State-owned bank
-
ప్రాధాన్యేతర వ్యాపారాల నుంచి వైదొలగండి
ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచన న్యూఢిల్లీ: నిధుల సమీకరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రాధాన్యేతర ఆస్తులను గుర్తించి వాటిని సమయానుకూలంగా విక్రయించడంపై దృష్టి సారించాలని ఆర్థిక శాఖ సూచించింది. కొన్ని బ్యాంకులు ఇప్పటికే ఈ పనిని మొదలు పెట్టగా, మరికొన్ని అందుకు సన్నద్ధం అవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల తమకు అవసరమైన అదనపు మూలధన అవసరాలను తీర్చుకోవడంతోపాటు కీలక వ్యాపారంపై తమ దృష్టిని మరింతగా నిలిపేందుకు వీలు చిక్కుతుందని పేర్కొన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో చాలా వాటికి బీమా విభాగాలు, క్యాపిటల్ అడ్వైజరీ విభాగాలు, స్టాక్ ఎక్సే్యంజ్లలో వాటాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎస్బీఐకి ఎన్ఎస్ఈ, యూటీఐ, ఏఆర్‌సీఐఎల్ వంటి పలు కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ఎస్బీఐ ఇప్పటికే జీవిత బీమా సహా పలు సబ్సిడరీల్లో వాటాల తగ్గింపునకు సంసిద్ధత వ్యక్తం చేసింది. గత నెలలో ఐడీబీఐ బ్యాంకు బోర్డు సైతం మూలధనాన్ని పెంచుకునేందుకు వీలుగా అప్రాధాన్య వ్యాపారాల్లో వాటాలు తగ్గించుకోవాలని నిర్ణయించింది. -
బ్యాంకు విలీనాలకు వేళాయెనా..!
♦ విలీన ప్రక్రియపై కేంద్రం కసరత్తు షురూ ♦ ఏ బ్యాంకును ఎందులో కలపాలనే బాధ్యత బ్యాంక్స్ బోర్డ్‌కు; ♦ సెప్టెంబర్ నాటికి స్పష్టత వస్తుందంటున్న బ్యాంకు ఉన్నతాధికారులు ♦ ఉద్యోగులకు షేర్లను కేటాయించడం ద్వారా బుజ్జగింపులు ♦ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్ విలీనమంటూ ప్రచారం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్నో ఏళ్లుగా కేవలం చర్చలకే పరిమితమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమయ్యింది. ఇందుకోసం వినోద్‌రాయ్ నేతృత్వంలో తాజాగా బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) కూడా సమావేశమయ్యింది. త్వరలోనే విలీన కార్యాచరణకు సంబంధించి బీబీబీ ఒక రోడ్ మ్యాప్‌ను ప్రభుత్వానికి సమర్పించనుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. ఇప్పుడున్న 27 ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి... 6 నుంచి 10 బ్యాంకులుగా మార్చవచ్చని విశ్వసనీయంగా తెలుస్తోంది. మొండి బకాయిల పుణ్యమా అని అత్యధిక బ్యాంకులు నష్టాల్లోకి జారుకోవడం, లోక్‌సభలో అధికార పార్టీ పూర్తిస్థాయి మెజారిటీలో ఉండటంతో బ్యాంకుల విలీనానికి ఇదే సరైన తరుణమని, ఇప్పుడు కాకపోతే ఇక ఇది ఎప్పటికీ సాధ్యం కాదన్న ఆలోచనలో కేంద్ర ఆర్థిక శాఖ ఉంది. ఈ మధ్యనే బ్యాంకు ఉన్నతాధికారులతో జరిగిన ‘జ్ఞాన్ సంగమ్’ సమావేశంలో బ్యాంకు విలీనాలపైనే ప్రధానంగా చర్చించారు. ఏ బ్యాంకును ఎందులో విలీనం చేస్తే బాగుంటుందనే విషయాన్ని అధ్యయనం చేసి బీబీబీ ఒక నివేదిక ఇస్తుంది. నాల్గవ త్రైమాసిక ఫలితాల తర్వాత బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై ఒక అంచనా వస్తుందని, దీని ప్రకారం ఎన్ని బ్యాంకులు మిగులుతాయనే దానిపై స్పష్టత వస్తుందని ఈ విషయాలతో నేరుగా సంబంధం ఉన్న అధికారి ఒకరు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. అంతేకాదు... విలీనాలను వ్యతిరేకిస్తున్న బ్యాంకు యూనియన్లను ప్రసన్నం చేసుకోవటానికి కూడా ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలీనాలపై యూనియన్ల అభిప్రాయాన్ని అడిగినట్లు ఈ సమావేశంలో పాల్గొన్న యూనియన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘‘విలీనాల వల్ల ఉద్యోగుల తొలగింపు ఉండదని, విలీనాల తర్వాత కూడా ప్రభుత్వానికే మెజార్టీ వాటా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే భారీగా మొండి బకాయిలున్న ఐడీబీఐ బ్యాంక్‌ను మాత్రం ప్రైవేటీకరించనున్నట్లు ఆయన సూచనప్రాయంగా చెప్పారు’’ అని సదరు ప్రతినిధి వెల్లడించారు. మొండి బకాయిల సాకు..: నిజానికి ‘బ్యాలెన్స్ షీట్ క్లీన్ అప్’ పేరిట పీఎస్‌యూ బ్యాంకుల చేత తప్పనిసరిగా ఎన్పీఏలను ప్రకటింప చేయడం వెనుక కూడా విలీనాల ఎజెండా ఉందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. ‘‘బలహీన బ్యాంకులుగా ముద్ర వేసి డిపాజిట్‌దారులు, ఉద్యోగుల రక్షణకు విలీనమే శరణ్యమని చెప్పటమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. లేకపోతే మొన్నటి వరకు ప్రభుత్వానికి భారీ డివిడెండ్లు ఇచ్చిన బ్యాంకులు ఒక్కసారిగా నష్టాల్లోకి జారడమేంటి?’’ అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గత త్రైమాసికంలో 27 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నాలుగైదు తప్ప మిగిలినవన్నీ నష్టాలే ప్రకటించాయి. మార్చి 2015 నాటికి పీఎస్‌యూ బ్యాంకుల ఎన్పీఏలు 5.43 శాతంగా ఉంటే అదే ఏడాది డిసెంబర్ నాటికి 7.30%కి పెరిగిపోయాయి. వీటి విలువైతే రూ. 4.3 లక్షల కోట్లు. ఈ ఎన్పీఏల దెబ్బకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అలహాబాద్ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఎన్పీఏలు భారీగా పెరిగిపోవడంతో బ్యాంకులు నడవడానికి వచ్చే మూడేళ్లలో కనీసం రూ.1.80 లక్షల కోట్ల మూలధనం కావాలని అంచనా. కానీ వచ్చే ఏడాదికి బడ్జెట్లో కేటాయించింది రూ. 25,000 కోట్లే. అదనపు నిధులివ్వలేమనే సాకుతో బలమైన బ్యాంకుల్లో బలహీనమైనవి విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఉద్యోగులకు షేర్ల ఎర... విలీనాలపై ఉద్యోగుల్లో మునుపటంత వ్యతిరేకత లేదు. దీన్ని తగ్గించడానికి ఆర్థికశాఖ... ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమన్న హామీని గట్టిగానే వినిపిస్తోంది. దీంతోపాటు ఉద్యోగులకు ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ (ఈసాప్స్) కింద బ్యాంకు షేర్లను జారీ చేయనున్నట్లు కూడా ఆర్థికమంత్రి చెప్పారు. 27 పీఎస్‌యూ బ్యాంకుల్లో సుమారు 8 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీలీనాలతో ప్రమోషన్లు, సర్వీస్ లెక్కలు వంటి చిన్న చిన్న సమస్యలుంటాయని, వాటిని ఈజీగానే పరిష్కరించుకుంటామని యూనియన్ల నాయకులు చెబుతున్నారు. మరోవంక విలీనాలపై ఆర్థికశాఖ నుంచి లీకులు కూడా వెలువడుతున్నాయి. 27 బ్యాంకుల్ని 6 బ్యాంకులుగా కుదిస్తారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎస్బీఐ అనుబంధ బ్యాంకులన్నీ చట్ట సవరణ ద్వారా ఒకేసారి విలీనం చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే అనుబంధ బ్యాంకుల విలీనంపై ఇంతవరకు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభం కాలేదని, సెప్టెంబర్ తర్వాత దీనిపై స్పష్టత రావచ్చని ఎస్బీహెచ్ ఎండీ శాంతను ముఖర్జీ చెప్పారు. విలీనం వల్ల లాభమా నష్టమా అనేది నిర్వహణ సామర్థ్యాన్ని బట్టి భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. -
బ్యాంకుల్లో ఆడిటర్ల నియామకం తీరు మారాలి
మొండిబకాయిల పెరుగుదలకు ప్రస్తుత ప్రక్రియ కూడా కారణమే ♦ సీఏ సిలబస్‌లో మార్పులు; ♦ తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని కేంద్రాలు ♦ ఐసీఏఐ ప్రెసిడెంట్ ఎం దేవరాజ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆడిటర్ల నియామకాల ప్రక్రియ మారటం కూడా నిరర్థక ఆస్తుల(ఎన్పీఏ) పెరుగుదలకు పరోక్షంగా కొంత కారణమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కొత్త ప్రెసిడెంట్ ఎం.దేవరాజ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో బ్యాంకుల స్థాయిలను బట్టి రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఆడిటర్లను పంపేదని, ఇపుడైతే నియామకాల ప్రక్రియను బ్యాంకుల చీఫ్లకే అప్పజెప్పిందని ఆయన గుర్తు చేశారు. ‘‘దీనివల్ల ఆయా బ్యాంకులు మెరుగైన పనితీరు కనపర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా తమకు అనుకూలంగా ఉండే ఆడిటర్లను నియమించుకోవటం జరుగుతోంది. పెపైచ్చు అయిదారుగురు అవసరమైన చోట ఇద్దరు ముగ్గురినే తీసుకోవ డం, వారిక్కూడా అంతగా అవగాహన లేకపోవడం వంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎన్పీఏల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయనే చెప్పాలి’’ అని దేవరాజ రెడ్డి వివరించారు. ఐసీఏఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం బుధవారమిక్కడ తొలిసారి విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అటు అధిక వ్యాపారం ఉండే దాదాపు 20 శాతం శాఖల్లోనే ఆడిటింగ్ జరుగుతోందని, దీని వల్ల పూర్తి స్వరూపంపై అవగాహన లభించడం లేదని ఆయన చెప్పారు. ‘‘అందుకే మళ్లీ మొత్తం ఆడిటర్ల నియామకాల్ని రిజర్వు బ్యాంకే తీసుకోవాలంటూ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు’’ అని తెలియజేశారు. ద్రవ్య విధానాలు, పన్ను చట్టాలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించి ప్రీ బడ్జెట్ మెమోరాండంను కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించినట్లు తెలిపారు. ఏప్రిల్ నుంచి కొత్త ప్రమాణాలు.. ప్రైవేట్ రంగం తరహాలో ప్రభుత్వ విభాగాలు ఛార్టర్డ్ అకౌంటెంట్ల సేవల్ని వినియోగించుకోవటం లేదని దేవరాజ రెడ్డి చెప్పారు. డబుల్ అకౌంటింగ్ విధానం సహా కొన్ని అంశాలపై సిబ్బందికి అంతగా అవగాహన లేకపోవడం కూడా దీనికి కొంత కారణం కావొచ్చన్నారు. సీఏల సేవలను సక్రమంగా వినియోగించుకుంటే.. డిఫెన్స్ తదితర రంగాల్లో వనరులను సమర్థంగా ఉపయోగించుకోవచ్చన్నారు. ‘‘బడ్జెటింగ్ తదితర అంశాలపై భారతీయ రైల్వేస్‌కు సేవలందిస్తున్నాం. కొత్త అకౌంటింగ్ ప్రమాణాల (ఇండ్ ఏఎస్) అమలుకు కూడా సీఏలు సర్వసన్నద్ధంగా ఉన్నారు. రూ. 500 కోట్ల పైచిలుకు టర్నోవరున్న కంపెనీలకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి, బీమా.. బ్యాంకింగ్ రంగాలకు మాత్రం 2018 నుంచి ఈ ప్రమాణాలు అమలు కానున్నాయి’’ అని ఆయన తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ .. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరింత మంది విద్యార్థులకు సీఏ చదువును అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పారు. ‘‘ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న కేంద్రాన్ని దాదాపు రూ.30 కోట్లతో విస్తరించేందుకు 3-4 ఎకరాలు కావాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగాం. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నీ కోరాం. అనంతపురం, కర్నూలు, తిరుపతి, ఒంగోలు, ఏలూరు తదితర ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒకో కేంద్రానికి రూ.3 కోట్లు ఖర్చవుతుంది. వీటికి స్థలం ప్రభుత్వాన్ని అడిగాం. ప్రభుత్వం నిర్దేశించిన రేటుకే స్థలం కొంటాం’’ అని వివరించారు. కొత్త పరిణామాలకు అనుగుణంగా సీఏ కోర్సు పాఠ్యాంశాల్లోనూ పలు మార్పులు ప్రతిపాదించామని, ఇవి ఈ ఏడాది నవంబరు లేదా వచ్చే ఏడాది మే నుంచి ప్రవేశపెట్టే అవకాశముందని దేవరాజ రెడ్డి వెల్లడించారు. అలాగే, ఫౌండేషన్ స్థాయికి ఇంటర్మీడియెట్ ప్రాథమిక అర్హతగా మార్చామని చెప్పారు. ప్రస్తుతం ఐసీఏఐకి దేశవ్యాప్తంగా 153 శాఖలు, సుమారు 2.5 లక్షల మంది సభ్యులు, 8.75 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మోసాల కట్టడి చర్యలను ఆడిటర్లు సమీక్షించాలి: ఐసీఏఐ న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థలో రూ.కోటి పైగా అవకతవకలు జరిగాయని సందేహాలు వ్యక్తమైతే వాటి పరిష్కారానికి సదరు సంస్థ తీసుకున్న చర్యలను వాటి ఆడిటర్లు సమీక్షించాలని ఐసీఏఐ సూచించింది. ‘‘ఆ సదరు చర్యలతో సంతృప్తి చెందకపోతే దానికి గల కారణాలను లిఖితపూర్వకంగా కంపెనీ యాజమాన్యానికి తెలపాలి. ఆ తరవాత 45 రోజుల్లో కంపెనీ సరైన చర్యలు తీసుకోకపోతే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలో లేదో పరిశీలించాలి’’ అని పేర్కొంది. -
ప్రభుత్వ బ్యాంకుల్లోకి విదేశీ నిధులు?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఇది 20 శాతంగా ఉంది. దీన్ని 49 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. బ్యాంకులకు భారీగా మూలధనం అవసరమైన నేపథ్యంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ కసరత్తు చేస్తోందని సమాచారం. బడ్జెట్లో దీనిపై ప్రకటన చేసే అవకాశముంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఆ మేరకు చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రయివేటు బ్యాంకుల్లో ఎఫ్ఐఐలు, ఎఫ్‌పీఐలు, క్యూఫ్ఐల పెట్టుబడి పరిమితిని 49 శాతం నుంచి గతేడాది 74 శాతానికి పెంచారు. యాజమాన్య నియంత్రణలో మాత్రం మార్పులు చేయలేదు. -
బ్యాంకుల్లో కొలువుల జాతర!
- ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండేళ్లలో 80,000 మంది పదవీ విరమణ.. - ఖాళీల భర్తీకి చకచకా సన్నాహాలు న్యూఢిల్లీ: బ్యాంకుల్లో భారీస్థాయి కొలువుల జాతరకు తెరలేస్తోంది. అగ్రగామి ఎస్బీఐతో పాటు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)ల్లో రెండేళ్లలో దాదాపు 80,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనుండటమే దీనికి కారణం. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో(2015-16, 2015-17) మొత్తం అన్ని కేడర్లలో కలిపి 78,800 మంది రిటైర్ అవ్వనున్నారనేది అధికారిక వర్గాల అంచనా. ఈ ఒక్క ఏడాదే 39,756 మంది పదవీ విరమణ చేస్తుండటం గమనార్హం. ఇందులో 19,065 మంది ఆఫీసర్లు, 14,669 మంది క్లర్కులతో పాటు 6,022 మంది ఇతర సిబ్బంది ఉన్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది రిటైరయ్యే వారి సంఖ్య సుమారు 39,000. ఇందులో 18,506 మంది ఆఫీసర్లు, 14,458 మంది క్లర్కులు ఉన్నారు. దీంతో బ్యాంకుల్లో నియామకాల సందడి జోరందుకోనుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తమ బ్యాంకులో 8,674 మంది సిబ్బంది రిటైర్ కానున్నట్లు ఇటీవలే ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. దీంతో మార్చిలోపు 2,000 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలిపారు. మరోపక్క, ప్రభుత్వ బ్యాంకులకు మరింత చేయూతనిచ్చేవిధంగా పెద్దమొత్తంలో మూలధనం సమకూర్చడం, హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు వంటి ఏడు అంశాలతో ‘ఇంధ్రధనుష్’ ప్రణాళికను కేంద్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకుల విస్తరణ కూడా వేగం పుంజుకోనుంది. వెరసి పీఎస్బీల్లో కొత్త ఉద్యోగాలు వెల్లువెత్తేందుకు దోహదం చేయనుందని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భర్తీల్లో స్వేచ్ఛ..! మధ్యస్థాయి ఉద్యోగాల్లో భారీగా పోస్టులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో నియామకాల్లో బ్యాంకులకు కొంత స్వేచ్ఛను ఇచ్చే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీస్తోంది. ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో కూడా సిబ్బందిని నియమించుకోవడానికి అవకాశం ఉంది. దేశంలో మొత్తం 22 ప్రభుత్వ రంగ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఎస్బీఐకి ఉన్న 5 అనుబంధ బ్యాంకులు వీటికి అదనం. కాగా, బ్యాంకులు తమ వ్యాపార వృద్ధి, రిటైర్మెంట్లు, సిబ్బంది అవసరాలు ఇతరత్రా అంశాల ఆధారంగా ఖాళీలను భర్తీ చేసుకుంటూ వస్తున్నాయి. క్యాంపస్ నియామకాలపై బ్యాంకులు చాలా ఆసక్తిగానే ఉన్నాయని, అయితే, న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇప్పటికిప్పుడు దీనికి అవకాశాల్లేవని ఇటీవలే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ అడ్డంకులకు పరిష్కార మార్గాలపై దృష్టిసారించనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. చీఫ్ పోస్టుల్లో ప్రైవేటు రంగ నిపుణులకు బ్రేక్.. పీఎస్బీల్లో ఎండీ, సీఈఓ పోస్టులకు మరింత మంది ప్రైవేటు రంగ నిపుణులను నియమించుకునే అవకాశాల్లేవని ఫైనాన్షియల్ సేవల విభాగాల కార్యదర్శి హస్ముఖ్ అధియా పేర్కొన్నారు. ఇకపై పీఎస్బీల్లో చీఫ్‌ల నియామకానికి నిపుణులైన ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లనే పరిగణనలోకి తీసుకుంటామని కూడా ఆయన వెల్లడించారు. ఇటీవల ఐదు పీఎస్బీల్లో కొత్త చీఫ్‌లను కేంద్రం నియమించగా.. తొలిసారిగా అందులో ఇద్దరు ప్రైవేటు రంగానికి చెందిన నిపుణులకు చోటిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో వీబీహెచ్సీ వేల్యూ హోమ్స్ సీఈఓ పీఎస్ జయకుమార్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్‌గా నియమించగా... ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ సీఈఓ రాకేశ్ శర్మను కెనరా బ్యాంక్ హెడ్ స్థానంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంకుల్లో ఎండీ-సీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ నెలాఖరుకల్లా యూకో బ్యాంకులో కూడా ఈ పోస్టు ఖాళీ అవుతుందని అధియా తెలిపారు. వీటికి కొత్త చీఫ్‌ల నియామకం ప్రక్రియ మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.