Car manufacturing Company
-
నేటి నుంచి పెరిగిన కార్ల ధరలు.. ఎంతంటే..?
దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ.. తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కార్ల ధరలను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పెంచిన ధరలను నేటి నుంచి అమల్లోకి తెస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ముడి సరకుల వ్యయాల పెరిగిన కారణంగానే ధరలు పెంచుతున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా కార్ల ధరల పెరుగుదల దాదాపు 0.45 శాతం ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎంచుకున్న మోడళ్లలో ఎక్స్-షోరూమ్(దిల్లీ) ధరలలో సగటు పెరుగుదల ఉటుందని సంస్థ పేర్కొంది. వాహనాల పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం అందించింది. వాహనాల ధరల పెంపు నిర్ణయంతో స్టాక్ మార్కెట్లో మారుతి సుజుకి షేర్లు మంగళవారం ప్రారంభ సెషన్లో దాదాపు 1.5 శాతం లాభపడ్డాయి. కంపెనీ గత ఏడాది ఏప్రిల్ 1న తన అన్ని వాహనాల మోడళ్ల ధరలను పెంచింది. డిసెంబర్ 2023లో కంపెనీ మొత్తం 1,37,551 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. డిసెంబర్ 2022లో విక్రయించిన 1,39,347 యూనిట్లతో పోలిస్తే 1.28 శాతం క్షీణించింది. కానీ 2023 క్యాలెండర్ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 2 కోట్ల వాహనాలను విక్రయించినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఉద్యోగాలు పోనున్నాయా..? ఇక మరో దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సైతం ముడిపదార్ధాల ధరల పెరుగుదలతో తమ వాహనాల ధరలను ఇటీవల పెంచుతున్నట్లు ప్రకటించారు. మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, లగ్జీరీ కార్ల తయారీ కంపెనీ(ఆడి) సైతం ఈ నెలలో తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. -
వోల్వో కార్ల పరుగు
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న వోల్వో కార్ ఇండియా 2023 జనవరి–సెపె్టంబర్ మధ్య రిటైల్‌లో 1,751 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 40 శాతం అధికం అని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఎక్స్‌సీ60 మోడల్ ఈ వృద్ధిని నడిపించిందని వెల్లడించింది. మొత్తం అమ్మకాల్లో ఈ మోడల్ వాటా ఏకంగా 35 శాతం ఉందని వివరించింది. దేశీయంగా అసెంబుల్ అవుతున్న పూర్తి ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌సీ40 రిచార్జ్ మోడల్లో 419 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని వోల్వో ప్రకటించింది. ఎక్స్‌సీ40 రిచార్జ్ వాటా 24 శాతం ఉందని తెలిపింది. సంస్థ మొత్తం విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల నుంచి 27 శాతం సమకూరుతోంది. ఈ విజయం కస్టమర్ల విశ్వాసాన్ని, భారత మార్కెట్‌కు ప్రీమియం, స్థిర వాహనాలను అందించడంలో కంపెనీ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని వోల్వో కార్ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీకి భారత్‌లో 25 డీలర్షిప్ కేంద్రాలు ఉన్నాయి. -
భారత్‌లో ఎంజీ మోటార్ రెండో ప్లాంటు!
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా మరో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 1.8 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. గుజరాత్‌లోని హలోల్ వద్ద 1.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో కంపెనీకి ఇప్పటికే ప్లాంటు ఉంది. జనరల్ మోటార్స్ నుంచి ఈ కేంద్రాన్ని కొనుగోలు చేసింది. భారత్‌లో అయిదేళ్ల వ్యాపార ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ 4–5 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని ఎంజీ మోటార్ ఇండియా నిర్ణయించింది. 2028 నాటికి మొత్తం విక్రయాల్లో ఈవీల వాటా 65–75 శాతానికి చేరవచ్చని కంపెనీ భావిస్తోంది. సంయుక్త భాగస్వామ్య కంపెనీ లేదా థర్డ్ పార్టీ ద్వారా సెల్ తయారీ, హైడ్రోజన్ ప్యూయల్ సెల్ టెక్నాలజీలోని ప్రవేశించే అవకాశాలను అన్వేషిస్తున్నట్టు వెల్లడించింది. దేశంలో ఉద్యోగుల సంఖ్యను 20,000 స్థాయికి చేర్చాలని భావిస్తోంది. మెజారిటీ వాటా విక్రయం.. వచ్చే 2–4 ఏళ్లలో మెజారిటీ వాటాలను స్థానిక భాగస్వాములకు విక్రయించాలన్నది ఎంజీ మోటార్ ఇండియా ప్రణాళిక. 2028 నాటికి దేశంలో కార్యకలాపాలను విస్తరించేందుకు రూ.5,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిన ఈ సంస్థ.. తదుపరి దశ వృద్ధికి నిధులు సమకూర్చేందుకు కొంత కాలంగా మూలధనాన్ని సమీకరించాలని చూస్తోంది. చైనా నుండి భారత్‌కు మరింత మూలధనాన్ని తీసుకురావాలన్న కంపెనీ ప్రణాళికలు ఇప్పటివరకు విజయవంతం కాలేదు. రెండేళ్లుగా ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉన్న ఎంజీ మోటార్ ఇండియా మూలధనాన్ని పెంచడానికి ఇతర మార్గాలను వెతకడం ప్రారంభించింది. లక్ష మంది విద్యార్థులు.. ఎంజీ నర్చర్ కార్యక్రమం కింద 1,00,000 మంది విద్యార్థులను ఈవీ, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీస్ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు ఎంజీ మోటార్ ఇండియా సీఈవో రాజీవ్ ఛాబా తెలిపారు. బ్రిటిష్ బ్రాండ్ అయిన ఎంజీ మోటార్ ప్రస్తుతం చైనాకు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్ చేతుల్లో ఉంది. భారత మార్కెట్లో హెక్టర్, ఆస్టర్, గ్లోస్టర్, జడ్ఎస్ ఈవీని విక్రయిస్తోంది. ఇటీవలే చిన్న ఎలక్ట్రిక్ వాహనం కామెట్‌ను ఆవిష్కరించింది. -
పెట్రోల్, డీజిల్ కార్ల తయారీపై... 2035 నుంచి ఈయూ నిషేధం
బ్రస్సెల్స్: 2035 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు, వ్యాన్ల తయారీపై యూరోపియన్ యూనియన్ దేశాలు నిషేధం విధించనున్నాయి. ఇందుకు సంబంధించిన మొట్టమొదటి ‘ఫిట్ ఫర్ 55’ప్యాకేజీపై ఈయూ ప్రతినిధులు గురువారం అంగీకారానికి వచ్చారు. ఈ దశాబ్దం చివరికల్లా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను 55% మేర తగ్గించడమే ఈ ప్యాకేజీ ఉద్దేశం. దీని ప్రకారం.. కార్లు, వ్యాన్ల నుంచి వెలువడే ఉద్గారాలను 2030 నాటికి 55 శాతానికి తగ్గించి, 2035 కల్లా వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. ఒప్పందం అమల్లోకి రావాలంటే ముందుగా ఈయూ పార్లమెంట్, సభ్యదేశాలు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. 2050 నాటికి వాయు ఉద్గారాలను పూర్తిగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహమివ్వాలని ఈయూ యోచిస్తోంది. -
కారు తయారీ దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్..!
న్యూఢిల్లీ: కారులో ఫ్రంట్ ఫేసింగ్ ప్యాసింజర్లందరికీ మూడు పాయింట్ల సీటు బెల్ట్ అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆటో మొబైల్ తయారీ కంపెనీలకు సూచించింది. కారు వెనుక వరుసలో కూర్చొన్న మధ్య వ్యక్తికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ‘ఆటోమొబైల్ సేఫ్టీ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా’ సదస్సులో తెలిపారు. "కారులో ముందు వైపు ఉన్న ప్రయాణీకులందరికీ మూడు పాయింట్ల సీటు బెల్ట్ అందించాలనే నిబందనను ఆటోమేకర్లకు తప్పనిసరి చేయడానికి ఒక ఫైలుపై సంతకం చేశాను" అని రోడ్డు రవాణా & రహదారుల మంత్రి తెలిపారు. ఇకపై కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ మూడు పాయింట్ల సీట్ బెల్ట్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుతం, దేశంలో ఉత్పత్తి చేసే చాలా కార్లలో వెనుక సీట్లలో రెండు మాత్రమే మూడు పాయింట్ సీటు బెల్ట్ కలిగి ఉన్నాయి. ముందు సీట్లలో కూర్చొనే వారికి మూడు పాయింట్ల సీట్ బెల్ట్ ప్రాముఖ్యత గురించి చెప్తూ ఇకపై తప్పనిసరి చేస్తున్నట్లు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వస్తుందని అన్నారు. దేశంలో 5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది మరణిస్తున్నారని గడ్కరీ తెలిపారు. (చదవండి: రష్యాలో సెక్యూరిటీ గార్డు చేసిన పనిపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్టు..!) -
సెమీకండక్టర్ల కొరత.. భారీగా పడిపోయిన కార్ల అమ్మకాలు!
సెమీకండక్టర్ల కొరత కారణంగా కార్ల తయారీ కంపెనీలు డిసెంబర్ 2021 నాటికి 7 లక్షల కార్లను సమయానికి అందించలేక పోయినట్లు నేడు కేంద్రం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వే 2021-22 తెలిపింది. సరఫరాలో ఆలస్యం కారణంగా 2021లో వాహన డెలివరీ సగటు సమయం(ఆర్డర్ తేదీ నుంచి డెలివరీ చేయడానికి గల మధ్య అంతరం) సుమారు 14 వారాలుకు చేరుకున్నట్లు తెలిపింది. ఈ ఎకనామిక్ సర్వే 2021-22లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేసింది. 2021 డిసెంబరులో కార్ల తయారీదారులు దేశీయ మార్కెట్లో 2,19,421 ప్యాసింజర్ వాహనాలను విక్రయించారని, ఇది 2020తో పోలిస్తే అమ్మకాలు 13% తగ్గిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(సీఐఏఎమ్) నివేదించింది. దేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఎకనామిక్ సర్వే తెలిపింది. సెమీకండక్టర్, డిస్ ప్లే తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.76,000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సెమీకండక్టర్ల కొరతకు కారణమవుతున్న సమయంలో ఈ పరిశ్రమను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వ జోక్యం చేసుకోవాల్సి వచ్చినట్లు సర్వే తెలిపింది. సరఫరా గొలుసుల్లో విచ్ఛిన్నం కారణంగా అనేక విభిన్న పరిశ్రమలకు చెందిన కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడం లేదా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు నివేదిక తెలిపింది. (చదవండి: దేశంలోనే తొలి 3డీ గృహం.. 21 రోజుల్లో నిర్మాణం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తి!) -
ధరల పెంపు దిశగా మరో కార్ల కంపెనీ! జనవరి నుంచి అమలుకి ప్లాన్
కార్ల కంపెనీలు వరుసగా షాక్ ఇస్తున్నాయి. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. కరోనాతో ఓ వైపు ఆదాయం తగ్గిపోగా మరోవైపు పెట్రోలు ,డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా కార్ల ధరల పెంపు వచ్చి చేరింది. ఫోక్స్ వ్యాగన్ సబ్సిడరీ కంపెనీ స్కోడా ఇండియా మార్కెట్లో తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. కార్ల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. పెరిగిన ధరలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. సగటున ప్రతీ మోడల్‌పై 3 శాతం వరకు ధరలు పెరగబోతున్నాయి. స్కోడా కంపెనీ నుంచి కుషాక్, ర్యాపిడ్, కోడియాక్, ఓక్టావియా వంటి పాపులర్ మోడళ్లు ఉన్నాయి. మన్నికతో కూడిన వేగం అందివవ్వడం స్కోడాకు మార్కెట్లో ప్రత్యేకతను తెచ్చి పెట్టింది. మిడ్ రేంజ్ కార్ల మార్కెట్లో స్కోడాకు ప్రత్యేక స్థానం ఉంది. చిప్సెట్ల కొరత సమస్యను తెర మీదకు తీసుకువచ్చి మారుతి మొదలు మేజర్ కార్ల తయారీ కంపెనీలు గత మూడు నెలలుగా ధరలు పెంచుతూ వచ్చాయి. ఇప్పుడు చిప్సెట్ల సంగతి మూలనర పడగా రా మెటీరియల్ ధరలు ముందుకు వచ్చాయి. దీంతో మరోసారి కార్ల కంపెనీలు ధరలు పెంచుతాయా ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. చదవండి: ఆ రాష్ట్రంలో 2022 జనవరి 1 నుంచి డీజిల్ వాహనాలు బ్యాన్..! -
కార్ల రేట్లు రయ్..!
న్యూఢిల్లీ: ముడి వస్తువుల వ్యయాలు పెరిగిపోవడంతో కార్ల తయారీ కంపెనీలు మళ్లీ రేట్ల పెంపు బాట పట్టాయి. మారుతీ సుజుకీ, ఆడి, మెర్సిడెస్ తదితర సంస్థలు జనవరి 1 నుంచి ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించాయి. పెంపు అనేది మోడల్‌ను బట్టి ఆధారపడి ఉంటుందని దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ (ఎంఎస్ఐ) తెలిపింది. ఎంత మేర పెంచేది మాత్రం వెల్లడించలేదు. ‘వివిధ ముడి వస్తువుల ధరలు ఎగియడం వల్ల వాహనాల తయారీ వ్యయాలపై గత ఏడాది కాలంగా తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో అదనపు వ్యయాల భారంలో కొంత భాగాన్ని వాహనాల రేట్ల పెంపు రూపంలో కస్టమర్లకు బదలాయించక తప్పడం లేదు‘ అని కంపెనీ వివరించింది. ‘కమోడిటీల రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు కూడా గణనీయంగానే ఉండవచ్చు‘ అని ఎంఎస్ఐ సీనియర్ ఈడీ (మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. హ్యాచ్‌బ్యాక్ ఆల్టో మొదలుకుని ఎస్యూవీ ఎస్ క్రాస్ దాకా వివిధ మోడల్స్‌ను మారుతీ విక్రయిస్తోంది. వీటి ధరలు సుమారు రూ. 3.15 లక్షల నుంచి రూ. 12.56 లక్షల వరకూ (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటున్నాయి. మారుతీ ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సార్లు రేట్లు పెంచింది. జనవరిలో 1.4 శాతం, ఏప్రిల్‌లో 1.6 శాతం, సెప్టెంబర్‌లో 1.9 శాతం.. మొత్తం మీద 4.9 శాతం మేర పెంచింది. ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్‌తో పాటు ఇతర ముఖ్యమైన లోహాల ధరలు గత ఏడాది కాలంగా పెరుగుతూనే ఉన్నాయని శ్రీవాస్తవ తెలిపారు. వాహన తయారీ వ్యయాల్లో వీటి వాటా 75–80 శాతంగా ఉంటుందని, అందుకే ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతోందని ఆయన పేర్కొన్నారు. 2 శాతం వరకూ మెర్సిడెస్ పెంపు.. లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్–బెంజ్.. జనవరి 1 నుంచి తమ కార్ల ధరలను 2 శాతం వరకూ పెంచనున్నట్లు తెలిపింది. కొత్త ఫీచర్లను జోడిస్తుండటం, ముడి వస్తువుల ధరలు పెరుగుతుండటం ఇందుకు కారణమని వివరించింది. అయితే, ఎంపిక చేసిన కొన్ని మోడల్స్‌కు మాత్రమే పెంపును వర్తింపచేయనున్నట్లు పేర్కొంది. జీఎల్ఈ 400, జీఎల్ఈ 400డి ఎస్‌యూవీలను ఇప్పటికే బుక్ చేసుకుని, డెలివరీ కోసం ఏప్రిల్ నుంచి నిరీక్షిస్తున్న కస్టమర్లకు ధర పెంపుపరంగా రక్షణ ఉంటుందని వివరించింది. ఆడి 3 శాతం వరకూ.. అటు ఆడి కూడా తమ వాహనాల ధరలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 3 శాతం వరకూ పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి వస్తువులు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడమే ఇందుకు కారణమని వివరించింది. ఏ4, ఏ6, ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ తదితర మోడల్స్‌ను దేశీయంగా ఆడి విక్రయిస్తోంది. 2021లో అయిదు ఎలక్ట్రిక్ కార్లతో పాటు మొత్తం 9 కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది. అసాధారణంగా పెరుగుతున్న కమోడిటీల ధరలు.. కమోడిటీ ధరల పెరుగుదల భారం కంటే తాము తక్కువే పెంచామని శ్రీవాస్తవ వివరించారు. ‘గతేడాది ఏప్రిల్–మేలో కేజీ ఉక్కు ధర రూ. 38గా ఉండేది. ఈ ఏడాది అది రూ. 77కి పెరిగిపోయింది. ఇది అసాధారణ స్థాయి. ఉక్కు రేట్లు.. అలాగే ప్లాస్టిక్ ఖర్చులు కూడా భారీ స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇక చైనాలో అల్యూమినియం ఉత్పత్తి పడిపోవడంతో టన్ను ధర 1,700–1,800 డాలర్ల నుంచి ఏకంగా రూ. 2,700–2,800 డాలర్లకు ఎగిసింది. అలాగే రాగి, ఇతర విలువైన లోహాల ధరలు కూడా పెరిగిపోయాయి. రేట్లు తగ్గుతాయేమోనని మేము వేచి చూస్తూ ఉన్నప్పటికీ అది జరగలేదు. మా పరంగా మేము ఖర్చులు తగ్గించుకోవడం వంటి చర్యలు అన్నీ తీసుకున్నాం. కానీ ముడి వస్తువుల వ్యయాలు ఈ స్థాయిలో ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు. అందుకే రేట్ల పెంపు నిర్ణయం తీసుకోక తప్పలేదు‘ అని ఆయన తెలిపారు. -
టాటా మోటార్స్ చిన్న ఎస్యూవీ పంచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ పంచ్ పేరుతో దేశంలో తొలి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. రూ.21,000 చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో ప్రవేశపెట్టారు. డైనా ప్రో టెక్నాలజీతో 1.2 లీటర్ రెవొట్రాన్ ఇంజన్‌తో తయారైంది. పరిశ్రమలో తొలిసారిగా ఆధునిక ఏఎంటీతో ట్రాక్షన్ ప్రో మోడ్, బ్రేక్ స్వే కంట్రోల్ పొందుపరిచారు. 90 డిగ్రీల కోణంలో తెరుచుకునే డోర్లు, ఆర్16 డైమండ్ కట్ అలాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ రూఫ్ ఆప్షన్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీ, కార్నర్ సేఫ్టీ కంట్రోల్‌తో ఏబీఎస్, క్రూయిజ్ కంట్రోల్, టిల్ట్ స్టీరింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి హంగులు ఉన్నాయి. ఏడు రంగుల్లో లభిస్తుంది. పంచ్ అభివృద్ధికి 150 నమూనా కార్లను వాడారు. ఇవి 20 లక్షలకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాయని కంపెనీ తెలిపింది. భారత్, యూకే, ఇటలీలోని డిజైన్ స్టూడియోలు ఈ కారు అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి. -
మహీంద్రా సంచలన నిర్ణయం.. త్వరలో హైపర్ కార్
ట్రాక్టర్ల తయారీ నుంచి మొదలు పెట్టి ఎస్‌యూవీల వరకు వాహన తయారీ రంగంలో స్వదేశి సంస్థగా చెరగని ముద్ర వేసిన మహీంద్రా మరో సంచలనానికి తెరలేపింది. ఏషియా ఆటోమోబైల్ కంపెనీలకు వెనక్కి నెట్టి హైపర్ కారు తయారీపై ఫోకస్ పెట్టింది. బ్రాండ్ ఇమేజ్ ఆటోమొబైల్ మార్కెట్లో పట్టు పెంచుకోవడంతో పాటు బ్రాండ్ ఇమేజ్‌ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే పనిలో పడింది మహీంద్రా. తమ కంపెనీ నుంచి ట్రాక్టర్లు, జీపులు మొదలు హైపర్ కార్ల వరకు అన్నీ దొరుకుతాయనే మెసేజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా హై ఎండ్ లగ్జరీ కార్ల సెగ్మెంట్లో రెనాల్ట్, ఫోర్డ్‌లతో కలిసి ముందుకు సాగాలపి ఇప్పటికే డిసైడ్ అయ్యింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పినిన్‌ఫరినా హైపర్ కార్ల తయారీలో ఘన చరిత్ర కలిగిన ఫినిన్‌ఫరినాతో జట్టు కట్టేందుకు మహీంద్రా సిద్ధమైందంటూ బ్లూబ్‌బర్గ్ మీడియా ప్రచురించింది. దీని ప్రకారం రాబోయే రెండేళ్లలో మహీంద్రా, ఫినిన్‌ఫరినా సంస్థలు సంయుక్తంగా హైపర్ కారుని మార్కెట్లోకి తేనున్నాయి. బటిస్టా జెనివాలో 2019లో జరిగిన ఆటో ఎక్స్‌ప్లోలో ఫినిన్‌ఫరినా బటిస్టా కాన్సెప్టు కారును తొలిసారి ప్రదర్శించింది. 2020లో మార్కెట్లోకి తెస్తామని తెలిపింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా కారు తయారీ పనులకు బ్రేకులు పడ్డాయి. తాజాగా ఈ సంస్థ 2022 ప్రథమార్థంలో కారును తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కారు తయారీలో భాగస్వామ్యం కావాలని మహీంద్రా యోచిస్తోంది. ఫీచర్లు అన్నీ అనుకూలిస్తే మహీంద్రా - ఫినిన్‌ఫరినాల ఆధ్వర్యంలో రాబోయే హైపర్కారుని పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్‌గా తయారు చేయబోతున్నారు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ధర మహీంద్రా- ఫినిన్ఫరినాలు సంయుక్తంగా మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉన్న ఈ హైపర్ కారు ధర 2.3 మిలియన్ డాలర్లుగా ఉండవచ్చని అంచనా. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి తొలి ఐదు బుకింగ్స్ పూర్తయ్యాయి. కేవలం 150 కార్లు మాత్రమే తయారు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. చదవండి : Mahindra XUV700: బుకింగ్స్ ప్రారంభం.. ముందు వచ్చిన వారికే ఆ ఆఫర్ -
‘ఫ్లెక్స్ ఇంధనాల’ ఇంజిన్లపై త్వరలో ఆదేశాలు
పుణె: కార్ల తయారీ కంపెనీలు.. ఫ్లెక్స్–ఫ్యుయల్ ఇంజిన్లను ప్రవేశపెట్టడం తప్పనిసరి చేస్తూ త్వరలోనే ఆదేశాలు ఇవ్వనున్నట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ మొదలుకుని టాటా, మహీంద్రా వంటి సంస్థలు దీన్ని పాటించేలా 3–4 నెలల్లో ఆదేశాలు జారీ చేయనున్నట్లు వివరించారు. తన జీవితకాలంలో పెట్రోల్, డీజిల్ వినియోగం పూర్తిగా నిలిచిపోవాలని, దేశీయంగా ఉత్పత్తయ్యే ఇథనాల్ ఇంధన వినియోగం పెరగాలని ఆకాంక్షిస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. ఫ్లెక్స్ ఇంజిన్లు తయారు చేసే దాకా తన వద్దకు రావద్దంటూ ద్విచక్ర వాహన సంస్థలకు కూడా సూచించానని, ఆ తర్వాత అవి ఇథనాల్–ఫ్లెక్స్ ఇంజిన్లను రూపొందించాయని గడ్కరీ తెలిపారు. ఇంధనంలో 51–83% దాకా ఇథనాల్ లేదా మిథనాల్‌ను కలిపినా పనిచేయగలిగే ఇంజిన్లను ఫ్లెక్స్ ఇంజిన్లుగా వ్యవహరిస్తారు. మరోవైపు, శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు హారన్లను కూడా సంగీత ధ్వనులతో రూపొందించాలని కార్ల తయారీ సంస్థలకు సూచించినట్లు గడ్కరీ చెప్పారు. -
కొత్త కార్లలో హ్యాండ్ బ్రేక్ లివర్ మాయం
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివద్ధి చెందుతున్నా కొద్దీ కార్లు నడపడం చాలా సులువు అవుతూ వస్తోంది. ఇప్పటికే చాలా కార్లలో గేర్‌కు బదులుగా ఆటో గేర్ సిస్టమ్ వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు హ్యాండ్ బ్రేక్‌ను మాత్రం డ్రైవరే వేయాల్సి వచ్చేది. ఆ విధానానికి స్వస్తి చెబుతూ మొట్టమొదటి సారిగా జాగ్వర్ కార్లలో బటన్ సిస్టమ్ వచ్చింది. బటన్ నొక్కితే చాలు హాండ్ బ్రేక్ దానంతట అదే పడిపోతోంది. జాగ్వర్ కార్లను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ల్యాండ్ రోవర్, లెక్సెస్, మెర్సిడెస్ బెంజి, పోర్షే ఖరీదైన కార్లు కూడా పుష్ బటన్ సిస్టమ్‌ను తీసుకొచ్చాయి. ఆన్లైన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 32 కార్ల కంపెనీల వాహనాలను అధ్యయనం చేయగా ఇప్పటికే జాగ్వర్, ల్యాండ్ రోవర్, లెగ్సస్, మెర్సిడెస్, పోర్షే కార్లలో హ్యాండ్ బ్రేక్ లివర్ పూర్తిగా కనుమరుగైంది. ఇక షో రూముల్లో పరిశీలిస్తే ప్రతి పది కంపెనీల కార్లలో మూడు కంపెనీల కార్లలో మాత్రమే ఇంకా హ్యాండ్ బ్రేక్ వ్యవస్థ ఉంది. డేషియా, సుజికీ కంపెనీలు మాత్రం ఇప్పటికీ హ్యాండ్ బ్రేకర్ల వ్యవస్థనే ఉపయోగిస్తున్నాయి. హ్యాండ్ బ్రేక్ వేసి ఉందా, లేదా అన్న విషయం డాష్ బోర్డులో రెడ్ మార్కుతో కనిపిస్తుంది. హ్యాండ్ బ్రేకుల్లో కూడా ఆటోమేటిక్ వ్యవస్థ వస్తోంది. కొండలు, గుట్టలు ఎక్కుతున్నప్పుడు ఈ వ్యవస్థ ఎక్కువగా ఉపయోగపడుతుంది. కొండ ఎక్కుతున్నప్పుడు కారు ముందుకు పోలేక వెనక్కి జారుతున్నప్పుడు ఈ ఆటోమేటిక్ వ్యవస్థ పనిచేసి హ్యాండ్ బ్రేక్ దానంతట అదే పడుతుంది. డ్రైవర్ అవసరం లేని సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వస్తోన్న నేపథ్యంలో డ్రైవర్ మరింత సులువుగా కార్లు నడిపే దిశగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. -
మారుతీ కార్ల ధరలు పెరిగాయ్...
న్యూఢిల్లీ : దేశీ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తన కార్ల ధరలను దాదాపు రూ.9,000 వరకు పెంచింది. డీలర్ మార్జిన్లో స్వల్ప మార్పే ధరల పెరుగుదలకు కారణం. ఇటీవల కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఎస్-క్రాస్ ధరను మాత్రం అలాగే ఉం చింది. పెరిగిన కార్ల ధరలు ఆగస్ట్ 11 నుంచి అమలులోకి వచ్చాయని మారుతీ సుజుకీ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం మారుతీ దేశీ కార్ల మార్కెట్ వాటా 45 శాతంగా ఉంది. కంపెనీ విక్రయించే కార్ల ధరలు రూ.2.25 లక్షల నుంచి రూ.13.74 లక్షల (ఢిల్లీ ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉన్నాయి. -
ఈ ఏడాదే మళ్లీ హోండా జాజ్..
జూలైలో రానున్న మొబీలియో - వ్యయాలను గణనీయంగా తగ్గిస్తున్నాం నిమగ్నమైన ఆర్అండ్డీ టీం - హోండా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా ఈ ఏడాదే జాజ్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌ను మళ్లీ తీసుకువస్తోంది. కొన్ని దేశాల్లో ఫిట్ పేరుతోనూ కంపెనీ విక్రయిస్తోంది. పెట్రోలు, డీజిల్ వెర్షన్లలో ఇది లభిస్తుంది. టచ్ స్క్రీన్ సిస్టమ్, విశాలమైన ఇంటీరియర్, మ్యూజిక్ కంట్రోల్స్‌తో త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, మాన్యువల్/ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూపుదిద్దుకుంది. నవంబర్‌లో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధర రూ.4.7-7.5 లక్షలు ఉండొచ్చని సమాచారం. కాగా, 7 సీట్ల సామర్థ్యం గల మల్టీ పర్పస్ వెహికల్ మొబీలియో జూలైలో విడుదల కానుంది. 2014 జనవరిలో తొలిసారిగా మొబీ లియోను ఇండోనేసియాలో పరిచయం చేసినట్టు హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఏటా 1.4 లక్షల ఎంపీవీలు అమ్ముడవుతున్న భారత్‌లో మొబీలియో కొత్త విభాగాన్ని సృష్టిస్తుందని చెప్పారు. దేశీయ విడిభాగాలతో.. నోయిడా సమీపంలో సంస్థకు కార్ల తయారీ ప్లాంటుంది. ఇక్కడే పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పారు. నాణ్యమైన, తక్కువ ధరలో విడిభాగాలను తయారు చేయగలిగే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే ఈ కేంద్రం పని. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 200 పైగా సరఫరాదార్లున్నారు. వీరి నుంచి విడిభాగాలను కంపెనీ సేకరిస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే వ్యయం ఎక్కువ అవుతుంది కాబట్టి అమేజ్, సిటీ మోడళ్లకు 90 శాతం విడిభాగాలను దేశీయంగా సేకరిస్తోంది. కారు వ్యయం తగ్గించి, పోటీ ధరలో కొత్త మోడళ్లు మార్కెట్లోకి తెచ్చేందుకు వీలవుతోందని కంపెనీ మార్కెటింగ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అనిత శర్మ తెలిపారు. లిమిటెడ్ ఎడిషన్‌తో.. అమ్మకాలు పెరిగేందుకు లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లు దోహదపడుతున్నాయని జ్ఞానేశ్వర్ తెలిపారు. అమేజ్ అమ్మకాల్లో 8 శాతం వాటా లిమిటెడ్ ఎడిషన్దేనని చెప్పారు. హోండా సిటీ లిమిటెడ్ ఎడిషన్‌ను తీసుకొస్తామని చెప్పారు. కొత్త మోడళ్ల రాకతో 2016-17 నాటికి ఏటా 3 లక్షల కార్ల విక్రయానికి చేరుకుంటామని పేర్కొన్నారు. ఎక్సైజ్ డ్యూటీ ప్రయోజనాలను ప్రభుత్వం కొనసాగిస్తేనే పరిశ్రమకు ఊరటగా చెప్పారు. ఇంధన పాలసీలో స్పష్టత రావాలన్నారు. దీర్ఘకాలిక పాలసీ అయితేనే డీజిల్/పెట్రోలు విభాగాల్లో దేనిపైన కంపెనీ దృష్టిసారించాలో నిర్ణయించొచ్చని వివరించారు. 83 శాతం వృద్ధితో 2013-14లో కంపెనీ 1.34 లక్షల యూనిట్లు విక్రయించింది. తెలంగాణ, సీమాంధ్రలో 115 శాతం వృద్ధితో 8,115 కార్లను అమ్మింది.