ప్రాధాన్యేతర వ్యాపారాల నుంచి వైదొలగండి
ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచన
న్యూఢిల్లీ: నిధుల సమీకరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రాధాన్యేతర ఆస్తులను గుర్తించి వాటిని సమయానుకూలంగా విక్రయించడంపై దృష్టి సారించాలని ఆర్థిక శాఖ సూచించింది. కొన్ని బ్యాంకులు ఇప్పటికే ఈ పనిని మొదలు పెట్టగా, మరికొన్ని అందుకు సన్నద్ధం అవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల తమకు అవసరమైన అదనపు మూలధన అవసరాలను తీర్చుకోవడంతోపాటు కీలక వ్యాపారంపై తమ దృష్టిని మరింతగా నిలిపేందుకు వీలు చిక్కుతుందని పేర్కొన్నాయి.
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో చాలా వాటికి బీమా విభాగాలు, క్యాపిటల్ అడ్వైజరీ విభాగాలు, స్టాక్ ఎక్సే్యంజ్‌లలో వాటాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎస్‌బీఐకి ఎన్‌ఎస్‌ఈ, యూటీఐ, ఏఆర్‌సీఐఎల్ వంటి పలు కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ఎస్‌బీఐ ఇప్పటికే జీవిత బీమా సహా పలు సబ్సిడరీల్లో వాటాల తగ్గింపునకు సంసిద్ధత వ్యక్తం చేసింది. గత నెలలో ఐడీబీఐ బ్యాంకు బోర్డు సైతం మూలధనాన్ని పెంచుకునేందుకు వీలుగా అప్రాధాన్య వ్యాపారాల్లో వాటాలు తగ్గించుకోవాలని నిర్ణయించింది.