![NPA trouble: economic portfolios see rise in NPA - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/13/FITCH.jpg.webp?itok=TKAAIAcd)
న్యూఢిల్లీ: ఉర్జిత్ పటేల్ ఆకస్మిక రాజీనామా... ఆర్‌బీఐ విధానాల ప్రాధాన్యతల విషయంలో ఉన్న రిస్క్‌ను తెలియజేస్తోందని రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. కేంద్ర బ్యాంకులో ప్రభుత్వ జోక్యం పెరగడాన్ని ఇది తెలియజేస్తోందని, మొండి బకాయిల పరిష్కారానికి ఆర్‌బీఐ చేస్తున్న ప్రయత్నాలకు దీనివల్ల విఘాతం కలుగుతుందని అభిప్రాయపడింది. పటేల్ రాజీనామా కారణంగా ఏర్పడే సమస్యలన్నవి కొత్తగా వచ్చిన శక్తికాంత దాస్ సారథ్యంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా తేటతెల్లం అవుతాయని పేర్కొంది. ‘‘వృద్ధిని వేగవంతం చేయాలంటూ ప్రభుత్వం నుంచి ఎంతో కాలంగా వచ్చిన ఒత్తిళ్ల తర్వాతే ఆర్‌బీఐ గవర్నర్ రాజీనామా చేయడం జరిగింది. ఇది ఆర్‌బీఐ విధాన ప్రాధాన్యతల రిస్క్‌ను తెలియజేస్తోంది.
మొండి బకాయిల పరిష్కారానికి ఆర్‌బీఐ చేపడుతున్న చర్యలు దీర్ఘకాలంలో బ్యాంకింగ్ రంగ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ద్రవ్యోల్బణం నియంత్రణకు కట్టుబడి ఉండటం అన్నది మరింత స్థిరమైన స్థూల ఆర్థిక వాతావరణానికి కారణం అవుతుంది. ఆర్‌బీఐలో ప్రభుత్వ జోక్యం పెరిగితే అది ప్రగతికి విఘాతం కలిగిస్తుంది’’ అని ఫిచ్ వివరించింది. దీర్ఘకాలంగా ఉన్న ఎన్‌పీఏల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల విషయంలో వెనక్కి తగ్గితే అది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆర్‌బీఐ విధానాలను మరింత ప్రోత్సహించడం ప్రభుత్వానికి రాజకీయ ప్రోత్సాహకం అవుతుందని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment