ఇప్పుడు హోండా వంతు..
కార్ల ధరలు 3 శాతం వరకూ పెంపు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన కంపెనీ ‘హోండా కార్స్ ఇండియా’ తాజాగా తన వాహన ధరలను 3% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు నిర్ణయం 2017, జనవరి తొలివారం నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీపేర్కొంది. మారకపు విలువలో తీవ్ర ఒడిదుడుకులు, ముడిపదార్థాల ధరలు పెంపు వంటి పలు అంశాల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరిగిందని, అందుకే కార్ల ధరలను పెంచాల్సి వస్తోందని వివరించింది. కంపెనీ రూ.4.69లక్షలు నుంచి రూ.37 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ధర శ్రేణిలో తన వాహనాలను మార్కెట్‌లో విక్రయిస్తోంది. కాగా హ్యుందాయ్ మోటార్, నిస్సాన్, టయోటా, రెనో, మెర్సిడెస్, టాటా మోటార్ వంటి కంపెనీలు కూడా వాటివాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించడం తెలిసిందే.