బ్యాంకుల్లో ఆడిటర్ల నియామకం తీరు మారాలి | Image for the news result ICAI says banks selecting own auditors behind NPA mess | Sakshi
Sakshi News home page

బ్యాంకుల్లో ఆడిటర్ల నియామకం తీరు మారాలి

Published Thu, Feb 18 2016 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

బ్యాంకుల్లో ఆడిటర్ల నియామకం తీరు మారాలి

బ్యాంకుల్లో ఆడిటర్ల నియామకం తీరు మారాలి

మొండిబకాయిల పెరుగుదలకు ప్రస్తుత ప్రక్రియ కూడా కారణమే
సీఏ సిలబస్‌లో మార్పులు;
తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని కేంద్రాలు
ఐసీఏఐ ప్రెసిడెంట్ ఎం దేవరాజ రెడ్డి

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆడిటర్ల నియామకాల ప్రక్రియ మారటం కూడా నిరర్థక ఆస్తుల(ఎన్‌పీఏ) పెరుగుదలకు పరోక్షంగా కొంత కారణమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కొత్త ప్రెసిడెంట్ ఎం.దేవరాజ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో బ్యాంకుల స్థాయిలను బట్టి రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఆడిటర్లను పంపేదని, ఇపుడైతే నియామకాల ప్రక్రియను బ్యాంకుల చీఫ్‌లకే అప్పజెప్పిందని ఆయన గుర్తు చేశారు. ‘‘దీనివల్ల ఆయా బ్యాంకులు మెరుగైన పనితీరు కనపర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా తమకు అనుకూలంగా ఉండే ఆడిటర్లను నియమించుకోవటం జరుగుతోంది. పెపైచ్చు అయిదారుగురు అవసరమైన చోట ఇద్దరు ముగ్గురినే తీసుకోవ డం, వారిక్కూడా అంతగా అవగాహన లేకపోవడం వంటి సందర్భాలు చాలా ఉన్నాయి.

ఇవన్నీ ఎన్‌పీఏల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయనే చెప్పాలి’’ అని దేవరాజ రెడ్డి వివరించారు. ఐసీఏఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం బుధవారమిక్కడ తొలిసారి విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అటు అధిక వ్యాపారం ఉండే దాదాపు 20 శాతం శాఖల్లోనే ఆడిటింగ్ జరుగుతోందని, దీని వల్ల పూర్తి స్వరూపంపై అవగాహన లభించడం లేదని ఆయన చెప్పారు. ‘‘అందుకే మళ్లీ మొత్తం ఆడిటర్ల నియామకాల్ని రిజర్వు బ్యాంకే తీసుకోవాలంటూ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు’’ అని తెలియజేశారు. ద్రవ్య విధానాలు, పన్ను చట్టాలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించి ప్రీ బడ్జెట్ మెమోరాండంను కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించినట్లు తెలిపారు.

 ఏప్రిల్ నుంచి కొత్త ప్రమాణాలు..
 ప్రైవేట్ రంగం తరహాలో ప్రభుత్వ విభాగాలు ఛార్టర్డ్ అకౌంటెంట్ల సేవల్ని వినియోగించుకోవటం లేదని దేవరాజ రెడ్డి చెప్పారు. డబుల్ అకౌంటింగ్ విధానం సహా కొన్ని అంశాలపై సిబ్బందికి అంతగా అవగాహన లేకపోవడం కూడా దీనికి కొంత కారణం కావొచ్చన్నారు. సీఏల సేవలను సక్రమంగా వినియోగించుకుంటే.. డిఫెన్స్ తదితర రంగాల్లో వనరులను సమర్థంగా ఉపయోగించుకోవచ్చన్నారు. ‘‘బడ్జెటింగ్ తదితర అంశాలపై భారతీయ రైల్వేస్‌కు సేవలందిస్తున్నాం. కొత్త అకౌంటింగ్ ప్రమాణాల (ఇండ్ ఏఎస్) అమలుకు కూడా సీఏలు సర్వసన్నద్ధంగా ఉన్నారు. రూ. 500 కోట్ల పైచిలుకు టర్నోవరున్న కంపెనీలకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి, బీమా.. బ్యాంకింగ్ రంగాలకు మాత్రం 2018 నుంచి ఈ ప్రమాణాలు అమలు కానున్నాయి’’ అని ఆయన తెలియజేశారు.

 తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ ..
 రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరింత మంది విద్యార్థులకు సీఏ చదువును అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పారు. ‘‘ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న కేంద్రాన్ని దాదాపు రూ.30 కోట్లతో విస్తరించేందుకు 3-4 ఎకరాలు కావాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగాం. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నీ కోరాం. అనంతపురం, కర్నూలు, తిరుపతి, ఒంగోలు, ఏలూరు తదితర ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒకో కేంద్రానికి రూ.3 కోట్లు ఖర్చవుతుంది. వీటికి స్థలం ప్రభుత్వాన్ని అడిగాం. ప్రభుత్వం నిర్దేశించిన రేటుకే స్థలం కొంటాం’’ అని వివరించారు. కొత్త పరిణామాలకు అనుగుణంగా సీఏ కోర్సు పాఠ్యాంశాల్లోనూ పలు మార్పులు ప్రతిపాదించామని, ఇవి ఈ ఏడాది నవంబరు లేదా వచ్చే ఏడాది మే నుంచి ప్రవేశపెట్టే అవకాశముందని దేవరాజ రెడ్డి వెల్లడించారు. అలాగే, ఫౌండేషన్ స్థాయికి ఇంటర్మీడియెట్ ప్రాథమిక అర్హతగా మార్చామని చెప్పారు. ప్రస్తుతం ఐసీఏఐకి దేశవ్యాప్తంగా 153 శాఖలు, సుమారు 2.5 లక్షల మంది సభ్యులు, 8.75 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.
 
 మోసాల కట్టడి చర్యలను ఆడిటర్లు సమీక్షించాలి: ఐసీఏఐ
 న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థలో రూ.కోటి పైగా అవకతవకలు జరిగాయని సందేహాలు వ్యక్తమైతే వాటి పరిష్కారానికి సదరు సంస్థ తీసుకున్న చర్యలను వాటి ఆడిటర్లు సమీక్షించాలని ఐసీఏఐ సూచించింది. ‘‘ఆ సదరు చర్యలతో సంతృప్తి చెందకపోతే దానికి గల కారణాలను లిఖితపూర్వకంగా కంపెనీ యాజమాన్యానికి తెలపాలి. ఆ తరవాత 45 రోజుల్లో కంపెనీ సరైన చర్యలు తీసుకోకపోతే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలో లేదో పరిశీలించాలి’’ అని పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement