బ్యాంకుల్లో కొలువుల జాతర!
- ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండేళ్లలో 80,000 మంది పదవీ విరమణ..
- ఖాళీల భర్తీకి చకచకా సన్నాహాలు
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో భారీస్థాయి కొలువుల జాతరకు తెరలేస్తోంది. అగ్రగామి ఎస్‌బీఐతో పాటు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల్లో రెండేళ్లలో దాదాపు 80,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనుండటమే దీనికి కారణం. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో(2015-16, 2015-17) మొత్తం అన్ని కేడర్లలో కలిపి 78,800 మంది రిటైర్ అవ్వనున్నారనేది అధికారిక వర్గాల అంచనా. ఈ ఒక్క ఏడాదే 39,756 మంది పదవీ విరమణ చేస్తుండటం గమనార్హం. ఇందులో 19,065 మంది ఆఫీసర్లు, 14,669 మంది క్లర్కులతో పాటు 6,022 మంది ఇతర సిబ్బంది ఉన్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి.
వచ్చే ఏడాది రిటైరయ్యే వారి సంఖ్య సుమారు 39,000. ఇందులో 18,506 మంది ఆఫీసర్లు, 14,458 మంది క్లర్కులు ఉన్నారు. దీంతో బ్యాంకుల్లో నియామకాల సందడి జోరందుకోనుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తమ బ్యాంకులో 8,674 మంది సిబ్బంది రిటైర్ కానున్నట్లు ఇటీవలే ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. దీంతో మార్చిలోపు 2,000 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలిపారు.
మరోపక్క, ప్రభుత్వ బ్యాంకులకు మరింత చేయూతనిచ్చేవిధంగా పెద్దమొత్తంలో మూలధనం సమకూర్చడం, హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు వంటి ఏడు అంశాలతో ‘ఇంధ్రధనుష్’ ప్రణాళికను కేంద్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకుల విస్తరణ కూడా వేగం పుంజుకోనుంది. వెరసి పీఎస్‌బీల్లో కొత్త ఉద్యోగాలు వెల్లువెత్తేందుకు దోహదం చేయనుందని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భర్తీల్లో స్వేచ్ఛ..!
మధ్యస్థాయి ఉద్యోగాల్లో భారీగా పోస్టులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో నియామకాల్లో బ్యాంకులకు కొంత స్వేచ్ఛను ఇచ్చే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీస్తోంది. ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో కూడా సిబ్బందిని నియమించుకోవడానికి అవకాశం ఉంది. దేశంలో మొత్తం 22 ప్రభుత్వ రంగ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఎస్‌బీఐకి ఉన్న 5 అనుబంధ బ్యాంకులు వీటికి అదనం.
కాగా, బ్యాంకులు తమ వ్యాపార వృద్ధి, రిటైర్‌మెంట్లు, సిబ్బంది అవసరాలు ఇతరత్రా అంశాల ఆధారంగా ఖాళీలను భర్తీ చేసుకుంటూ వస్తున్నాయి. క్యాంపస్ నియామకాలపై బ్యాంకులు చాలా ఆసక్తిగానే ఉన్నాయని, అయితే, న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇప్పటికిప్పుడు దీనికి అవకాశాల్లేవని ఇటీవలే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ అడ్డంకులకు పరిష్కార మార్గాలపై దృష్టిసారించనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
చీఫ్ పోస్టుల్లో ప్రైవేటు రంగ నిపుణులకు బ్రేక్..
పీఎస్‌బీల్లో ఎండీ, సీఈఓ పోస్టులకు మరింత మంది ప్రైవేటు రంగ నిపుణులను నియమించుకునే అవకాశాల్లేవని ఫైనాన్షియల్ సేవల విభాగాల కార్యదర్శి హస్ముఖ్ అధియా పేర్కొన్నారు. ఇకపై పీఎస్‌బీల్లో చీఫ్‌ల నియామకానికి నిపుణులైన ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లనే పరిగణనలోకి తీసుకుంటామని కూడా ఆయన వెల్లడించారు. ఇటీవల ఐదు పీఎస్‌బీల్లో కొత్త చీఫ్‌లను కేంద్రం నియమించగా.. తొలిసారిగా అందులో ఇద్దరు ప్రైవేటు రంగానికి చెందిన నిపుణులకు చోటిచ్చిన సంగతి తెలిసిందే.
ఇందులో వీబీహెచ్‌సీ వేల్యూ హోమ్స్ సీఈఓ పీఎస్ జయకుమార్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్‌గా నియమించగా... ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ సీఈఓ రాకేశ్ శర్మను కెనరా బ్యాంక్ హెడ్ స్థానంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంకుల్లో ఎండీ-సీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ నెలాఖరుకల్లా యూకో బ్యాంకులో కూడా ఈ పోస్టు ఖాళీ అవుతుందని అధియా తెలిపారు. వీటికి కొత్త చీఫ్‌ల నియామకం ప్రక్రియ మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.