న్యూఢిల్లీ: ముడి వస్తువుల వ్యయాలు పెరిగిపోవడంతో కార్ల తయారీ కంపెనీలు మళ్లీ రేట్ల పెంపు బాట పట్టాయి. మారుతీ సుజుకీ, ఆడి, మెర్సిడెస్ తదితర సంస్థలు జనవరి 1 నుంచి ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించాయి. పెంపు అనేది మోడల్‌ను బట్టి ఆధారపడి ఉంటుందని దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ (ఎంఎస్‌ఐ) తెలిపింది. ఎంత మేర పెంచేది మాత్రం వెల్లడించలేదు.
‘వివిధ ముడి వస్తువుల ధరలు ఎగియడం వల్ల వాహనాల తయారీ వ్యయాలపై గత ఏడాది కాలంగా తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో అదనపు వ్యయాల భారంలో కొంత భాగాన్ని వాహనాల రేట్ల పెంపు రూపంలో కస్టమర్లకు బదలాయించక తప్పడం లేదు‘ అని కంపెనీ వివరించింది. ‘కమోడిటీల రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు కూడా గణనీయంగానే ఉండవచ్చు‘ అని ఎంఎస్‌ఐ సీనియర్ ఈడీ (మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. హ్యాచ్‌బ్యాక్ ఆల్టో మొదలుకుని ఎస్‌యూవీ ఎస్ క్రాస్ దాకా వివిధ మోడల్స్‌ను మారుతీ విక్రయిస్తోంది.
వీటి ధరలు సుమారు రూ. 3.15 లక్షల నుంచి రూ. 12.56 లక్షల వరకూ (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటున్నాయి. మారుతీ ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సార్లు రేట్లు పెంచింది. జనవరిలో 1.4 శాతం, ఏప్రిల్‌లో 1.6 శాతం, సెప్టెంబర్‌లో 1.9 శాతం.. మొత్తం మీద 4.9 శాతం మేర పెంచింది. ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్‌తో పాటు ఇతర ముఖ్యమైన లోహాల ధరలు గత ఏడాది కాలంగా పెరుగుతూనే ఉన్నాయని శ్రీవాస్తవ తెలిపారు. వాహన తయారీ వ్యయాల్లో వీటి వాటా 75–80 శాతంగా ఉంటుందని, అందుకే ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతోందని ఆయన పేర్కొన్నారు.
2 శాతం వరకూ మెర్సిడెస్ పెంపు..
లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్–బెంజ్.. జనవరి 1 నుంచి తమ కార్ల ధరలను 2 శాతం వరకూ పెంచనున్నట్లు తెలిపింది. కొత్త ఫీచర్లను జోడిస్తుండటం, ముడి వస్తువుల ధరలు పెరుగుతుండటం ఇందుకు కారణమని వివరించింది. అయితే, ఎంపిక చేసిన కొన్ని మోడల్స్‌కు మాత్రమే పెంపును వర్తింపచేయనున్నట్లు పేర్కొంది. జీఎల్‌ఈ 400, జీఎల్‌ఈ 400డి ఎస్‌యూవీలను ఇప్పటికే బుక్ చేసుకుని, డెలివరీ కోసం ఏప్రిల్ నుంచి నిరీక్షిస్తున్న కస్టమర్లకు ధర పెంపుపరంగా రక్షణ ఉంటుందని వివరించింది.
ఆడి 3 శాతం వరకూ..
అటు ఆడి కూడా తమ వాహనాల ధరలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 3 శాతం వరకూ పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి వస్తువులు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడమే ఇందుకు కారణమని వివరించింది. ఏ4, ఏ6, ఆర్‌ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ తదితర మోడల్స్‌ను దేశీయంగా ఆడి విక్రయిస్తోంది. 2021లో అయిదు ఎలక్ట్రిక్ కార్లతో పాటు మొత్తం 9 కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది.
అసాధారణంగా పెరుగుతున్న కమోడిటీల ధరలు..
కమోడిటీ ధరల పెరుగుదల భారం కంటే తాము తక్కువే పెంచామని శ్రీవాస్తవ వివరించారు. ‘గతేడాది ఏప్రిల్–మేలో కేజీ ఉక్కు ధర రూ. 38గా ఉండేది. ఈ ఏడాది అది రూ. 77కి పెరిగిపోయింది. ఇది అసాధారణ స్థాయి. ఉక్కు రేట్లు.. అలాగే ప్లాస్టిక్ ఖర్చులు కూడా భారీ స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇక చైనాలో అల్యూమినియం ఉత్పత్తి పడిపోవడంతో టన్ను ధర 1,700–1,800 డాలర్ల నుంచి ఏకంగా రూ. 2,700–2,800 డాలర్లకు ఎగిసింది. అలాగే రాగి, ఇతర విలువైన లోహాల ధరలు కూడా పెరిగిపోయాయి. రేట్లు తగ్గుతాయేమోనని మేము వేచి చూస్తూ ఉన్నప్పటికీ అది జరగలేదు. మా పరంగా మేము ఖర్చులు తగ్గించుకోవడం వంటి చర్యలు అన్నీ తీసుకున్నాం. కానీ ముడి వస్తువుల వ్యయాలు ఈ స్థాయిలో ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు. అందుకే రేట్ల పెంపు నిర్ణయం తీసుకోక తప్పలేదు‘ అని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment