ఈ ఏడాదే మళ్లీ హోండా జాజ్.. | Honda to roll out Jazz hatchback in India this year | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదే మళ్లీ హోండా జాజ్..

Published Tue, Jun 24 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM

ఈ ఏడాదే మళ్లీ హోండా జాజ్..

ఈ ఏడాదే మళ్లీ హోండా జాజ్..

జూలైలో రానున్న మొబీలియో
 - వ్యయాలను గణనీయంగా తగ్గిస్తున్నాం నిమగ్నమైన ఆర్‌అండ్‌డీ టీం
 - హోండా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా ఈ ఏడాదే జాజ్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌ను మళ్లీ తీసుకువస్తోంది. కొన్ని దేశాల్లో ఫిట్ పేరుతోనూ కంపెనీ విక్రయిస్తోంది. పెట్రోలు, డీజిల్ వెర్షన్లలో ఇది లభిస్తుంది. టచ్ స్క్రీన్ సిస్టమ్, విశాలమైన ఇంటీరియర్, మ్యూజిక్ కంట్రోల్స్‌తో త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, మాన్యువల్/ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూపుదిద్దుకుంది.

నవంబర్‌లో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధర రూ.4.7-7.5 లక్షలు ఉండొచ్చని సమాచారం. కాగా, 7 సీట్ల సామర్థ్యం గల మల్టీ పర్పస్ వెహికల్ మొబీలియో జూలైలో విడుదల కానుంది. 2014 జనవరిలో తొలిసారిగా మొబీ లియోను ఇండోనేసియాలో పరిచయం చేసినట్టు హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఏటా 1.4 లక్షల ఎంపీవీలు అమ్ముడవుతున్న భారత్‌లో మొబీలియో కొత్త విభాగాన్ని సృష్టిస్తుందని చెప్పారు.
 
దేశీయ విడిభాగాలతో..
నోయిడా సమీపంలో సంస్థకు కార్ల తయారీ ప్లాంటుంది. ఇక్కడే పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పారు. నాణ్యమైన, తక్కువ ధరలో విడిభాగాలను తయారు చేయగలిగే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే ఈ కేంద్రం పని. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 200 పైగా సరఫరాదార్లున్నారు. వీరి నుంచి విడిభాగాలను కంపెనీ సేకరిస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే వ్యయం ఎక్కువ అవుతుంది కాబట్టి అమేజ్, సిటీ మోడళ్లకు 90 శాతం విడిభాగాలను దేశీయంగా సేకరిస్తోంది. కారు వ్యయం తగ్గించి, పోటీ ధరలో కొత్త మోడళ్లు మార్కెట్లోకి తెచ్చేందుకు వీలవుతోందని కంపెనీ మార్కెటింగ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అనిత శర్మ తెలిపారు.
 
లిమిటెడ్ ఎడిషన్‌తో..
అమ్మకాలు పెరిగేందుకు లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లు దోహదపడుతున్నాయని జ్ఞానేశ్వర్ తెలిపారు. అమేజ్ అమ్మకాల్లో 8 శాతం వాటా లిమిటెడ్ ఎడిషన్‌దేనని చెప్పారు. హోండా సిటీ లిమిటెడ్ ఎడిషన్‌ను తీసుకొస్తామని చెప్పారు. కొత్త మోడళ్ల రాకతో 2016-17 నాటికి ఏటా 3 లక్షల కార్ల విక్రయానికి చేరుకుంటామని పేర్కొన్నారు. ఎక్సైజ్ డ్యూటీ ప్రయోజనాలను ప్రభుత్వం కొనసాగిస్తేనే పరిశ్రమకు ఊరటగా చెప్పారు. ఇంధన పాలసీలో స్పష్టత రావాలన్నారు. దీర్ఘకాలిక పాలసీ అయితేనే డీజిల్/పెట్రోలు విభాగాల్లో దేనిపైన కంపెనీ దృష్టిసారించాలో నిర్ణయించొచ్చని వివరించారు. 83 శాతం వృద్ధితో 2013-14లో కంపెనీ 1.34 లక్షల యూనిట్లు విక్రయించింది. తెలంగాణ, సీమాంధ్రలో 115 శాతం వృద్ధితో 8,115 కార్లను అమ్మింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement