధంగా గతేడాది బ్యాంకుల వడ్డీ రాబడులు, వడ్డీయేతర ఆదాయాలు తీవ్రంగా దిగజారాయి. దీనివల్ల మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థ నికర లాభాలు 60 శాతంపైగా ఆవిరైపోయాయి.

విదేశీ ప్రతికూలతలు...
అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ప్రభావంతో మన వాణిజ్య వృద్ధి మందగించవచ్చని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. దీనివల్ల కరెంట్‌ అకౌంట్‌ లోటు(క్యాడ్‌) పెరిగే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ‘రెమిటెన్సుల(ప్రవాసీయుల నుంచి దేశంలోకి వచ్చే నిధులు) ప్రవాహం దిగజారుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో మన ఎగుమతులతో పోలిస్తే.. దిగుమతులు భారీగా పెరిగే అవకాశం కనబడుతోంది. అదేవిధంగా దేశం నుంచి విదేశీ నిధులు వెనక్కిపోవచ్చని భావిస్తున్నాం. రూపాయి విలువపై ఇది ప్రతికూల ప్రభావం చూపవచ్చు’ అని నివేదికలో అంచనా వేసింది.

ఎంఎస్‌ఎంఈలకు ఊరట...
నోట్ల రద్దు కారణంగా తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు ఆర్‌బీఐ ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు తమ బోర్డుల ఆమోదం మేరకు ఎంఎస్‌ఎంఈ రుణగ్రహీతలకు అదనపు వర్కింగ్‌ క్యాపిటల్‌ పరిమితిని అమలు చేయవచ్చని పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే, ఈ అదనపు రుణ కల్పన అనేది వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఒక్కసారి మాత్రమే అందించేందుకు ఆస్కారం ఉంటుందని, ఆతర్వాత తాజా వర్కింగ్‌ క్యాపిటల్‌ విషయంలో సాధారణ నిబంధనలనే పాటించాలని పేర్కొంది.

భవిష్యత్తులో గణనీయమైన మార్పులు...
డీమోనిటైజేషన్‌ ప్రభావంతో డిజిటల్‌ రూపంలో చెల్లింపులు భారీగా పెరగనున్నాయి. దీనివల్ల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రజలకు మరిన్ని రుణాలు అందుబాటులోకి వస్తాయి. మొత్తంమీద రానున్న కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రజలకు ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థలోని కొన్ని రంగాలకు స్వల్పకాలికంగా విఘాతం ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఫైనాన్షియల్‌ మార్కెట్లలో తలెత్తే ఒడిదుడుకులను తగినవిధంగా ఎదుర్కొనేలా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. జీఎస్‌టీ, దివాలా చట్టం అమలుతో ఆర్థిక వ్యవస్థపై మొండిబకాయిల ఒత్తిడి తగ్గుతుంది. ద్రవ్యోల్బణం దిగిరావడంతో స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి. వృద్ధి రేటు తాజాగా కాస్త తడబాటుకు గురవుతోంది. దేశీ బ్యాంకింగ్‌ రంగంలో నెలకొన్న మొండిబకాయిల ఒత్తిడికి కొంతమేరకు గత పరిణామాలే కారణం. అయితే, పారదర్శకత పెంపునకు చేపట్టిన చర్యలతో దేశ ఫైనాన్షియల్‌ వ్యవస్థ మళ్లీ పునరుత్తేజం చెందేందుకు దోహదం చేసింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు పెరుగుతున్నాయి. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు, కమోడిటీ ధరల పెరుగుదలతో వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థల్లో రిస్కులను పెంచుతోంది.
– ఎఫ్‌ఎస్‌ఆర్‌ నివేదిక ముందుమాటలో ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌

నల్లధనం కట్టడిపై...
నల్లధనాన్ని అరికట్టాలంటే కఠినమైన జరిమానాలు, ఆమోదయోగ్యమైన పన్నుల విధానాలను అమలు చేయడమే అత్యుత్తమ మార్గమని ఆర్‌బీఐ పేర్కొంది. అదేవిధంగా పాలనను మెరుగుపరచడం, పౌర సేవల నాణ్యతను పెంచడంతో పాటు నియంత్రణల మోతాదును తగ్గించడం కూడా చాలా ముఖ్యమని అభిప్రాయపడింది. ఇందుకు ఉదాహరణను కూడా ప్రస్తావించింది. అమెరికాలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను ఒక శాతం పెంచడం వల్ల వ్యవస్థలో నల్లధనం 1.4% మేర ఎగబాకేందుకు దారితీసిందని తెలిపింది. అదేవిధంగా నియంత్రణ సూచీలో ఒక శాతం పెరుగుదలతో నల్లధనం 10% పెరిగిపోవచ్చని వివరించింది. అమెరికా ఉదాహరణనే పేర్కొంటూ... ‘పన్ను ఆదాయాలు తగ్గిపోవడంవల్ల ప్రభుత్వాలు పన్ను రేట్లను పెంచేందుకు పురిగొల్పుతుంది.

దీనివల్ల నల్లధనం అనేది మరింత పోగుపడేందుకు దారితీస్తుంది. అయితే, ప్రత్యక్ష పన్ను ఆదాయాలపై బ్లాక్‌ మనీ ప్రభావం ఆందోళనరమే. కానీ, పరోక్ష పన్నులు, ఆర్థిక వృద్ధికి తోడ్పాటులో దీని పాత్ర చర్చనీయాంశం. ఓఈసీడీ నివేదిక ప్రకారం చూస్తే.. షాడో ఎకానమీ(ఆర్థిక వ్యవస్థలో నల్లధనం లేదా సమాంతర ఆర్థిక వ్యవస్థ) అనేది సవాలే అయినప్పటికీ ప్రపంచంలోని సగం మంది కార్మికులు దీనిద్వారానే ఉపాధి పొందుతుండటం గమనార్హం. విదేశీ పాలసీ మ్యాగజీన్‌లోని ఒక కథనంలో ప్రపంచ బ్లాక్‌ మనీ మార్కెట్‌ విలువ దాదాపు 10 ట్రిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ(మొదటిది అమెరికా)గా దీన్ని పేర్కొనవచ్చు. అంతేకాదు ఇది వేగంగా వృద్ధి చెందుతోంది కూడా’ అని వివరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement